దశాబ్దాల డిమాండ్..
52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక స్వప్నం.. ఎడతెగని సాగదీత... గందరగోళం.. వీటన్నింటికీ ఒక్క నిర్ణయం ముగింపు పలికింది. అదే.. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయం. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (పీటీడీ)ని ఏర్పాటు చేశారు. ఫలితం కళ్లముందు కనిపిస్తోంది.
– సాక్షి, అమరావతి
ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం
► పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి.
► ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు రుణాలు పొందుతున్నారు.
► ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించారు. అందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, సహజ మరణానికి కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.
► 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
► 2020–21, 2021–22లో ఉద్యోగుల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ కోసం రూ.165 కోట్లు చెల్లించింది.
► ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏపీ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్‌ను కూడా వర్తింపజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు.
► 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది.
► 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
► 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు
దశాబ్దాల ఆర్టీసీ చరిత్ర మొత్తం ఉద్యోగుల జీతాల కోసం నెల నెలా అప్పులు చేయడం. నెలకు దాదాపు రూ.300 కోట్లు జీతాలకు చెల్లించాలి. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్‌ఎంఎస్ ద్వారా జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది.
ఇందుకోసం నెలకు ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా బస్సు సర్వీసులు తగ్గించింది. టికెట్ల ద్వారా వచ్చే రాబడి గణనీయంగా పడిపోయింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే నెల నెలా జీతాలు చెల్లిస్తోంది. జీతాల భారం తప్పడంతో ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులున్నాయి. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఈ రెండేళ్లలో ఆర్టీసీ రూ.1,500 కోట్ల అప్పులు తీర్చింది.
జీవితాల్లో వెలుగులు నింపారు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న గొప్ప నిర్ణయం 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. నెల నెలా జీతాల కోసం పడిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.’.
– బీఎస్ రాములు, డ్రైవర్, విజయనగరం రీజియన్
ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడ్డ ప్రభుత్వం
ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించింది. ఏ ప్రభుత్వ శాఖలో లేని రీతిలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించింది. త్వరలో పే స్కేళ్లను నిర్ధారించనుంది. దీంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
– ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం
ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటామని ఎందరో చెప్పారు గానీ ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరాయి. ఉద్యోగ భద్రత, పని వేళలు వంటి ప్రభుత్వ విధానాలు అమల్లోకి రావడంతో మాకు ప్రయోజనం కలుగుతోంది.’
– పీహెచ్ వెంకటేశ్వర్లు, మెకానిక్, నెల్లూరు రీజియన్
ఒక్క కి.మీ. తిరగకపోయినా జీతాలు చెల్లించారు
‘కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఒక్క కిలోమీటరు కూడా తిరగకపోయినా ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాయి. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడంతోపాటు ఇతర ప్రయోజనాలూ కల్పిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం ఫలితమే ఇది. ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతతో ఉంటారు.’
– కొండలు, ఆర్టీసీ సూపర్‌వైజర్, గుడివాడ
Comments
Please login to add a commentAdd a comment