సాక్షి, విజయవాడ: నేడు బందర్ రోడ్డులో జరగనున్న ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి సాధారణ జనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం విజయవాడలో సిటీ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బందర్ రోడ్డులో విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. పైగా బందర్ రోడ్డుకు ఆనుకుని ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ర్యాలీ తీస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొన్నారు.
జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీసు శాఖ సహకరిస్తుందని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ర్యాలీలకు అనుమతిచ్చిన రోడ్డులో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలకు మాత్రం ఎలాంటి అనుమతి ఉండదన్నారు. బందర్ రోడ్డులో జరిగే అనుమతి లేని ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. బెజవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయన్నారు. కాగా అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం బందర్ రోడ్డులో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment