అగ్రిగోల్డ్ సదస్సులో బాధితుల ఆగ్రహం
విజయవాడ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే అగ్రిగోల్డ్ సమస్య వచ్చిందని పలువురు బాధితులు ధ్వజమెత్తారు. స్థానిక అమ్మ కల్యాణమండపంలో శనివారం సీఐడీ ఏర్పాటుచేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల అవగాహన సదస్సులో పలువురు సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పలువురు బాధితులు సీఐడీ వారిని నిలదీయడంతో సదస్సు గందరగోళంగా మారింది.
లక్షలాది మంది ఖాతాదారుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కొంతమంది ఖాతాదారులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించిన ఖాతాదారులు తమ ఇళ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతున్నారని ఏజెంట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు వందమంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.
ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే మరెందరో ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఐడీ చీఫ్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ ఆవేశం, ఉద్రేకంతో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. స్పెషల్ కోర్టు నుంచి ఈ కేసు హైకోర్టుకు వెళ్లిందన్నారు.
సీఐడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో హాయ్‌ల్యాండ్ కూడా ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు ఇంకా ఏమైనా సమ్యలు ఉంటే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒక దశలో పలువురు బాధితులు సంయమనం కోల్పోవడంతో సీఐడీ చీఫ్ జోక్యం చేసుకుని ఈ కేసులో తమది దర్యాప్తు సంస్థ మాత్రమేనన్నారు. తాము ఖాతాదారులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సహకరించాలన్నారు.
ఎన్నాళ్లు ఆగాలి
ఎన్నాళ్లు ఆగాలి. మా డబ్బు ఎప్పటికి వస్తుంది. అగ్రిగోల్డ్ కేసు విషయంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. ఆస్తులు వేలం ఎప్పుడు వేస్తారు. ఆస్తులు స్వాధీనం చేసుకున్నందున ప్రభుత్వ ప్యాకేజీ ఇవ్వాలి. ముందుగా కొంత డబ్బు విడుదల చేసి ఖాతాదారులకు చెల్లించాలి. చిల్లిగవ్వలేక నానా అగచాట్లు పడుతున్నాం. వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- లక్ష్మి, రాయగడ, ఒడిశా
మా సొమ్ము ఇప్పించండి..
అగ్రిగోల్డ్ ఎప్పటినుంచో నష్టాల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి రాక ముందు నుంచే చెక్కులు ఆలస్యంగా చెల్లుబాటు అవుతున్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి పాలపక్షం నేతలు ఎందరో అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మాట్లాడుకుని తమ చెక్కులు క్లియర్ అయ్యేలా చూసుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాకే ఈ సమస్య వచ్చింది. వెంటనే హాయ్‌ల్యాండ్‌ను విక్రయించి బాధితులకు సొమ్ము చెల్లించాలి.
- యువరాజు, గుంటూరు