సాక్షి, విజయవాడ : హాయ్‌ల్యాండ్‌ను పోలీస్‌లతో అడ్డుకుని.. అరెస్టులు చేయడం అప్రజాస్వామికం.. అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నయాన్ని ముందుకు తీసుకు రావడానికి విపక్ష పార్టీలు కార్యాచరణ రూపొందించాయని తెలిపారు. వచ్చే నెల 20న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీలు, ఇతర కలిసి వచ్చే పార్టీలతో సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
హాయల్యాండ్ అంశంలో ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను కనీసం ఖండిచడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికై చిత్త శుద్ధితో పని చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెయ్యి కోట్లు కేటాయించి చిన్న మొత్తాల డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై విద్యార్థి యువజన సంఘాలు చేపట్టబోయే కార్యక్రమానికి తమ పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలే తమ ప్రధాన అజెండా అంటూ రామకృష్ణ ప్రకటించారు.
కరువుపై ఆందోళన కార్యక్రమాలు : మధు
తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందకు వెళ్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కరువుతో రైతులు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ కరువుపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై రాబోయే పార్లమెంట్‌లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment