P Madhu
-
బీజేపీతో జతకట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పవన్
నెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బీజేపీతో జతకట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. జనసేన, బీజేపీ కలయిక ప్రజలపై ఆర్థిక భారం మోపేందుకే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. నెల్లూరు రూరల్ పరిధి కొత్తూరులో ప్రారంభమైన సీపీఎం మహాసభలకు ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కేంద్రంలో రెండో దఫా అధికారం చేపట్టిన బీజేపీ నియంత పాలన సాగిస్తోందన్నారు. బ్రిటిష్ పాలకులు ప్రజలను ఇబ్బందులు పెట్టేలా వివిధ రకాల పన్నులు వేశారని, వారిని తలపించే విధంగా నేడు బీజేపీ సర్కార్ జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ ఇలా రకరకాలుగా పన్నులు విధించడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను ఆకాశాన్నంటేలా చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు సాగించడం ఏ మాత్రం తగదన్నారు. -
సొసైటీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
చిలకలూరిపేటటౌన్: యడవల్లి సొసైటీ భూములు ప్రభుత్వం తీసుకోవడాన్ని దళిత రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చేసిన వ్యాఖ్యలపై యడవల్లికి చెందిన రైతులు మండిపడ్డారు. భూముల వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మధును స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా చిలకలూరిపేట పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌కు ర్యాలీగా చేరుకొని సీపీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన పారితోషికం ఇప్పించాలంటూ తాము సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు విన్నవించామని, అది నచ్చని మధు నాటకాలాడొద్దంటూ తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని వివరించారు. గత నెలలో ఎస్సీ కమిషన్ గుంటూరు వచ్చినప్పుడు తాము భూములు ఇస్తామని వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు. 99 శాతం మంది రైతులు భూములు ఇవ్వటానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించి భూములను ప్రభుత్వం తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే భూములు స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇస్తారన్న భరోసాతో ఉన్నామని, ఈ సమయంలో ఏ రాజకీయపార్టీ కూడా జోక్యం చేసుకోవద్దని కోరారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యడవల్లి సొసైటీ భూముల రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ హామీలో భాగంగా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు ముందడుగు వేసిందని, దీన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తమ భూములు స్వాధీనం చేసుకుంటే ప్రతి కుటుంబానికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని వివరించారు. సమావేశంలో ఈపూరి రాంబాబు, పరిశపోగు శ్రీనివాసు, వేల్పుల సాంబయ్య, రమేష్, అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 29 నుంచి దీక్షలు
సాక్షి, అమరావతి/సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేయాలని పది వామపక్ష పార్టీలు రైతులకు పిలుపునిచ్చాయి. ప్రస్తుత కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి కొనసాగింపుగా ఈ నిరశన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయాన్ని చర్చించేందుకు శనివారం పది వామపక్ష పార్టీలు విజయవాడలోని సీపీఎం కార్యాలయంలో భేటీ అయ్యాయి. సమావేశం అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా జరిగే దీక్షల్లో వామపక్షపార్టీలతో పాటు రైతు శ్రేయోభిలాషులందరూ పాల్గొనేలా చూస్తామన్నారు. దీక్షల నిర్వహణపై ఆది, సోమవారాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు దోచిపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ బిల్లులు మూడింటిని కేంద్ర ఉపసంహరించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో వామపక్ష నేతలు జల్లి విల్సన్, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ప్రకటన ముదావహం: సీపీఎం
సాక్షి, అమరావతి: కరోనాపై మతం ముద్ర వేయొద్దని, భారతీయులుగా ఐక్యంగా పోరాడదామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపును ఆహ్వానిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని, డాక్టర్లు కుల, మతాలకతీతంగా రోగులందరికీ వైద్యం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకొని కరోనాను సమర్ధవంతంగా అరికట్టాలని మధు కోరారు. కరోనా నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ముదావహం అని పేర్కొన్నారు. సీఎం సంయమనం అనుసరణీయం: అధికార భాషా సంఘం కరోనాకు మతం లేదని, జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మతపరమైన రంగు ఆపాదించవద్దంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర అధికార భాషా సంఘం స్వాగతించింది. ఈ విషయంలో సీఎం వైఎస్ సంయమనం అనుసరణీయమని ఆ సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సభ్యుడు చందు సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా బాధితుల పట్ల మనమంతా ఆప్యాయంగా వ్యవహరించాలని వారిని మనం వేరుగా చూడరాదన్న సీఎం అభిలాష ఆయన వాస్తవిక దృక్పధానికి అద్దం పడుతోందన్నారు. (ఏపీలో కరోనా పాజిటివ్‌లు 252) -
అమిత్ షా ప్రకటన అసమంజసం: మధు
చల్లపల్లి (అవనిగడ్డ): దేశంలో హిందీ భాషను అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలనే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2022 నాటికి భారతదేశం మొత్తం హిందీ భాష అమలు జరగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు అమిత్ షా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల యూనియన్‌గా కొనసాగుతున్న భారతదేశ ఫెడరల్ విధానానికి బీజేపీ తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో ఎవరి భాష వారికి అత్యంత ముఖ్యమైందని, భాషల మధ్య భేదాలను రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదన్నారు. -
‘చంద్రబాబు బరితెగించారు.. అందుకే ఇలా’
సాక్షి, విజయవాడ : ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదాన్ని ‘కంపెనీలకే భూమి’ అన్న చందంగా సీఎం చంద్రబాబు మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని బరితెగించి.. పారదర్శకత లేకుండా కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రచించిన ‘అమరావతి అడుగులెటు..?’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పి. మధు, సీపీఎం వర్గసభ్యుడు వై. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఎంబీ భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..2013 భూసేకరణ చట్టం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేయడం ఇదే ప్రథమని అన్నారు. అమరావతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిందని దుయ్యబట్టారు. ఇష్టారీతిన కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడం అనేక వివాదాలకు కారణమవుతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని.. అధికారంలోకి వస్తే తమకు కావాల్సిన వారికి భూములను కట్టబెట్టవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. అన్నీపరిశీలించిన తర్వాతే.. ప్రజలు ఆశించిన పాలనను చంద్రబాబు అందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని.. రైతుల నుంచి పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడం వివాదంగా మారిందని పేర్కొన్నారు. రైతుల భూమితో ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రైతు కూలీలు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులు, రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ప్రపంచ బ్యాంకు నివేదికలను కూడా పరిశీలించి తెలకపల్లి రవి అమరావతి అడుగులెటు..? పుస్తకం రచించారని పేర్కొన్నారు. అమరావతి ప్రణాళిక, ప్రచారం, ప్రజాందోళన తదితర పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పుస్తకాన్ని వెలువరించారని తెలిపారు. -
ప్రభుత్వ డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరింది?
సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తారా? అని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈమేరకు సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, పి.మధు సోమవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. గత నెల 28న ఒక్కరోజే 1.9 లక్షల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు అందినట్లు ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఉన్నప్పటికీ వారికి తెలియకుండా ఆన్లైన్ పద్ధతిలో వేలాది సంఖ్యలో సామూహికంగా ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం కొంతమంది వ్యక్తులు ఫారం–7ను దరఖాస్తు చేస్తున్నారంటే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తున్నట్టు? అని నిలదీశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని నిర్వహిస్తున్న ప్రధాన వెండర్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటికొస్తుందని పేర్కొన్నాయి. దర్యాప్తు చేసి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. నకిలీ దరఖాస్తులతో ఓట్ల తొలగింపు ఎలా సాధ్యమో ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని వామపక్ష నేతలు కోరారు. -
చంద్రబాబుకు వామపక్షాల ఝలక్
సాక్షి, అమరావతి: రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం ఆవేళ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే అంతా మద్దతు పలికేవారమంటున్నాయి. ప్రధాని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తిట్టిపోతే రేపు బాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిపై దుమ్మెత్తిపోస్తారు... వీటితో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కొందరు తమను ఆహ్వానించిన మాట నిజమేనని, తాము రాలేమని స్పష్టం చేసినట్టు తెలిపారు. -
‘మహిళలకిచ్చిన రూ. 10 వేలు మళ్లీ వసూలు చేస్తారా’
సాక్షి, విజయవాడ : అఖిలపక్ష భేటీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని.. అందుకే ఈ సమావేశాలకు తాము దూరంగా ఉంటున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోందని విమర్శించారు. పసుపు - కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ఇస్తున్నరూ.10 వేలు రుణమా.. లేక ఉచితంగా ఇస్తున్నారా అనే అంశాన్ని జీవోలో స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. అంటే మళ్లీ అధికారంలోకి వస్తే మహిళల దగ్గర నుంచి ఈ డబ్బు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. జయహో బీసీల పేరు చంద్రబాబు వారిని మోసగిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో 20 వేల మంది ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 1200 ఇళ్లు మాత్రమే నిర్మించారని తెలిపారు. చంద్రబాబు, బీజేపీతో ములాఖత్ అయ్యి ప్రత్యేకహోదాను గాలికోదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం పోరాడుతున్న మాపై కేసులు పెడుతున్నారని మండి పడ్డారు. అఖిలపక్ష భేటీ వల్ల విధానపరంగా ఎటువంటి ఉపయోగం ఉండదని.. అందుకే ఈ సమావేశాలకు తాము దూరంగా ఉంటున్నామని తెలిపారు మధు. -
‘వారి చేతుల్లో టీడీపీ ఓటమి ఖాయం’
సాక్షి, విజయవాడ : హాయ్‌ల్యాండ్‌ను పోలీస్‌లతో అడ్డుకుని.. అరెస్టులు చేయడం అప్రజాస్వామికం.. అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నయాన్ని ముందుకు తీసుకు రావడానికి విపక్ష పార్టీలు కార్యాచరణ రూపొందించాయని తెలిపారు. వచ్చే నెల 20న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీలు, ఇతర కలిసి వచ్చే పార్టీలతో సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. హాయల్యాండ్ అంశంలో ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను కనీసం ఖండిచడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికై చిత్త శుద్ధితో పని చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెయ్యి కోట్లు కేటాయించి చిన్న మొత్తాల డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై విద్యార్థి యువజన సంఘాలు చేపట్టబోయే కార్యక్రమానికి తమ పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలే తమ ప్రధాన అజెండా అంటూ రామకృష్ణ ప్రకటించారు. కరువుపై ఆందోళన కార్యక్రమాలు : మధు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందకు వెళ్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కరువుతో రైతులు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ కరువుపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై రాబోయే పార్లమెంట్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
అభివృద్ధిపై బాబు చెప్పేవన్నీ అబద్ధాలే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని వెల్లడించారు. ఇదే భూమిని రైతులకు సాగుకోసం ఇచ్చి ఉంటే సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తి జరిగి ఉండేదని, అలాగే దాదాపు పాతిక వేల మందికి ఉపాధి లభించేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీలకు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ముసుగులో చేసిన భూసేకరణ, వచ్చిన పరిశ్రమలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామాయపట్నంలో పోర్టును ప్రభుత్వరంగంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. విభజన హామీల్లో ఇచ్చిన అన్నీ ప్రభుత్వరంగంలోనే చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. రాజధాని బాండ్ల వ్యవహారంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, బాండ్ల కొనుగోళ్లలో వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 10.5 శాతం వడ్డీ ఎలా ఇస్తారో ప్రజలకు సవివరంగా చెప్పాలని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
బలవంతపు భూసేకరణ నిలిపేయాలి: సీపీఎం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయడాన్నిచంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రాజధాని రైతులతో బుధవారం మధు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయం అని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సవరణలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పార్లమెంటులో ఆమోదించిన 2013 భూసేకరణ చట్టానికి నవంబర్ 20, 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తయారు చేసిందని.. 2013 భూసేకరణ చట్టం రైతులకు కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. భూసేకరణ చట్టం సవరణపై, టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం సీపీఎం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చాలా ప్రమాదకరమైన భూసేకరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్టం వల్ల కోర్టుకు వెళ్లినా ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అసెంబ్లీలో లేని సమయంలో టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టిందని, ఇలాంటి పని చేయడం చాలా మోసపూరిత చర్య అని విమర్శించారు. -
హోదా కోసం ఉద్యమిస్తే అరెస్టులా?
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోరుతూ జరిగే ఆందోళనను అణగదొక్కడం అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం చేసిన విద్రోహానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంద్ చేస్తున్న ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. బంద్‌ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించడం ఆక్షేపణీయమని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అణచివేసే చర్యలు విడనాడాలని వారు హితవు పలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగే ‘మానవహారం’ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహారం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. -
గుంటూరులో ఉద్రిక్తత.. మధు అరెస్టు
-
గుంటూరులో సీపీఎం ఆందోళన.. ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : నగరంలో గురువారం ఉదయం సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో అమాయకులను అరెస్టు చేశారంటూ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారిని పరామర్శించేందుకు ఆయన గురువారం పోలీసు స్టేషన్ వచ్చారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయినా మధు వెనుకకు తగ్గకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సీపీఎం శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. -
ప్రజా ఉద్యమాలకు ఇదే అదును, కదలండి!
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్ర ప్రజల్లో అసహనం పెరుగుతోంది. నాయకత్వం అందిపుచ్చుకోవాలి. లేకుంటే ప్రజలు ఛిన్నాభిన్నం అయిపోతారు. ఉద్యమాలకు ఇదే సమయం, నాయకత్వం మరింత రాటుదేలాలి’’ అని సీపీఎం జాతీయ నేతలు కారత్,రాఘవులు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని వినియోగించుకుని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు నడుం కట్టాలని సూచించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు కొత్త కార్యవర్గం ఎన్నికతో సోమవారం ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సీపీఎం నేత మధు అరెస్ట్, ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలో మంగళవారం ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పెదగొట్టిపాడు దళితుల సమస్యలపై మధు స్పందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రజాసంఘాలతో కలిసి గ్రామాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే సీపీఎం నేతలను పెదగొట్టిపాడుకు వెళ్లనివ్వకుండా పోలీసులు ముందుస్తు అరెస్టులు చేపట్టారు. ఇందులో భాగంగా మధుతో పాటు పలువురు సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. -
చంద్రబాబు చేతకానితనం వల్లే..!
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వామపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. చంద్రబాబు చేతకానితనం వల్లే విభజన హామీలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. విభజన హామీలపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశాయి. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించాయి. విభజన హామీలపై సోమవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కన్నా.. ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని స్వయంగా చంద్రబాబే అనారని, తెలుగుదేశం అధికార దాహానికి ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టారని మధు మండిపడ్డారు. ప్రధాని మోదీ ఏడాదికిపైగా చంద్రబాబుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఇంటర్వ్యూ కోసం బతిమిలాడుకున్న వ్యక్తి ఏం పోరాటం చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు పోయే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. హైకోర్టు విభజన కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేసి.. వచ్చే జూన్ నాటికి అది సాకారమయ్యేలా హామీ తెచ్చుకున్నారని, ఈపాటి తెగువ కూడా టీడీపీ ఎంపీలకు ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు ప్యాకేజీ ప్రకటనను వ్యతిరేకించి ఉంటే.. ఈనాడు ఈ దుర్గతి పట్టేది కాదని అన్నారు. అప్పుడే విభజన హామీల కోసం ఎందుకు పట్టుబట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అంటూ చంద్రబాబు ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. ఈ నెల 24న గుంటూరుజిల్లా పెదగొట్టిపాడు గ్రామ సందర్శిస్తామని పి.మధు, కె.రామకృష్ణ తెలిపారు. దళితులపై దాడులు దారుణమని, ఈ దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
విభజన హామీలపై ఉమ్మడి పోరు
ఇబ్రహీంపట్నం(మైలవరం): రాష్ట్ర విభజన హామీల సాధనకు ఫిబ్రవరిలో ఉమ్మడి పోరుకు శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు తెలిపారు. పశ్చిమ కృష్ణా జిల్లా మహాసభలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏవిధమైన హామీలు పొందారు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాడితే తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. గుంటూరు జిల్లా గొట్టుపాడులో దళితులపై దాడిచేసిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములను అరెస్ట్ చేయకపోతే ‘చలో గుంటూరు’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు సిద్ధం కండి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా రింగ్సెంటర్లో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఏ కాలనీ గ్రౌండ్ నుంచి స్థానిక రింగ్‌సెంటర్ వరకు కార్యకర్తలు, పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో బాబూరావు మాట్లాడుతూ పాలకులు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారలు మోపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆయిల్ ఉత్పత్తుల ధరలు పెంచడమేనని చెప్పారు. ధరలు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఉద్యమించనున్నుట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, స్వరూపారాణి, జమలయ్య, శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆర్.రఘు, నాగేశ్వరరెడ్డి, పీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. పశ్చిమ కృష్ణా కార్యదర్శిగా డీవీ కృష్ణ రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఎం జిల్లా మహాసభలో పశ్చిమకృష్ణా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా డీవీ కృష్ణ, కార్యవర్గదర్శివర్గ సభ్యులుగా దోనేపూడికాశీనా«థ్, ఎన్సీహెచ్ శ్రీనివాస్, శ్రీదేవి, పీవీ ఆంజనేయులు, నాగేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్లను ఎన్నికయ్యారు. మరో 24 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'
-
'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 21మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారని, అయితే వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించకపోగా నలుగురికి సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఫిరాయిస్తే చంద్రబాబు తీవ్రస్థాయిలో ఎండగట్టారని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తుచేశారు. సాక్షాత్తూ సీఎం హోదాలో ఉన్నా చంద్రబాబు మాత్రం ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించారని, అయితే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంస్కృతికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై వైఎస్సార్సీపీ నిర్ణయాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పార్టీ ఫిరాయింపుదారులను రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సూచించారు. దీనివల్ల రాజకీయాలు భ్రష్టుపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శిల్పాచక్రపాణిరెడ్డి నైతికతకు కట్టుబడి వ్యవహరించారని పేర్కొన్నారు. రాజకీయపక్షాలు ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని మధు హితవు పలికారు. -
‘భారీ బహిరంగ సభతో ప్రత్తిపాటికి చెక్’
చిలకలూరిపేట(గుంటూరు): అధికార టీడీపీకి పోయేకాలం దాపురించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. టీడీపీ వర్గీయులు గ్రామంలోని దళితులు, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న 156 ఎకరాల పట్టా భూమిలో నీరు-చెట్టు పథకం ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన సభలో మధు మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నీరు-చెట్టు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గంలో వందలాది ఎకరాల దళితుల, బలహీనవర్గాల భూములను టీడీపీ నాయకులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. మరోవైపు మంత్రి భార్య ఈ దోపిడికి కీలకంగా నిలుస్తున్నారని, ఆమె సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మంత్రి ప్రత్తిపాటి ఆగడాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
‘భూములిచ్చేయ్..లేకపోతే..’
► తొలకరి నాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి ► లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ► ప్రత్తిపాటిని హెచ్చరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చిలకలూరిపేట: ‘దళితుల భూములు కాజేయడానికి నీకెంత ధైర్యం. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. ఆక్రమించుకున్న భూములను తొలకరి సాగునాటికి రైతులకు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఘాటుగా హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భూముల అన్యాక్రాంతానికి నిరసనగా గురువారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూములు కాజేసేవారిని, ప్రోత్సహించేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలవాల్సిన మంత్రి పుల్లారావు దళితులనే లక్ష్యంగా ఎంచుకుని భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. దర్జాగా కబ్జా చేస్తున్నారు దశాబ్దాల నుంచి సాగుచేసుకుంటున్న పచ్చని పంట పొలాలను గ్రానైట్ నిక్షేపాల పేరుతో దౌర్జన్యంగా, దర్జాగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తనకు సంబధం లేదని బుకాయిస్తున్న ప్రత్తిపాటి.. యడవల్లి దళతులకు చెందిన 416 ఎకరాల ఏకపట్టాను ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. వేలూరు గ్రామంలో 41.50 ఎకరాల దళితుల భూములను నీరు- చెట్టు పేరిట «ధ్వంసం చేసి రూ. 62 లక్షల మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. తూబాడులో 18 ఎకరాలు, అప్పాపురంలో 50ఎకరాలు ఇలా ఎటు చూసినా దళితుల భూములను లాక్కొని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రమేయంతోనే ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వరుస రాజకీయ హత్యలు జరిగాయని మధు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరడం సబబేనన్నారు. -
టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయి
విజయవాడ: కమ్యూనిజానికి, సోషలిజానికి మరణం లేదని, దేశంలో వామపక్షాలను మట్టుపెట్టాలనుకుంటున్న వారికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. మే డే సందర్బంగా పటమటలో పార్టా జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంగా ఉన్నంతకాలం కార్మిక లోకానికి మరణం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను చంద్రబాబు తన ప్రచార అర్భాటాలకు వాడుకోవడం సరికాదన్నారు. పరిశ్రమాధిపతుల కోసం చంద్రబాబు శాంతిభద్రతల జపం చేస్తున్నారని, కార్మిక విధానాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా సంఘటితం కావాలని మధు పిలుపునిచ్చారు. ప్రజల గురించి అలోచించే ముఖ్యమంత్రి అయితే పటమటలో కలుషిత నీటిపై దృష్డి పెట్డాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేనప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అని ప్రశ్నించారు. టీడీపీతో జతకట్టే సీపీఎం బలహీనపడిందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ రానున్నవి అన్నీ మంచి రోజులేనన్నారు. -
చంద్రబాబు పాలనపై పి. మధు ఫైర్
విజయవాడ : చంద్రబాబు రెండేళ్ల పాలనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నిప్పులు చెరిగారు. బుధవారం విజయవాడలో పి.మధు మాట్లాడుతూ... చంద్రబాబు తన రెండేళ్లపాలనలో 79 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించారని ఆరోపించారు. విభజన సమయానికి రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉందని.. వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగం, ఉపాధి, అధిక ధరలపై జులై 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వివరించారు. -
'ప్రతిపక్షం లేకుండా చేయాలని బాబు కుట్ర'
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు బుధవారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బాబు కొంటున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై అన్ని పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని పి. మధు స్పష్టం చేశారు. -
'అందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారు'
తిరుపతి : చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారణమని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా బలం పెరిగిందనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవా చేశారు. వాపును చూసి టీడీపీ బలమనుకుంటుందని విమర్శించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తే అది సాధ్యం కాదని పి.మధు స్పష్టం చేశారు. దళితుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. వేసవిలో మజ్జిగ సరఫరా చేస్తామని ప్రభుత్వం అంటుందని కానీ అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ఫ్యాక్టరీ హెరిటేజ్ ఉత్పత్తులను అమ్ముకోవడానికి చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని పి.మధు చెప్పారు. -
'ఆ ఘనత చంద్రబాబుదే'
అనంతపురం : సీఎం చంద్రబాబుపై ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు శనివారం అనంతపురంలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారమయం చేసిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. ఎన్నికల హామీలను పక్కన పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చంద్రబాబుపై మధు మండిపడ్డారు. -
ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన: పి.మధు
సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో దౌర్జన్యకర దుర్మార్గపు పాలన సాగుతోందని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించి ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ర్టప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యపోరాటాలతో ఎదుర్కొంటామని హెచ్చరించారు. రెండు రోజులపాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల తీర్మానాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. బాక్సైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలపై హత్య కేసు బనాయించడం దారుణమన్నారు. విశాఖ ఏజన్సీలో మావోయిస్టులు చేసిన హత్యను ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులను రోజుల తరబడి పోలీసులు చిత్రవద చేసి భయానక పరిస్థితి కల్పించారని ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ మత దురహంకారంతో మేధావుల హత్యలు, మైనారిటీలపై దాడులు. రోహిత్ ఆత్మహత్యపైన కనీసం స్పదించడంలేదని తప్పుబట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఫిబ్రవరి 20 నుంచి వామపక్షాల బస్సుయాత్ర చేపడతామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం, పేదలకు ఇళ్ల స్థలాలు, రైతుల భూములకు భరోసా, ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మార్చి 10న చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. 45 మండలాలకు మంచినీరు అందించే కండలేరు ప్రాజెక్టు రద్దుకు నిరసనగా జనవరి 31న జరిగే ప్రత్యక్ష ఆందోళనలోను, భోగాపురంలో బలవంతపు భూసేకరణకు నిరసనగా ఫిబ్రవరి 4న జరిగే కార్యక్రమంలోను పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొంటారన్నారు. రాజధాని, ఎయిర్‌పోర్టులు, ప్రోజెక్టుల పేరుతో రైతాంగం నుంచి చట్టవిరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకోవడంపై అన్ని జిల్లాల్లోనూ పోరాట కార్యక్రమాలు చేపడతామన్నారు. వంశధార, పులిచింతల రిజర్వాయర్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు న్యాయం చేయకుండా వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సింగపూర్ కన్సార్టీయం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు రాజధాని పనులు అప్పగించే ఏకపక్ష నిర్ణయాలు భవిష్యత్‌లో ఇబ్బందికరంగా పరిణమిస్తాయన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలను కాదని జన్మభూమి కమిటీలకు అప్పగించడం దారుణమని, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంపన్నవర్గాలు, కార్పొరేట్లకు భూ పందేరంతో సహా అనేక రాయితీలిస్తున్న ప్రభుత్వం చిరుద్యోగులు, రైతులు, పేదలు పట్ల కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పాటూరి రామయ్య, వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణ చేస్తే అసెంబ్లీ ముట్టడిస్తాం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో బలవంతపు భూ సేకరణ చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. గురువారం పి.మధు విజయవాడలో మాట్లాడుతూ... అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి 1400 గజాల స్థలాన్ని రైతులకు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో మరో 300 ఎకరాల భూమి కోసం చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు గురించి మాట్లాడకపోతే పొరపాటే..
-
'చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి'
చిత్తూరు(శాంతిపురం): రైతుల ఉసురు పోసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయూనికి ఎంపిక చేసిన ప్రాంతంలోని గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు. అనంతరం కనువులదొడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి రైతులు విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పేద రైతుల ఆధీనంలోని లక్షలాది ఎకరాల భూమిని లాక్కుని ల్యాండ్ బ్యాంకు పేరుతో కోట్ల రూపాయలు దండుకునే కుట్ర సాగుతోందన్నారు. రాజధాని కోసం 4 లేదా 5 వేల ఎకరాలు సరిపోతాయని నిపుణులు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా 50 వేల ఎకరాలు స్వాధీనం చేసుకుంటోందన్నారు. మొత్తం భూమిని రియల్టర్లకు ఇచ్చి లీజు పేరుతో ప్రభుత్వ పెద్దలు దోచుకునే ప్రయుత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బాధిత రైతులను ఒక్కటి చేసి ప్రభుత్వ మెడలు వంచుతామని చెప్పారు. దీనిపై మిగతా పార్టీలతో చర్చించి చలో అసెంబ్లీ, లేదా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కుప్పంలో ఆటవిక రాజ్యం నడపాలని చంద్రబాబు అనుకుంటే ఇకపై సాగదని హెచ్చరించారు. గతంలో కమ్యూనిస్టు నాయకుడు గఫూర్ కుప్పంలో జరప తలపెట్టిన సభను అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇక్కడి పోలీసుల పనితీరుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
బాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో మధు మాట్లాడుతూ... రుణమాఫీ కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మధు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని చంద్రబాబు ప్రభుత్వంపై మధు మండిపడ్డారు. -
బాబుపై కేసు నమోదు చేయకుంటే ...
విశాఖపట్నం: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్రం, టీఆర్ఎస్ ప్రభుత్వాలు... టీడీపీతో లాలూచీ పడ్డాయని ప్రజలు భావించ వలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో మధు మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లా పొలాకిలో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఒప్పంద పత్రాలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. అంతేకాకుండా పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం 1500 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రయత్నాలు మొదలైనాయని ఆయన విమర్శించారు. జూన్ 23 నుంచి ప్రారంభం కానున్న లారీల సమ్మెకు సీపీఎం మద్దతు ఉంటుందని పి.మధు వెల్లడించారు. -
'ఆ వాటా ఏపీకి దక్కాల్సిందే'
విజయవాడ: కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ తరలించుకు పోతున్న గ్యాస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన వాటాను దక్కించుకుంటే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలయన్స్ నుంచి వాటా రాబట్టలేక ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్, పెట్రోల్ ఛార్జీల పెంపుపై ఉద్యమించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరలను పెంచుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో బాబు రాగానే జాబు ఇస్తానన్న చంద్రబాబు ఉన్న జాబులను పీకేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని మధు విమర్శించారు. -
చంద్రబాబుది నిరంకుశ పాలన
చిలకలూరిపేటటౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పద్ధతుల్లో పాలన చేస్తున్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు విమర్శించారు. స్థానిక నన్నపనేని వెంకటరత్నం కళ్యాణమండపంలో సీపీఎం జిల్లా మహాసభలు ఆదివారం ముగిసాయి. కార్యక్రమంలో మధు మాట్లాడుతూ గత ఆరునెలల కాలంలో రాజధాని నిర్మాణం, హుద్‌హుద్ తుపాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు అంశాలపై ప్రతిపక్షాలతో ఒక్కసారి కూడా చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. అలాంటిది తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలతో సంప్రదించి ఏకగ్రీవం చేసుకోవటానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలపై నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసుల ద్వారా ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ,టీడీపీలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ దారుణంగా నష్టపోగా, విభజనకు మద్దతు పలికిన టీడీపీ రాజకీయంగా లబ్ధి పొందిందన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు డాక్టర్ హేమలత, నాయకులు వి.కృష్ణయ్య, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రసంగించారు. జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా మహాసభల్లో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా సింహాద్రి శివారెడ్డి, గద్దె చలమయ్య, వై నేతాజీ, జొన్నా శివశంకర్, జేవీ రాఘవులు, వై రాధాకృష్ణమూర్తిలను ఎన్నుకున్నారు. మరో 31 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా నియమించారు.