సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు(పాత చిత్రం)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని వెల్లడించారు. ఇదే భూమిని రైతులకు సాగుకోసం ఇచ్చి ఉంటే సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తి జరిగి ఉండేదని, అలాగే దాదాపు పాతిక వేల మందికి ఉపాధి లభించేదని అన్నారు.
రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీలకు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ముసుగులో చేసిన భూసేకరణ, వచ్చిన పరిశ్రమలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామాయపట్నంలో పోర్టును ప్రభుత్వరంగంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. విభజన హామీల్లో ఇచ్చిన అన్నీ ప్రభుత్వరంగంలోనే చేపట్టాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. రాజధాని బాండ్ల వ్యవహారంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, బాండ్ల కొనుగోళ్లలో వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 10.5 శాతం వడ్డీ ఎలా ఇస్తారో ప్రజలకు సవివరంగా చెప్పాలని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment