
సాక్షి, విజయవాడ: గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామని, మరోసారి అందుకు సిద్ధంగా లేమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, సీపీఎంతో పాటు మిగిలిన అన్ని పార్టీలు రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అయితే బీజేపీ, సీపీఎం నేతలు ఈ సమావేశానికి హజరుకాకుండా చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీతో కలవడం కోసమే చంద్రబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. టీడీపీకి తోక పార్టీగా ఉండటం తమకు ఇష్టం లేదని, సొంతంగానే ఉద్యమాలు చేస్తామని పేర్కొంటున్నారు.
మాటమీద నిలబడని వ్యక్తి పవన్
అదే విధంగా సీపీఎం సైతం చంద్రబాబు తీరును తప్పుబట్టింది. రాజధాని రైతులు, రైతు కూలీలను చంద్రబాబు మోసం చేశారని సీపీఎం విమర్శించింది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తమ సిద్ధాంతం అని వెల్లడించింది. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ.. ‘ఏపీ రాజధాని అంశం వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ భేటీకి సీపీఎం హాజరు కావడం లేదు. వికేంద్రీకరణ ప్రాతిపదిక మీద రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలి. హైదరాబాద్ రాజధాని సందర్భంగా జరిగిన తప్పిదాలె మరోసారి జరగొద్దు. పవన్ కల్యాన్ మతం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మాట మీద నిలబడని వ్యక్తి పవన్. బీజేపీ, అమిత్ షాలను పొడగటం సిగ్గుచేటు. ఏపీలో జనసేన మనుగడ ప్రశ్నార్థకం. దిశ కేసు నిందితులపై పవన్ వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనం’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment