సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వామపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. చంద్రబాబు చేతకానితనం వల్లే విభజన హామీలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. విభజన హామీలపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశాయి. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించాయి. విభజన హామీలపై సోమవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కన్నా.. ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని స్వయంగా చంద్రబాబే అనారని, తెలుగుదేశం అధికార దాహానికి ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టారని మధు మండిపడ్డారు.
ప్రధాని మోదీ ఏడాదికిపైగా చంద్రబాబుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఇంటర్వ్యూ కోసం బతిమిలాడుకున్న వ్యక్తి ఏం పోరాటం చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు పోయే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. హైకోర్టు విభజన కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేసి.. వచ్చే జూన్ నాటికి అది సాకారమయ్యేలా హామీ తెచ్చుకున్నారని, ఈపాటి తెగువ కూడా టీడీపీ ఎంపీలకు ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు ప్యాకేజీ ప్రకటనను వ్యతిరేకించి ఉంటే.. ఈనాడు ఈ దుర్గతి పట్టేది కాదని అన్నారు. అప్పుడే విభజన హామీల కోసం ఎందుకు పట్టుబట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అంటూ చంద్రబాబు ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు.
ఈ నెల 24న గుంటూరుజిల్లా పెదగొట్టిపాడు గ్రామ సందర్శిస్తామని పి.మధు, కె.రామకృష్ణ తెలిపారు. దళితులపై దాడులు దారుణమని, ఈ దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment