టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయి
విజయవాడ: కమ్యూనిజానికి, సోషలిజానికి మరణం లేదని, దేశంలో వామపక్షాలను మట్టుపెట్టాలనుకుంటున్న వారికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. మే డే సందర్బంగా పటమటలో పార్టా జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంగా ఉన్నంతకాలం కార్మిక లోకానికి మరణం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను చంద్రబాబు తన ప్రచార అర్భాటాలకు వాడుకోవడం సరికాదన్నారు.
పరిశ్రమాధిపతుల కోసం చంద్రబాబు శాంతిభద్రతల జపం చేస్తున్నారని, కార్మిక విధానాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా సంఘటితం కావాలని మధు పిలుపునిచ్చారు. ప్రజల గురించి అలోచించే ముఖ్యమంత్రి అయితే పటమటలో కలుషిత నీటిపై దృష్డి పెట్డాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగడానికి నీళ్లు లేనప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అని ప్రశ్నించారు. టీడీపీతో జతకట్టే సీపీఎం బలహీనపడిందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ రానున్నవి అన్నీ మంచి రోజులేనన్నారు.