యర్రగొండపాలెం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2008 నాటికే, పూర్తి చేయాల్సి ఉన్నా తట్టెడు మట్టి కూడా తవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టును విస్మరించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఆరోపించారు. 2014లో మళ్లీ అధికారంలో కొచ్చిన చంద్రబాబు ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది మేమే, పూర్తి చేసేది మేమే అంటూ ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, సీపీఎం పశ్చిమ ప్రకాశం కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ గద్దెనెక్కిన నాలుగేళ్ల కాలంలో కేవలం 4 కి.మీ, కూడా సొరంగ మార్గం పూర్తి కాలేదన్నారు.
ఒక వైపు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అర్ధం కాక ప్రజలు ఆందోళన చెందుతుంటే, సీఎం చంద్రబాబు 2019 సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి, సాగు నీరందిస్తామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రాజక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.200 కోట్లు కేటాయించి సంక్రాంతి నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని, చంద్రబాబుకు ఏమైనా మలయాళీ మంత్రాలు వచ్చా అని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ప్రజలను మోసగించడమేనని ఆరోపించారు. దీనిని తాము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. సంక్రాంతికి నీరిస్తారా, లేకుంటే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు, ప్రాజెక్టును పూర్తి చేసి చూపాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు వస్తే వర్షాలకు కరువే..
టీడీపీ అధికారంలో కొస్తే వర్షాలు కురవవని ప్రజల్లో గట్టి నమ్మకం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఈ నాలుగేళ్లలో సరైన వర్షాలు కురవలేదన్నారు. ఫలితంగా పంటలు పండక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఏటా కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారే తప్ప, కరువు సాయం అందడం లేదని విమర్శించారు. జిల్లాలో 56 మండలాలు ఉండగా, ఈ యేడాది 40 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో త్రిపురాంతకం మినహా 4 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించక పోవడం బాధాకరమన్నారు.
ఈ ప్రాంతంలో కరువు అధికారులకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. 4, 5 విడతల రుణమాఫీని కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు గుమ్మా బాలనాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాలి వెంకటరామిరెడ్డి, పీవీ శేషయ్య, డి.సోమయ్య, కార్యవర్గ సభ్యులు డీఎంకే రఫీ, కె.కళావతి, దాసర్‌రెడ్డి, రూబేను, ఆవులయ్య, ఏరియా నాయకులు షేక్ వలీసాహెబ్, అమీర్‌బాషా, కందుల ప్రభాకర్, కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment