
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయడాన్నిచంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రాజధాని రైతులతో బుధవారం మధు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయం అని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ సవరణలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
పార్లమెంటులో ఆమోదించిన 2013 భూసేకరణ చట్టానికి నవంబర్ 20, 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు తయారు చేసిందని.. 2013 భూసేకరణ చట్టం రైతులకు కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. భూసేకరణ చట్టం సవరణపై, టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం సీపీఎం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
చాలా ప్రమాదకరమైన భూసేకరణ చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్టం వల్ల కోర్టుకు వెళ్లినా ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అసెంబ్లీలో లేని సమయంలో టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టిందని, ఇలాంటి పని చేయడం చాలా మోసపూరిత చర్య అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment