
'అందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారు'
తిరుపతి : చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారణమని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా బలం పెరిగిందనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవా చేశారు. వాపును చూసి టీడీపీ బలమనుకుంటుందని విమర్శించారు.
ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తే అది సాధ్యం కాదని పి.మధు స్పష్టం చేశారు. దళితుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. వేసవిలో మజ్జిగ సరఫరా చేస్తామని ప్రభుత్వం అంటుందని కానీ అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ఫ్యాక్టరీ హెరిటేజ్ ఉత్పత్తులను అమ్ముకోవడానికి చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని పి.మధు చెప్పారు.