
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు
సాక్షి, అమరావతి: కరోనాపై మతం ముద్ర వేయొద్దని, భారతీయులుగా ఐక్యంగా పోరాడదామంటూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపును ఆహ్వానిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని, డాక్టర్లు కుల, మతాలకతీతంగా రోగులందరికీ వైద్యం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకొని కరోనాను సమర్ధవంతంగా అరికట్టాలని మధు కోరారు. కరోనా నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ముదావహం అని పేర్కొన్నారు.
సీఎం సంయమనం అనుసరణీయం: అధికార భాషా సంఘం
కరోనాకు మతం లేదని, జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మతపరమైన రంగు ఆపాదించవద్దంటూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర అధికార భాషా సంఘం స్వాగతించింది. ఈ విషయంలో సీఎం వైఎస్ సంయమనం అనుసరణీయమని ఆ సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సభ్యుడు చందు సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా బాధితుల పట్ల మనమంతా ఆప్యాయంగా వ్యవహరించాలని వారిని మనం వేరుగా చూడరాదన్న సీఎం అభిలాష ఆయన వాస్తవిక దృక్పధానికి అద్దం పడుతోందన్నారు. (ఏపీలో కరోనా పాజిటివ్‌లు 252)
Comments
Please login to add a commentAdd a comment