మాట్లాడుతున్న కె.రామకృష్ణ, పి.మధు
సాక్షి, అమరావతి/సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేయాలని పది వామపక్ష పార్టీలు రైతులకు పిలుపునిచ్చాయి. ప్రస్తుత కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి కొనసాగింపుగా ఈ నిరశన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయాన్ని చర్చించేందుకు శనివారం పది వామపక్ష పార్టీలు విజయవాడలోని సీపీఎం కార్యాలయంలో భేటీ అయ్యాయి.
సమావేశం అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా జరిగే దీక్షల్లో వామపక్షపార్టీలతో పాటు రైతు శ్రేయోభిలాషులందరూ పాల్గొనేలా చూస్తామన్నారు. దీక్షల నిర్వహణపై ఆది, సోమవారాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు దోచిపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ బిల్లులు మూడింటిని కేంద్ర ఉపసంహరించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో వామపక్ష నేతలు జల్లి విల్సన్, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment