సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తారా? అని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈమేరకు సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, పి.మధు సోమవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. గత నెల 28న ఒక్కరోజే 1.9 లక్షల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు అందినట్లు ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఉన్నప్పటికీ వారికి తెలియకుండా ఆన్‌లైన్ పద్ధతిలో వేలాది సంఖ్యలో సామూహికంగా ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం కొంతమంది వ్యక్తులు ఫారం–7ను దరఖాస్తు చేస్తున్నారంటే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తున్నట్టు? అని నిలదీశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని నిర్వహిస్తున్న ప్రధాన వెండర్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటికొస్తుందని పేర్కొన్నాయి. దర్యాప్తు చేసి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. నకిలీ దరఖాస్తులతో ఓట్ల తొలగింపు ఎలా సాధ్యమో ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని వామపక్ష నేతలు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment