సాక్షి, అమరావతి: రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం ఆవేళ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే అంతా మద్దతు పలికేవారమంటున్నాయి. ప్రధాని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తిట్టిపోతే రేపు బాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిపై దుమ్మెత్తిపోస్తారు... వీటితో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కొందరు తమను ఆహ్వానించిన మాట నిజమేనని, తాము రాలేమని స్పష్టం చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment