Dharma Porata Deeksha
-
ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ‘ధర్మపోరాట దీక్ష’కు రూ.10 కోట్ల ప్రజాధనం ఖర్చుచేయడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అసలు ఏ చట్ట నిబంధన కింద ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిధులను విడుదల చేసిన అధికారులు ఎవరంటూ ఆరా తీసింది. ఇలా ప్రజాధనాన్ని వృథా చేసే హక్కు ఎవ్వరికీ లేదంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి ధర్నాలు, దీక్షలకు ప్రజాధనాన్ని వెచ్చించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందో కూడా తెలియచేయాలంది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాజకీయ కార్యక్రమంగా ధర్నా తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ధర్మపోరాట దీక్షతో ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని, ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీచేయాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో రూ.10కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఢిల్లీలో ఒకరోజు ధర్నా నిర్వహించారని వివరించారు. వెంటనే ధర్మాసనం.. ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా! అంటూ విస్మయం వ్యక్తంచేసింది. ఆ డబ్బంతా కూడా పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఇలా ప్రజాధనాన్ని రాజకీయ కార్యక్రమాల కోసం విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని నిలదీసింది. ఇది చాలా తీవ్రమైన విషయమంది. అసలు ఏ చట్టం కింద.. ఏ నిబంధనల కింద ఆ రూ.10 కోట్లు విడుదల చేశారని ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. రూ.10 కోట్ల కంటే ఎక్కువే ఉండొచ్చునన్నారు. ఏ అధికారంతో అంత భారీ నిధులను ఓ ధర్నా కోసం ఇచ్చారో వివరిస్తూ పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. -
బాబు పోరాట దీక్షకు పది కోట్లు!!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిర్వహించిన ఒక్కరోజు దీక్షకు కేవలం రూ.2.83 కోట్లే ఖర్చయ్యిందంటూ మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బుకాయిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన హస్తినలో జరిగిన ధర్మపోరాట దీక్ష కోసం ఈ నెల 6వ తేదీన అదనపు బడ్జెట్ రూ.10 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర ఆర్టీ నెంబర్ 215 జీవో జారీ చేశారు. ఇంత స్పష్టంగా జీవో ఉన్నప్పటికీ సీఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బుకాయింపులు, అబద్ధాలకు తెరతీశారు. దీక్ష కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రూ.10 కోట్లు వ్యయం చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేబినెట్ భేటీలో చర్చించడంతోపాటు వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపన కార్యక్రమంలోనూ చంద్రబాబు పార్టీ పరంగానే ఖర్చు చేశామని చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష కోసం రూ.10 కోట్లు వ్యయం చేయలేదని, కేవలం రూ.2.83 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. రూ.10 కోట్లు విడుదల చేశామంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో గురించి విలేకరులు ప్రశ్నించగా, మంత్రి మౌనం వహించడం గమనార్హం. మరి ఆర్టీ జీవో 215ను ఏ ప్రభుత్వం జారీ చేసిందో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పాలి. జీవో జారీ చేసి, అదంతా అవాస్తవం అంటూ ముఖ్యమంత్రి చెపుతుండడం చూసి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఈనెల 6న రూ. 10 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవో -
‘చంద్ర’ గాంధీ కొత్త సంప్రదాయం ఇదే
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక విమానాలు, రైళ్లు, లగ్జరీ హోటళ్లలో బస, విందులు, భారీ పబ్లిసిటీలతో నిరసన తెలుపుతూ ‘చంద్ర’ గాంధీ కొత్త సంప్రదాయానికి తెరలేపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. చంద్రబాబు అవినీతి, దొంగ దీక్షలపై బుధవారం ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘ నిరాహార దీక్ష అంటే సత్యాగ్రహం. ఒంటి పూట నిరసనకు రూ.11 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి సత్యాగ్రహం అంటే ఎలా? పిల్లల కష్టపడి సంపాదించిన సొమ్మును తాగేసిన తాగుబోతు తండ్రి చంద్రబాబులో కనిసిస్తున్నారు. లగ్జరీ హోటళ్లలో బస, భారీ పబ్లిసిటీతో నిరసన దీక్షలకు ‘చంద్ర’ గాంధీ కొత్త సంప్రదాయానికి తెర లేపారు’ అని విమర్శించారు. (నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా..) వ్యతిరేకించడం వేరు.. అవమానించడం వేరు బాబు.. ‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పద్దతులను వ్యతిరేకించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వారిని నీచమైన మాటలతో తులనాడటం కుసంస్కారం అవుతుంది. వ్యతిరేకించడం వేరు,అవమానించడం వేరు చ్రందబాబు. ఆ దేవుడే చంద్రబాబుకు జ్ఞానం ప్రసాదించాలి’ అని వ్యంగ్యంగా విమర్శించారు. ప్రతిదీ కౌంట్ అవుతోంది బాబు.. ‘ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు 2003లో ఐఎంజీ స్పోర్ట్స్ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక ఎన్నికల ముందు రూ. 200 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్షలు చేయడం వింతేమి కాదు. ప్రతిదీ కౌంట్ అవుతోంది బాబు.. ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోక తప్పదు’ అని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. -
శివాజీ నిజస్వరూపం బట్టబయలు
న్యూఢిల్లీ: ‘చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికో, వారి పార్టీకి సపోర్ట్ చేయడానికో నేను ఇక్కడకు రాలేదు. వీళ్లందరి కన్నా ఆంధ్రప్రదేశ్ నాకు ముఖ్యమ’ని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం టీడీపీ నిర్వహించిన ధర్మాపోరాట దీక్షలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి చెందనివాడినని చెప్పుకుంటూనే మా బాబు మహోన్నతుడు అంటూ స్తోత్రం చేశారు. పచ్చ పార్టీ అధినేతను మించినవారు లేరని ప్రశంసలు కురిపించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడతానంటూ వేదికనెక్కి చంద్రబాబు, లోకేశ్బాబులను ఆకాశానికెత్తారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టిన ఈ ‘మహానటుడు’ చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారని ఢిల్లీ వేదికగా మరోసారి రుజువైంది. బాబు దృష్టిలో పడేందుకు ప్రధాని, ఇతర నాయకులపై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ఒక్కరే హోదా కోసం పోరాడుతున్నారంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా శివాజీకి కనబడకపోవడం విడ్డూరం. (చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’) నాలుగు రోజులుగా హడావుడి చేస్తున్న చంద్రబాబుకే జై కొడుతూ తాను టీడీపీ గూటి చిలకనేనని రుజువు చేసుకున్నారు శివాజీ. పైకి మాత్రం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు చేతిలో చేయి వేసి నడుస్తారు. ఆయనతో పాటు వెళ్లి రాష్ట్రపతిని కలుస్తారు. బాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెబుతారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధిస్తామని దీమా వ్యక్తం చేస్తారు. చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి రాకపోతే ఈ మాటలన్నీ ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తారు. నిజ జీవితంలోనూ నటిస్తున్న శివాజీ నిజస్వరూపం బట్టబయలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా..
సాక్షి, హైదరాబాద్ : ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు నాయుడుకి నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా ఫొటో సేషన్‌కు మాత్రమే పనికొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రాబాబు అవినీతి, దొంగ దీక్షలపై బుధవారం ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘ఒక్క పూట భోజనం మానేస్తే నిమ్మ రసం తాగించి దీక్ష విరమణ ఏమిటి? కామెడీ కాకపోతే. నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి విరమిస్తే జీర్ణ రసాలను తటస్థం చేసేందుకు లెమన్ జ్యూస్ ఇస్తారు. నల్లచొక్కా లాగే నిమ్మరసం కూడా ఫొటో సెషన్‌కు పనికొచ్చింది. వేషాల్లో సహజ నటుడు ఎంపీ శివప్రసాదును మించి పోయాడు.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: ‘చంద్రబాబు.. ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి’) ప్రతిదీ కౌంట్ అవుతోంది బాబు.. ‘ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు 2003లో ఐఎంజీ స్పోర్ట్స్ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక ఎన్నికల ముందు రూ. 200 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్షలు చేయడం వింతేమి కాదు. ప్రతిదీ కౌంట్ అవుతోంది బాబు.. ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోక తప్పదు’ అని హెచ్చరించారు. ఇక పోలవరం విషయంలో బాబు చేసే మోసాలను జనాలు గమనిస్తున్నారని, మరోసారి వారు మోసపోలేరని పేర్కొన్నారు. ఇప్పటికి పోలవరం ఎడవ కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పనులు కూడా చాలా నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి హామీ కూడ ఇతర ఫేక్ హామీల్లాంటిదేనని విమర్శించారు. (చదవండి: టీడీపీ స్పెషల్ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ) ట్రెండింగ్ న్యూస్ అయ్యో.. లోకేష్ అది కూడా తెలియదా? చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’ ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా? -
ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా?
సాక్షి, హైదరాబాద్ : దేశరాజధానిలో ధర్మపోరాట దీక్షతో సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు, తెలుగు తమ్ముళ్లపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. గత నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘నవనిర్మాణ దీక్షలు’ చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్‌తో జతకట్టి అదే బీజేపీపై ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని, జస్ట్ పార్టీలు అటు ఇటు మారాయి కానీ చంద్రబాబు ధోరణి మాత్రం మారలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు చేసిన దీక్షలతో రాష్ట్రానికి, జనాలకు ఒరిగిందేమి లేదని, అనవసరంగా ప్రజాధనం వృథా తప్ప.. ఎలాంటి ప్రయోజనం లేదని నిట్టూరుస్తున్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో తానా అంటే తందాన అన్నట్టు వ్యవహరించిన చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు హోదాపై యూటర్న్ తీసుకొని..దీక్షల పేరిట హడావిడి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. (చదవండి : చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’) పోనీ ఆ దీక్షనైనా సరిగ్గా చేస్తున్నారా అంటే అది లేదని, అది ధర్మపోరాటం లెక్క లేదని సెల్ఫీల కోసం ఆరాటంలా ఉందని కామెంట్ చేస్తున్నారు. నల్ల దుస్తులేసుకొని ఫొటోలకు పొజివ్వడం తప్ప.. తెలుగు తమ్ముళ్లలో చిత్తశుద్ధి కనిపించడం లేదంటున్నారు. నిజంగా ప్రత్యేక హోదా కోసమే పోరాటం చేయాలనుకుంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఆంధ్రా ప్రజల ఆవేదన బలంగా కేంద్రానికి వినిపించి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీ చేసిన ప్రతీ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆనాడే చిత్తశుద్ధితో హోదా పోరాటంలో ప్రతిపక్ష పార్టీతో కలిసి వస్తే.. హోదా వచ్చి ఉండేదని, హోదా రాకపోవడానికి చంద్రబాబు, టీడీపీయే కారణమని మండిపడుతున్నారు. అప్పుడు ప్యాకేజీయే ముద్దు.. హోదా సంజీవినా? ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని ఊదరగొట్టిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రతో వెన్నులో వణుకుపుట్టి.. ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతోందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. పోనీ ఆ పోరాటమైనా.. కొత్తగా చేస్తున్నారా అంటే అది లేదని, ప్రతిపక్ష నేత గత నాలుగేళ్లుగా హోదా కోసం చేసిన ఒక్కో కార్యక్రమాన్ని ఎన్నికల ముందు బాబుగారు కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా బాబూ.. ఈ పోరాటాలతో ఒరిగేది ఏం లేదని, తమ డబ్బులు అనవసరంగా తగలెయ్యవద్దని వేడుకుంటున్నారు. (చదవండి: అయ్యో.. లోకేష్ అది కూడా తెలియదా?) తూ మీ బ్రతుకు చెడ..... pic.twitter.com/tgbprO5Tzy — Akshithguptha (@akshithguptha) February 11, 2019 pic.twitter.com/hZFCusB5wF — vishnu var (@vishnu966609) February 11, 2019 pic.twitter.com/q0rBI9db0u — A.Murali Mohan (@muralicherry) February 11, 2019 రాబోయే ఎన్నికల రోజుల్లో ఓటమి భయంతోనే దేశ వ్యాప్తంగా ప్రజల్లో సానుభూతి కోసం. చేసిన అసంతృప్తి పాలన, రాష్ట్రం లోని ప్రజల వ్యతిరేకతను కప్పిపుచ్చటానికి, ఢిల్లీ దేశరాజకీయాలు అంటూ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేస్తున్నారు. పచ్చ పార్టీ నాయకులకు మరియు దౌర్భాగ్య AP CM చంద్రబాబు గారు 😭😭😭 — shaik mabu shareef (@shaikmabushare6) February 11, 2019 దీక్ష చేస్థామని వెల్లి భజన చెస్తున్నారెంటి స్వామి? దీనికి 100 కోట్లు ప్రజల సొమ్ము బొక్క. అదేదొ ఇక్కడకె వాల్లని రమ్మనివుంటె సరిపొయెదిగదా? @JanaSenaParty @YSRCParty — PROUDINDIAN (@PROUDIN93059145) February 11, 2019 Adhi yenti 6 months back Rahul gandhi special status meedha saba pedithe mee party vaalu nalla zenda laa tho goback annaru eppudu delhi velli malla adhe rahul tho draamalu.. Mee vesaalu chusi ఉసారవిల్లి కుడ సిగ్గు పడతాది pic.twitter.com/pSCowb136p — siva (@siva198001) February 11, 2019 pic.twitter.com/oVivUHORDE — Kondal Chary R (@chary081) February 12, 2019 అరేయ్ ఆంబోతు పంది తిన్నట్టు తినడం కాదు ఇక్కడ దేకు pic.twitter.com/ZarJAL2ugz — BANDLA GANESH (@MzqbsBomFfNVOGL) February 12, 2019 -
చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ‘నారా’వారి నాటకం కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన నారా బాబు నేడు హస్తిన నడివీధుల్లో వేస్తున్న నాటకాలు చూసి జనం నివ్వెరపోతున్నారు. ‘నవ్వి పోదురు నాకేటి సిగ్గు’ తరహాలో చంద్రబాబు సాగిస్తున్న శీలహీన రాజకీయాల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోదీతో అంటకాగినప్పుడు ప్రత్యేక హోదా అంశం గుర్తుకు రాలేదా అని నిలదీస్తున్నారు. కేంద్ర సర్కారులో టీడీపీ కొనసాగినప్పుడు ఏం చేశారని సూటిగా అడుగుతున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రత్యేక హోదా ఊసెత్తని ఏపీ సీఎం ఇప్పుడు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదా జపం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏపీలో నడిపించిన డ్రామాను ఢిల్లీ వీధులకు చేర్చారు. ధర్మాట పోరాట దీక్ష పేరుతో వందిమాగధులను హస్తినకు తరలించి బలప్రదర్శనకు దిగారు. ప్రజలు గమనిస్తున్నారన్న కనీసం విచక్షణ కూడా లేకుండా పచ్చ మీడియా అండతో ప్రత్యేక హోదా అంశాన్ని హైజాక్ చేసేందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేసేశారు. రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వడానికి చంద్రబాబు చేసిన స్టంట్ జనాలకు నవ్వు తెప్పిస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పని ఎప్పుడో చేశారు. అంతేకాదు పలుమార్లు రాష్ట్రపతికి, కేంద్రానికి లేఖలు రాశారు. ఏకంగా తమ పార్టీ చెందిన లోక్‌సభ ఎంపీలతో రాజీనామా చేయించి దేశమంతా ప్రత్యేక హోదా గురించి చర్చింకునేలా చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా చేసిన రాజీలేని పోరాటం దేశం యావత్తు పరికించింది. నిరాహారదీక్షలు, యువభేరిలు, ధర్నాలతో హోదా ఉద్యమాన్ని జననేత ఉరకలెత్తించారు. ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా చేస్తామని ఆనాడే జగన్ ప్రకటించారు. సరిగ్గా ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పటిదాకా ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన చంద్రబాబు యూటర్న్ తీసుకుని హోదా రాగం అందుకున్నారు. జగన్ గతంలో చేసేసిన కార్యక్రమాలను ఇప్పుడు హడావుడిగా మొదలు పెట్టి తన దుర్బద్ధిని చాటుకున్నారు. అంతేకాదు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాపీ రాయుడి అవతారం ఎత్తేశారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ఆదరాబాదరా అమలు చేసేసి ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారు. టక్కుటమారాలతో ప్రజలను తక్కువ అంచనా వేస్తున్న చంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదంటున్నారు విశ్లేషకులు. -
‘చంద్రబాబు.. ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి’
సాక్షి, హైదరాబాద్ : ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను భద్రంగా దాచుకోవాలని సలహా ఇచ్చారు. ‘నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!’ అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్ చదవటం లాంటిదేనని, ఆఖరు నిమిషం దీక్ష వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏ ప్రయోజం లేదన్నారు. పిల్లలు కూడా ఆరాటం కొద్దీ చదువుతారని కానీ పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రావని వివరించారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష కూడా అలాంటిదేనని విమర్శించారు. చంద్రబాబును మించిన అవకాశవాది దేశం మొత్తం మీద ఎక్కడా కనిపించరని మండిపడ్డారు. దోచుకోవడానికే కేంద్ర ప్రాజెక్టు పోలవరాన్ని తనే నిర్మిస్తానని చంద్రబాబు తీసుకున్నాడని ఏడాది క్రితం కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ తిట్టిపోశాడని, కానీ ఇవ్వాళ ఆ ఇద్దరు ఆలింగనాలు చేసుకుంటుంటే ఇంత దిగజారుడుతనమా అనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో మాజీ ప్రధాని దేవెగౌడకు బాగా తెలుసని, ఆయన ప్రధానిగా ఉండగా ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు లైసెన్సులిప్పించి ఎంత దోచుకుందీ అనేక సార్లు ఆయన సీనియర్ నేతలకు చెప్పారన్నారు. దీక్ష ముగింపు రిచ్‌గా ఉంటుందని బతిమాలితే ఇష్టం లేకున్నా నిమ్మరసం తాగించారన్నారు. ఇక డబ్బాకొట్టుకోవడంలో చిట్టినాయుడు లోకేష్ తండ్రిని మించిపోయాడని ఎద్దేవ చేశారు. తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటుంటే.. కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో “అతి పేద్ద” ఉద్యోగం వదులుకొని ప్రజా “షేవ్" కోసం వచ్చానని అంటున్నాడని తెలిపారు. నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తిని ఇప్పుడు కొత్త అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా.. కుల మీడియా మాత్రం తెగ హైరానా పడుతుందని విమర్శించారు. బులెటిన్ల నిండా దీక్ష విజువల్సేనని, మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి తమ జాతి పిత రుణం తీర్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైమ్ టైంలో నల్ల చొక్కాల పబ్లిసిటీ గోల చూడలేక జనాలు చానళ్లు మార్చుకుంటున్నారని తెలిపారు. -
నాడు ‘ప్యాకేజీ’కి అంగీకరించా
సాక్షి, న్యూఢిల్లీ: నాడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో.. ఎన్డీయే నుంచి బయటకొచ్చేందుకు ప్రత్యేక హోదానే కారణమని చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని నిర్వహించిన ఈ దీక్ష ఉదయం 8.40కి ప్రారంభం కాగా.. రాత్రి 8 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం ఇవ్వడంతో ముగిసింది. ఆర్థిక సంఘాన్ని సాకుగా చెబితే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించానన్న చంద్రబాబు.. హోదా వద్దని తాము చెప్పలేదన్న ఆర్థిక సంఘం సభ్యుల ప్రకటనతో అప్రమత్తమై ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. కాగా 14వ ఆర్థిక సంఘం 2015లో నివేదిక ఇవ్వగా.. ఎన్డీయే నుంచి టీడీపీ 2018లో బయటకు రావడం గమనార్హం. నాది కాదు.. మీది యూటర్న్ ప్రసంగం మొత్తం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన అంశాన్ని సమర్ధించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ‘ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, మీకు కూడా ఇవ్వమని కేంద్రంలోని పెద్దలు చెప్పారు. ప్రత్యేక హోదా కంటే మిన్నగా ఇస్తామంటే ఇమ్మని చెప్పాం. అయితే మనకు ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు ఇచ్చిన రోజే మాకెందుకు ఇవ్వరని నిలదీసి అడిగిన ఘనత మా ప్రభుత్వానిది. అక్కడి నుంచి పోరాటం ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోంది. డబ్బులిచ్చినా లెక్కలు చెప్పడం లేదని మాట్లాడుతున్నారు. అన్ని లెక్కలు ఇచ్చినా పీఎంవో డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడింది. మనం ఎప్పుడూ కూడా లెక్కలు ఇవ్వకుండా ఆగింది లేదు. భారతదేశంలోనే పారదర్శకత గల ఏకైక ప్రభుత్వం టీడీపీ. మీతో కలిసి ఉన్నంతవరకు మంచివాళ్లుగా కనిపించాం. మా పనుల కోసం అడిగితే, ప్రత్యేక హోదా అడిగితే మీకు మేం వ్యతిరేకంగా కనబడ్డాం. ఏపీకి అన్యాయం చేశారు కాబట్టే పోరాడుతున్నాను. 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి హోదా ఇవ్వలేమన్నారు. తాము హోదా వద్దనలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు కూడా ప్రకటించారు. నేను యూటర్న్ తీసుకున్నానని అంటారు.. కానీ నాది కాదు మీది యూటర్న్’ అని ప్రసంగం ఆసాంతం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నెపం తనది కాదని చెప్పేందుకు చంద్రబాబు కష్టపడ్డారు. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘మా ముఖాన పార్లమెంటు మట్టి, యమునా నీళ్లు కొట్టారు. పార్లమెంటులో రేపో ఎల్లుండి ద్రవ్య బిల్లు రానుంది. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి. మొత్తం 18 డిమాండ్లు ఉన్నాయి. వాటిని నెరవేర్చాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలని మనం అడిగితే ప్రధాని గుంటూరు వచ్చి మనపై ఎదురుదాడి చేశాడు. వ్యక్తిగత దూషణలు చేస్తాడు. మనం అలా చేస్తే ప్రధాని ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ప్రజల సొమ్ముతో ధర్నా చేస్తున్నామని అంటున్నాడు. ఫొటో సెషన్ కోసం చేస్తున్నామని అన్నాడు. మీ కంటే గొప్ప నటుడు ఎవరూ లేరు..’ అని మోదీపై విమర్శలు గుప్పించారు. దీక్షకు పలువురు నేతల సంఘీభావం చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్ కూటమిలోని మిత్రపక్షాలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సీఎంలు కేజ్రీవాల్, కమల్‌నాథ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, దిగ్విజయ్ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఏపీ నుంచి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ, ఏపీ జేఏసీ–అమరావతి సంఘాల నేతలు హాజరయ్యారు. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఏపీ డిమాండ్లను వినిపిస్తామని, ఏపీ భవన్ నుంచి ఊరేగింపుగా వెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రియాల్టీ షోని తలపించిన బాబు దీక్ష రూ.10 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వం తరపున చంద్రబాబు చేపట్టిన ఒక రోజు ఢిల్లీ దీక్ష రియాల్టీ షోని తలపించింది. సొమ్ము సర్కారుదే అయినా దీక్షలో కూర్చుకున్న వారంతా పసుపు చొక్కాలు ధరించిన కార్యకర్తలే కావడం గమనార్హం. ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి, ఏపీ భవన్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. పలువురు జాతీయ స్థాయి నేతల్ని దీక్షకు పిలిపించుకుని వారితో పొగిడించుకునేందుకు చంద్రబాబు ఆరాటపడినట్లు కనిపించింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నేతలను ఆహ్వానించడం, వారిని సాగనంపడంలో బాబు బిజీగా గడిపారు. జాతీయస్థాయి నేతలు చంద్రబాబును పొగడడం, తిరిగి చంద్రబాబు వారిని పొగడడం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే తంతు కొనసాగింది. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపీలో ధర్నాకు వచ్చిన రాహుల్ గాంధీ, ఇతర జాతీయ నేతలపై కోడిగుడ్లు, టమోటాలు వేయించినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చాకే ఢిల్లీలో దీక్ష చేయాలని ఏపీ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ నుంచి ఒక్క నేత కూడా దీక్షకు హాజరుకాకపోవడం గమనార్హం. తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు అసహనం ఢిల్లీ దీక్షకు రూ. 10 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించిన చంద్రబాబు దీక్ష మధ్యలో తీవ్ర అసహనానికి గురయ్యారు. రూ. 1.2 కోట్లు వెచ్చించి అనంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన రెండు రైళ్ల ద్వారా వచ్చిన టీడీపీ కార్యకర్తలు దీక్ష ప్రాంగణాన్ని వదిలి నగర వీక్షణకు వెళ్లడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో మైక్ అందుకొని కార్యకర్తలందరూ కుర్చీల్లో కూర్చొవాల్సిందిగా అభ్యర్థించారు. -
చంద్రబాబుకు వామపక్షాల ఝలక్
సాక్షి, అమరావతి: రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోరాటం చేయాల్సిన సమయంలో చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం ఆవేళ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే అంతా మద్దతు పలికేవారమంటున్నాయి. ప్రధాని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తిట్టిపోతే రేపు బాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిపై దుమ్మెత్తిపోస్తారు... వీటితో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కొందరు తమను ఆహ్వానించిన మాట నిజమేనని, తాము రాలేమని స్పష్టం చేసినట్టు తెలిపారు. -
అది ఏపీ భవనా లేక టీడీపీ భవనా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ను చూస్తే అది టీడీపీ భవనా? అనే సందేహం కలుగుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరలేపిన సీఎం చంద్రబాబు నాయుడు.. నేడు ఏపీ భవన్లో ఆ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను ఏకంగా టీడీపీ భవన్‌గా మార్చేశారు. భారీ ఎత్తున పార్టీ ప్రచార పోస్టర్లు.. ప్లెక్సీలతో అంతా పసుపుమయం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఆర్మీ పేరిట ఉన్న టీషర్ట్‌లతో ఏపీ భవన్ ప్రాంగణంలో హల్చల్ చేస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ సందర్శకులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేదో టీడీపీ సొత్తయినట్లు ఇలా చేస్తున్నారేంటని, పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును వాడుకోవడం ఏంటని విసుక్కుంటున్నారు. మరోవైపు ఏపీ భవన్ అధికార యంత్రాంగం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తల సేవలో మునిగి తేలుతోంది. -
ప్రధాని సభకే అనుమతివ్వరా..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) మైదానాన్ని సొంత అవసరాలకు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 27న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని ఏయూ గ్రౌండ్స్‌లో బహిరంగసభ నిర్వహించాలని భావించారు. ఏయూ ఉన్నతాధికారులను సంప్రదించగా, ప్రధాని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని తెగేసి చెప్పారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాన మంత్రి సభకు ఈ మైదానాన్ని ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లున్నాయని, కావాలంటే ముఖ్యమంత్రిని అడగాలని అధికారులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూజీసీ నిధులతోనే నడుస్తున్న ఏయూలో ప్రధాని సభకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ఏయూ మైదానం టీడీపీ సర్కారు సొంత జాగీరా? అని మండిపడుతున్నారు. టీడీపీ సభలకు వాడుకున్నారుగా? ప్రధానమంత్రి సభకు అనుమతి నిరాకరించిన ఏయూ అధికారులు గతంలో టీడీపీ మహానాడు మొదలు పార్టీ సభలకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 2017 మే నెలలో టీడీపీ మూడు రోజులపాటు ఏయూ గ్రౌండ్స్‌లో మహానాడు సభలు నిర్వహించింది. 2018 మేలో ఇదే ఏయూ గ్రౌండ్స్‌లో ధర్మపోరాట సభ పేరిట తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఏయూను పూర్తిగా టీడీపీ జెండాలతో పసుపుమయం చేసేశారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో జ్ఞానభేరి సదస్సు, గత నెలలో పసుపు కుంకుమ పంపిణీ పేరిట టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలతో భారీ సభ నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అధికార టీడీపీ నేతల కుమారుల వివాహాలు మొదలు.. గతేడాది మంత్రి లోకేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు కూడా ఏయూలోనే అట్టహాసంగా నిర్వహించారని అంటున్నారు. కుదరదని చెప్పాం... ప్రధానమంత్రి సభకు అనుమతించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అడిగారు. రాజకీయ పరమైన సభ కాబట్టి కుదరదని చెప్పా. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే మాకు అభ్యంతరం లేదు. – నాగేశ్వరరావు, ఏయూ వైస్ చాన్సలర్ పెళ్లిళ్లకు ఇస్తారు.. ప్రధాని సభకివ్వరా? తెలుగుదేశం నాయకులు ఏయూను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకే కాదు.. ఆ పార్టీల నేతల వివాహాలకు కూడా గ్రౌండ్స్ వాడుతున్నారు. కానీ, ప్రధానమంత్రి బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పడం దారుణం. వీసీని అనుమతి అడిగితే కుదరదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశా. కేవలం ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యానే ఏయూ గ్రౌండ్స్ సరైందని భావించి అడుగుతున్నాం. – విష్ణుకుమార్ రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత -
సొమ్ము జనానిది.. సోకు బాబుది!
-
చంద్రబాబు దీక్ష.. బీజేపీ నేతల హౌజ్ అరెస్టులు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అనంతపురంలో బుధవారం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఆటంకం కల్గిస్తారనే అనుమానంతో పలువురు బీజేపీ నేతల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ‘నాలుగేళ్లుగా బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అనేలా వ్యవహరించింది. విభజన హామీల అమలు విషయమై ఏమాత్రం పనిచేయలేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అభినందనలు తెలిపారు. సన్మానం కూడా చేశారు. ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందంటూ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు’ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. -
సీఎం దీక్షలో మహిళ గెంటివేత
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో కష్టం చెప్పుకోవాలని వచ్చిన ఓ మహిళను పోలీసులు మెడపట్టుకుని బయటకు గెంటేశారు. రెండున్నరేళ్ల కిందట ఇల్లు కాలిపోయిన తనకు ఇంతవరకు న్యాయం జరగలేదని సీఎంకి విన్నవించుకోవాలని వచ్చిన పోలమ్మ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సీఎం గారూ.. నా ఇల్లు కాలిపోయింది.. నాకు న్యాయం చేయండి.. అంటూ గట్టిగా కేకలు వేసిన ఆమెను అక్కడే ఉన్న మహిళా ట్రైనీ ఎస్సై డి.శ్యామల (సీతంపేట పీఎస్) మెడపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. అమ్మా నేను తీవ్రవాదిను కాదు.. నేనో సాధారణ మహిళను.. నన్ను సీఎం వద్దకు తీసుకెళ్లాలంటూ బతిమిలాడినా జుట్టుపట్టుకుని లాక్కొచ్చేశారు. ఆమె చేతుల్లోని కాగితాలను లాక్కున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అడ్డుపడి సీఎం డౌన్‌డౌన్.. అంటూ నినాదాలు చేశాడు. అతడిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి పిడుగుద్దులు గుద్దారు. దీన్ని ఫొటోలు తీసిన విలేకరులను కూడా హెచ్చరించేలా ట్రైనీ ఎస్సై మాట్లాడారు. పోలమ్మ విలేకరుల వద్ద తన కష్టాన్ని వివరించింది. పొందూరు మండలం బొడ్డేపల్లిలో ఆమె ఇల్లు 2016 ఏప్రిల్‌లో విద్యుత్ షార్ట్‌షర్క్యూట్‌తో కాలిపోయింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు, ఎంపీకి, మంత్రికి పలుమార్లు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగలేదు. గతంలో జరిగిన గ్రామదర్శినిలో ఆమె ఇంటికి రూ.2.7 లక్షలు ఇస్తామని ఎమ్మెల్యే రవికుమార్ చెప్పారు. తరువాత ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఇచ్చిన అర్జీని కూడా ఎవరూ పట్టించుకోలేదు. కుమార్తె పెళ్లికోసం చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాకు రావడంతో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచ్చింది. -
ఎన్నాళ్లయినా మోదీ ప్రభుత్వంపై పోరాడతా..!
శ్రీకాకుళం పాతబస్టాండ్/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు ఆపేది లేదని.. ఎన్నాళ్లయినా మోదీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో శనివారం చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి కనీస నిధులు కూడా కేంద్రం ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం కోసం తనకంటే తక్కువ అనుభవం ఉన్న మోదీ వద్దకు 29 సార్లు వెళ్లానన్నారు. మోదీకంటే తాను ముందుగానే సీఎం అయ్యానని చెప్పుకొన్నారు. నాలుగేళ్ల బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి, మన రాష్ట్రానికి ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పి ఆ నిధులు కూడా విడుదల చేయలేదని తెలిపారు. కేంద్రం నుంచి బయటకొచ్చాక మంత్రులపైనా, ఎంపీలపైనా ఐటీ, విజిలెన్స్ దాడులకు పాల్పడుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, సీమ డ్రిప్ ఇరిగేషన్, కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్, అమరావతి నిర్మాణం.. తదితరాల్లో కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ప్రజాస్వామ్య మనుగడ కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, నల్లధనం బయటకు తీయలేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏటీఎంలు పనిచేయడంలేదు, బ్యాంకుల్లో డబ్బులేదన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, నదులను అనుసంధానం చేస్తామన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం రానున్న ఎన్నికల్లో ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ నిర్వహించేందుకు పోరాటం అవసరమన్నారు. దీక్షలో జిల్లాకు చెందిన మంత్రులు కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రయోజనాల కోసమే పార్టీలను కూడగడుతున్నాం: ఇండియాటుడే కాంక్లేవ్‌లో చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అనివార్యమని, జాతీయ ప్రయోజనాల కోసమే ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్‌లో సీఎంతో ఆ సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పలు రాజకీయ అంశాలపై సంభాషించారు. దేశంలో తానే సీనియర్ సీఎంనని చంద్రబాబు చెప్పుకొన్నారు. ప్రధాని మోదీది నెగెటివ్ క్యారెక్టర్ అని, ఆర్థిక వ్యవస్థను, జాతిని ఆయన నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘తాను బలవంతుడినని చెప్పుకొనే మోదీ.. జాతికి ఏం చేశారు? సీబీఐ కంటే ఏపీలోని ఏసీబీ సమర్థంగా పనిచేస్తోంది. ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారు’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించడం లేదని, మోదీ కంటే గత ప్రధానులంతా ఉత్తమమైన వారేనన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తాను సమర్థించడం లేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని చంద్రబాబు వివరించారు. జనం అవస్థలు... ధర్మపోరాట దీక్షతో శ్రీకాకుళం జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని అయిదు ఆర్టీసీ డిపోల నుంచి సుమారుగా 600 బస్సులను ఈ కార్యక్రమానికి వినియోగించడంలో గ్రామీణ ప్రాంతాల వారికి బస్సు సదుపాయాల్లేక అష్టకష్టాలుపడ్డారు. కార్యకర్తలు బలవంతంగా గ్రామాల్లో ప్రజలను భయపెట్టి సదస్సుకు తరలించే యత్నం చేశారు. మోదీ నాకు మంచి మిత్రుడే కానీ.. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని, కానీ సైద్ధాంతికంగానే ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను చూసి ఆయనను విశ్వసించానని, కానీ అధికారంలోకి వచ్చాక ఏవీ అమలు కాలేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దును తాను స్వాగతించిన మాట వాస్తవమేనని, కానీ రూ.2,000.. 500 నోట్లను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించానన్నారు. జాతి ప్రయోజనాల కోసం.. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీఏతో మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారా? అన్న సర్దేశాయ్ ప్రశ్నలకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతి పైనే అభివృద్ధినంతా కేంద్రీకరిస్తున్నారన్న విమర్శలను సీఎం ఖండించారు. -
పోరాట దీక్ష.. ప్రయాణికులకు శిక్ష
హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వంచించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మపోరాటదీక్ష చేపట్టారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో అంటకాగి... హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటూ చిలకపలుకులు పలికి...చివరకు జనం ఆకాంక్ష తెలుసుకుని మళ్లీ హోదాయే కావాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పుడు తప్పుతెలుసుకున్నానని జనాన్ని నమ్మించేందుకే ఈపోరాట దీక్ష పేరుతో సభలు పెడుతు న్నారు. కానీ జనాన్ని తరలించేందుకువందలాది ఆర్టీసీ బస్సుల్ని వాడుకోవడంతో అసలైన ప్రయాణికులు రాకపోకలకుచాలా అవస్థలు పడ్డారు. విజయనగరం గంటస్తంభం: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి ఏకంగా నాలుగున్నరేళ్లు గడిచింది. రాష్ట్ర రాజధాని మొదలు అనేక విషయాల్లో అంతా తానే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి చివరికి ఏమీ చేయలేక ఆ నింద కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. విజయనగరంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట దీక్షలో ఈ మేరకు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఏ అంశాల్లోనైతే ప్రధాని మంత్రిని పొగిడారో అవే అంశాలపై తీవ్ర విమర్శలు చేయడం విశేషం. ఇదిలాఉండగా ధర్మపోరాట సభకు భారీగా జనాన్ని తీసుకొచ్చేందుకు తెలుగుదేశం నాయకులు ఆపసోపాలు పడ్డారు. తాయిలాలు ఇచ్చి తెచ్చుకున్నారు. మరోవైపు సీపీఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పాఠశాలకు మధ్యాహ్నం నుంచి సెలవులు ఇచ్చేశారు. పాఠశాల నుంచి విద్యార్థులతో బయటకు వచ్చిన బస్సులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించడంతోట్రాఫిక్లో ఇరుక్కుపోయి అవస్థలు పడ్డారు. విమర్శలకే పెద్దపీట విజయనగరం ఆయోధ్యమైదానంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ధర్మపోరాట దీక్ష సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నాయకులు హాజరయ్యారు. వీరంతా తమ ప్రసంగాల్లో అధిక సమ యం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసేందుకే వెచ్చించారు. పనిలోపనిగా రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పైనా కూడా విమర్శలు గుప్పించారు. అంతా కేంద్రం వల్లేనట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఇతర నేతలు రాష్ట్రంలో తమ వైఫల్యాలను కూడా కేంద్రంపై నెట్టేందుకు విఫల యత్నం చేశారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి హోదా అవసరం లేదని, హోదా అగితే జైళ్లకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కంటే బెటర్ ప్యాకేజీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మట్టినీళ్లు ఇచ్చినపుడు మిన్నకున్నారు. ఇప్పుడు ప్రజల్లో ప్రత్యేకహోదా నినాదం బలంగా ఉండడంతో ఆ తప్పును కేంద్రప్రభుత్వంపై నెట్టేందుకు ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట తప్పారని స్క్రీన్‌పై మరీ ఆయన అప్పట్లో అన్నమాటలు వేసి చూపించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు పోలవరం తానే కడతానని కేంద్రం నుంచి లాక్కొని, ఎన్నికలకు ముందే పూర్తి చేస్తానన్నారు. ఇప్పుడు పూర్తి చేయలేకపోవడంతో ఆ నిందను కేంద్రంపై నెట్టేందుకు తీవ్రంగా యత్నించారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం ఫోర్టు విషయంలో కూడా నాలుగేళ్లు ఏమనకుండా ఉండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నాలుగేళ్లలో చాలా చేసిందని చెప్పిన ముఖ్యమంత్రి, ఆపార్టీ నాయకులు ఇప్పుడు కేంద్రం సహకరించలేదని మండిపడ్డం విశేషం. ఇదిలాఉంటే నోట్లరద్దుతో జనాన్ని ఇబ్బంది పెట్టారనీ, జీఎస్టీవల్ల ప్రజలపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు. ఈ రెండింటినీ నాడు మొదట సమర్థించింది చంద్రబాబు నాయుడే కావడం అంతా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి విభజించిందని అప్పట్లో ఆరోపించిన నాయకులు కాంగ్రెస్‌తో తాజాగా తెలంగాణలో జత కట్టి అదంతా దేశం కోసమే నంటూ చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. తాయిలాలు ఇచ్చి జనసమీకరణ ధర్మపోరాట దీక్ష 2గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి జనాల కోసం వేసిన కుర్చీలు కొన్ని కూడా నిండలేదు. తెలుగుదేశం నాయకులు భారీగా జన సమీకరణ చేయాలని భావించి 1200 బస్సులను జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు పంపారు. రావడానికి చాలామంది ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రాంతాలనుంచి ఖాళీ బస్సులే వచ్చేశాయి. డబ్బు, మద్యం ఇచ్చి బలవంతంగా తెప్పించారు. ఎక్కడికక్కడ మద్యంతో బిర్యానీలు తినడం కనిపించింది. ఇదిలాఉంటే జనం వస్తారో రారో అన్న అనుమానంతో అధికారపార్టీ నాయకులు వెలుగు అధికారులను పిలిచి మహిళా సంఘాలను పంపించే బాధ్యత అప్పగించారు. ఏదైతే నేం 3గంటల సమయానికి కాస్త సభ కళకళలాడింది. సభకు జనాన్ని తరలించేందుకు నాలుగు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు తెప్పించారు. సాయంత్రం పట్టణంలో ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం, స్కూల్ బస్సులు, విద్యార్ధులను కూడా ఆపేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. -
తమ్ముళ్ల మందు పార్టీ
విజయనగరం , సీతానగరం (పార్వతీపురం): జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన ధర్మ పోరాట సదస్సుకు సీతానగరం మండలం నుంచి బస్సుల్లో వచ్చిన తమ్ముళ్లకు దండిగా మందు సమకూర్చారు. అధికారపార్టీ నాయకులు శ్రీకాకుళం ఏపీఎస్ఆర్టీసీ డిపో నంబర్ 1, డిపో నంబర్ 2 నుంచి 42 బస్సులు, ఇతర డిపోల నుంచి 18 బస్సులను సమీకరించి పెద్ద గ్రామానికి రెండు, చిన్న గ్రామానికి ఒకటి వంతున కేటాయించారు. గ్రామాల్లో కార్యకర్తలు జన సమీకరణ చేసి బస్సులెక్కించారు.బస్సుల్లో వచ్చే కార్యకర్తలకు వాటిలోనే ఆహారం, మద్యం సీసాలు సమకూర్చారు. -
ప్రచార దీక్ష !
వారు ఏం చేసినా... పటిష్టమైన ప్రచారం కావాలి. తాము చేసిందే న్యాయం...తాము చెప్పిందే వేదం... అని నమ్మించాలి. చేసిన తప్పిదాలన్నీ... తమ ప్రత్యర్థులవల్లే జరిగాయని తెలియజేయాలి. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నతెలుగుదేశం తీరు. పార్టీ ప్రయోజనాలకూ ప్రభుత్వ నిధులే వెచ్చించేస్తారు.అందుకోసం చాలా ఆర్భాటం చేస్తారు. ఖజానాను సొంత జాగీరులా వాడేస్తారు.నాలుగేళ్లపాటు కేంద్రంలో కీలకపదవులు పొందినప్పుడు హోదాకోసం నోరెత్తలేదుసరికదా... నాడు పార్టీ అధినేత ప్యాకేజీకోసం వెంపర్లాడి... ఇప్పుడేమో కేంద్రంఅన్యాయం చేసిందంటూ... కొత్త పల్లవి అందుకుని మళ్లీ జనాన్ని నమ్మించేందుకుదీక్షల పేరుతో తెగ పాట్లు పడుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రత్యేక హోదా సంజీవనా... స్టేటస్ కంటే ప్యాకేయే మిన్న... అంటూ నాలుగేళ్లపాటు కేం ద్రం వద్ద రకరకాలుగా మాట్లాడిన ఆ నాలుకలు తిరిగి మడత పడ్డాయి. హోదా కావాలంటూ ఉన్నట్టుండి కొత్తరాగం ఎత్తుకున్నాయి. జనంలో హోదాకోసం పెరుగుతున్న ఆకాంక్షను ఇప్పుడు తనకు అనుకూలంగా మలచుకోవడానికి కొత్తగా ధర్మపోరాట దీక్షల పేరుతో సర్కారు ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. పనిలోపనిగా తమ పార్టీకి విస్తృత ప్రచారం కల్పించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని అయోధ్య మైదానంలో మంగళవారం ధర్మ పోరాట దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మున్సిపల్, పోలీస్,రెవెన్యూ యంత్రాంగమంతా ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టణంలోని అన్ని రోడ్లును ఎన్నడూ లేని విధంగా గత రెండు రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు. పోలీసులు నాలుగు రోజులుగా బందోబస్తు నిర్వహణలో ఉన్నారు. 1200 బస్సులు వినియోగం అధికార తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటంతో ధర్మ పోరాట దీక్షకు ప్రజలు వస్తారో రారోనన్న భయం ఆ పార్టీ నాయకుల్ని వెంటాడుతోంది. అంతే... జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులకు జనాల తరలింపు బాధ్యతలు అప్పగించేశారు. ఆర్టీసీ నుండి 1200 బస్సులతో జనాలను తరలించడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయనగరం డివిజన్ పరిధిలోని 28 డిపోల్లో ఉన్న 2500 బస్సుల్లో 1200 బస్సులు కావాలని అధికార పార్టీ నాయకులు ఆర్టీసీ అధికారులను సంప్రదించారు. ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ తెంటు లకు‡్ష్మనాయుడు ఆర్టీసీ అధికారులతో సోమవారం సాయంత్రం వరకు సంప్రదింపులు జరిపారు. అయితే నగదు చెల్లించనిదే బస్సులు ఇవ్వలేమని ఆర్టీసీ అధికారులు చివరి వరకూ పట్టుబట్టారు. కానీ అధికారం ముందు నిలబటలేక వారు అడిగినదానికి ఒప్పుకున్నారు. సభకు వస్తే రూ. 300లు సీఎం ధర్మ పోరాట దీక్షకు జనాలను తరలించడానికి అధికార పార్టీ నేతలు గ్రామాల్లో ఒక్కొక్కరికి రూ.300లు చొప్పున చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. విజయనగరం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో అధికార పార్టీ నేతలు సోమవారం రాత్రి వరకు జనాలను సభకు రప్పించడానికి బేరసారాలు జరపడం విశేషం. ఉపాధి కూలీలకు టీడీపీ నేతలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. సభకు వస్తే దక్కే ప్రయోజనాలతో పాటు పనికి వెళ్లకపోయినా మస్తర్లు వేయించేస్తామంటూ ప్రలోభపెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో అన్ని అనుమతులు తీసుకుని ఆ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికార పార్టీ నేతలు అసూయతో ఫ్లెక్సీలు జనజీవనానికి ఆటంకంగా ఉన్నాయని మున్సిపాలిటీ అధికారులతో తొలగించేశారు. చంద్రబాబు రాకతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయోధ్య మైదానం వరకు భారీగా ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేసినా మున్సిపాలిటీ అధికారులు అడ్డుచెప్పలేదు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌ను అడిగితే అనుమతులు అడిగారు డబ్బులు చెల్లించి ఉంటారని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక రూలు, ప్రతిపక్ష నేతలకు మరో రూలా అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య చిచ్చు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, నియోజకవర్గ ఎమ్మెల్యే మీసాల గీతల మధ్య ధర్మ పోరాట దీక్ష చిచ్చుపెట్టిందని ఆపార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ధర్మ పోరాట దీక్షాస్థలి శంకుస్థాపన విషయంలో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు, దీంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేకు జిల్లా ఇన్చార్జి మంత్రి అండగా ఉండటం కొసమెరుపు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా... అయోధ్య మైదానంలో నిర్వహించే ధర్మ పోరాట దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాఫ్టర్‌లో పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్‌లో ఆర్‌ఆండ్‌బీ జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, రింగ్‌రోడ్డు, ఐస్ ప్యాక్టరీ మీదుగా దీక్షాస్థలికి చేరుకుంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. కాగా సీఎంతో పాటు ముఖ్యనేతలంతా వస్తుండటంతో పోలీసు యంత్రాంగం 1200 మంది సిబ్బందిని భద్రత కోసం వినియోగించనుంది. -
సీఎం ధర్మపోరాట దీక్షకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ
-
సముద్రాలనే జయించిన మీరు ప్రకృతిని జయించలేకపోయారా?
సాక్షి, అమరావతి: మట్టిలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలోని మార్పులవల్లే పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మట్టి రహదారిలో పగుళ్లు ఏర్పడ్డాయని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తుపాన్లు, సముద్రాలు, ఎండలనే జయించిన సీఎం ప్రకృతిని జయించలేకపోయారా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. కీలక ప్రాజెక్టు దగ్గరకి వెళ్లే సిమెంట్‌తో నిర్మించిన రహదారి భారీ ఎత్తున బీటలు వారితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులపై చర్యలు తీసుకోకుండా, తప్పంతా ప్రకృతిదేనని వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే దానిని వెంటనే ప్రతిపక్షాలపైకి నెట్టేసే సీఎం ఈసారి తప్పును ప్రకృతి మీదకి నెట్టేశారని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా కేంద్రం పగుళ్లు సృష్టించిందంటూ ధర్మపోరాట దీక్షలకు దిగరు కదా అంటూ చురకలేశారు. అది మట్టి రహదారా మహాశయా.. శీతాకాలంలో పగుళ్లకు వేజలైన్ వాడాలంటూ ఒక నెటిజన్ సెటైర్ ఫొటోలు, వీడియోల్లో కిలోమీటరుకుపైగా ఉన్న ఆ రహదారి సిమెంట్‌తో నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అది మట్టితో నిర్మించిన రహదారి అని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ భూమిలో తేమ శాతం ఎంత, నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది సివిల్ ఇంజనీర్ల కనీస ధర్మమని, అలాంటిది తేమ శాతం తగ్గడం వల్ల రహదారి పగిలిపోయిందని సీఎం బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. రేపటిరోజున ఏదైనా జరగరానిది జరిగితే ఎండ వేడి పెరగడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ ప్రకటిస్తారా? అని దుయ్యబట్టారు. సీఎం చెప్పినట్లు వాతావరణ మార్పులవల్ల పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే గోదావరి రెండు జిల్లాలు మునిగిపోయే ప్రమాదముందన్న భయాందోళనలను వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయంలో పెచ్చులూడిపోయి నీరు లోపలికి రావడంతోపాటు గోడలు కూడా కూలిపోయాయని, ఇప్పుడు కీలక ప్రాజెక్టు వద్ద రోడ్డే ఇలా పగిలిపోయిందంటే కాంట్రాక్టర్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గోదావరి నది పక్కన తేమ తగ్గితేనే రహదారి ఇలా పగిలిపోయిందని, ఇప్పుడు కృష్ణా నది పక్కన రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, మెత్తటి నేలల్లో ఇంతటి ఎత్తైన భవనాలు ఎలా తట్టుకుంటాయంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టిలో తేమ శాతం తగ్గడం వల్ల కాదు.. పనుల్లో అవినీతి శాతం పెరగడం వల్ల పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. సెటైర్లే సెటైర్లు... సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు భారీ ఎత్తున సెటైర్లు విసురుతున్నారు. ఈ రోడ్లను సింగపూర్ టెక్నాలజీతో నిర్మించారా? లేక జపాన్ టెక్నాలజీనా? అని కొందరు ప్రశ్నిస్తే.. వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా ఈ రోడ్డును నిర్మించారంటే ఆ ఇంజనీర్లు తప్పక నారాయణ కాలేజీ నుంచి వచ్చినవాళ్లే అయి ఉంటారంటూ జోకులేస్తున్నారు. వేజలైన్ రాస్తే శీతాకాలంలో పగుళ్లు రావని, ఇకనుంచీ మట్టిలో వేజలైన్ కలిపి రోడ్లు వేయాలంటూ.. దానికి రూ.100 కోట్లు కేటాయించడంటూ ట్వీట్ చేశారు. రెయిన్‌గన్స్ టెక్నాలజీని వినియోగించాలని చురకలేశారు. ప్రకృతినే కంట్రోల్ చేసినవాళ్లకు ఈ పగుళ్లు ఎంతంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో కలవడం ప్రకృతికి కూడా ఇష్టం లేదనుకుంటా అని మరికొంతమంది చమత్కరించారు. సాధారణంగా సీఎం చేసే ట్వీట్‌కు 500లోపు లైకులు, 150 నుంచి 200లోపు ప్రతిస్పందనలు ఉంటాయి. అయితే సీఎం తాజా ట్వీట్‌కు సోమవారం సాయంత్రానికే దాదాపు 3,500 లైకులు, 950కిపైగా రీట్వీట్లు వచ్చాయి. -
ఆత్మస్తుతి.. పరనింద..!
సాక్షి ప్రతినిధి కడప: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ఎవరైనా సహజంగా అభివృద్ధి పథకాలు వేగం పుంజుకుంటాయని, పెండింగ్ పథకాలు పురోగతి సాధిస్తాయని, నూతన పథకాలకు ఆస్కారం ఉంటుందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. ఆశిస్తారు.. కానీ ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మపోరాట సభ అందుకు భిన్నంగా నడిచింది. ఆది నుంచి అంతం వరకూ ‘ఆత్మస్తుతి.. పరనిందే’ ప్రధానంగా కొనసాగింది. మంగళవారం ప్రొద్దుటూరు కేంద్రంగా సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర ప్రభుత్వం, విపక్షపార్టీలను టార్గెట్ చేస్తూ ప్రసంగించడం.. తమ గొప్పలు చెప్పుకోవడమే అసలు లక్ష్యంగా కనిపించింది. ధర్మపోరాట సభ విజయవంతం కోసం దాదాపు 10 రోజులుగా టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట సభలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని జిల్లా నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. ఈ సభకు వైఎస్సార్ జిల్లాతోపాటు చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో జన సమీకరణ చేశారు. లక్షమందిని తరలించాలని అంచనాలు పెట్టుకున్నారు. ఇంత చేసినా అందులో 20శాతం మాత్రమే సాధించగలిగారు. వారు కూడా కొద్ది సేపటికే ప్రాంగణం నుంచి వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం ఖాళీ అవుతూ వచ్చింది. పరిస్థితి ఇలాఉండగా మంత్రులు, ఎంపీలే కాకుండా ముఖ్యమంత్రి వరకూ ప్రసంగించిన ప్రతివారు పరనిందకే పరిమితమయ్యారు. ఉక్కు పరిశ్రమకు మరో నెల గడువు.. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి నాలుగున్నరేళ్లుగా ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరులో మరో నెలరోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని మంగళవారం ప్రకటించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలచే ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణదీక్ష చేయించారు. వీరి దీక్ష ముంగింపు సందర్భంగా జూన్ 30న ‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కేంద్ర ప్రభుత్వానికి 2నెలలు గడువు ఇస్తున్నాం. రెండు నెలలల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. లేదంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతామని’ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన చేశాక, నాలుగు నెలలు గడువు ముగిసింది. ఇప్పటికి ఎలాంటి పురోగతి లేకపోగా, తాజాగా మరో నెలలో శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. ఆమేరకు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో కేబినేట్ క్లియరెన్సు ఇస్తామని తెలిపారు. తిరిగి పాత పల్లవే అందుకున్నారు.. మీరు నిర్ణయం తీసుకుంటే సరేసరి..లేదంటే మేమే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బహుశా టీడీపీ శ్రేణులు ఆశించిన కీలక ప్రకటన ఇదే కాబోలు. అదే విధంగా గండికోట ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.3500 కోట్లతో చేపట్టే ఈ పనులకు నెలలో టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. విపక్షంపై విసుర్లు.. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు అండగా నిలవలేదని ప్రకటిస్తే పెద్దగా ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ రాష్ట్రంలోని విపక్షాలపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తడాన్ని సభికులు హర్షించలేదు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వస్తే ప్రభుత్వం చొరవ తీసుకొని సత్వర చర్యలు చేపట్టాల్సి ఉంది. కాగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధితుల్ని పరామర్శించలేదని, జనసేనాని పవన్‌కళ్యాణ్ సకాలంలో స్పందించలేదని ఆరోపణలు గుప్పించడం విడ్డూరంగా ఉందని అక్కడికి చేరిన ప్రజానీకం చర్చించుకోసాగారు. అధికారంలో ఉన్న వారికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని, విపక్షాలపై ఆరోపణలు ఏమిటీ? 40ఏళ్లు అనుభవం ఉన్నందువల్లే ఇలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయా? అంటూ పలువురు బాహాటంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు విపక్షంలో ఉన్న వారిని నిందించడమేమిటని ప్రశ్నించుకోసాగారు. ఆదితో ఆరంభమై సీఎంతో ముగింపు.. జిల్లాలో ధర్మపోరాట సభ అసలు ఉద్దేశం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే అన్నట్లుగా కన్పించింది. మంత్రి ఆదినారాయణరెడ్డితో ప్రారంభమైన ఈ వైఖరి ఎంపీలు సీఎం రమేష్ , జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా వరుసగా అందరూ వారివారి శైలిలో విపక్షనేతపై విమర్శలు చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం ఆరంభం కాగానే వెనుకవైపు ఉన్న సభికులు లేచిపోవడం కన్పించింది. సోమిరెడ్డి, లోకేష్ ప్రసంగాలు ముగిసే సమయానికి దాదాపు సగం ఖాళీ అయింది. ఇక ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సభికుల స్పందన కోరుతుంటే ముందువైపు ఉన్న వారు మినహా వెనుక వైపు స్పందించేందుకు ప్రజానీకం కరువయ్యారు. వెనుకవైపు ఉన్న గ్యాలరీల్లో అక్కడక్కడా ఉన్న కొద్ది మంది కూడా మౌనంగా ఉండిపోయారు. గట్టిగా అరుస్తూ సీఎం ప్రసంగిస్తున్నా ఆశించిన స్పందన కన్పించకపోవడం విశేషం. మొత్తంమీద వైఎస్సార్సీపీ, బీజేపీ, జనసేనను విమర్శించడం.. తమ గురించి చెప్పుకోవడానికే ధర్మపోరాట సభ నిర్వహించినట్లు ఉందనడంలో సందేహం లేదు. -
బీజేపీ ఆటలు సాగనివ్వను
సాక్షి ప్రతినిధి కడప/ప్రొద్దుటూరు: ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాలపట్ల సమదృష్టిని ప్రదర్శించడంలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలుచేయలేదు. రాజకీయంగా విభేదించి ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారు. బీజేపీ ఆటలు సాగనివ్వను’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం జరిగిన ధర్మపోరాటం సభలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లు నిష్టగా రాజకీయాలు చేశానని, ఆ రోజు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్ భయపడలేదని.. ఇప్పుడు తాను నరేంద్ర మోదీకి భయపడే ప్రసక్తేలేదన్నారు. మోదీ కంటే పదేళ్లు ముందుగా సీఎంగా బాధ్యతలు చేపట్టానన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా ధర్మపోరాటం చేస్తున్నామని వివరించారు. అసెంబ్లీ సీట్లు పెంచలేదు.. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. విభజన అంశాలు అమలుచేస్తామని చేయలేదు. చివరికి అసెంబ్లీ సీట్లు పెంచమని కోరినా పెంచలేదు. మొత్తం 175 సీట్లలో టీడీపీ సత్తా చాటుతాం. ‘ఆపరేషన్ గరుడ’పై సినీ నటుడు శివాజీ చెప్పినట్లే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై ఆయన అభిమానే కోడికత్తితో దాడిచేశాడు. వీళ్లు చెప్పి చేయించారా.. ఆయనే చేశాడా.. అన్న విషయం తెలియాల్సి ఉంది. అలాగే, కోడి కత్తి కేసులో నేరుగా గవర్నర్ డీజీపీకి ఫోన్‌చేసి విచారించడం రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పేపర్, సాక్షి టీవీ ఉందని ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. వారి ఆటలు సాగవు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసమే పొత్తులు పెట్టుకున్నాం’.. అని బాబు స్పష్టం చేశారు. కాగా, కడప కేంద్రంగా రాయలసీమ ఉక్కు కర్మాగారానికి నెలలోగా శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సోమిరెడ్డి, దేవినేని ఉమా, ఆది నారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి, బుట్టా రేణుక, జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య పాల్గొన్నారు. తిరుమల బస్సుల అపవిత్రత ఇదిలా ఉంటే.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని అందరూ ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అలాంటిది తిరుమలకు వెళ్లే బస్సులను సైతం టీడీపీ నేతలు అపవిత్రం చేశారు. ప్రొద్దుటూరులో జరిగిన సీఎం ధర్మపోరాట సభకు జనాన్ని తరలించేందుకు తిరుపతి, తిరుమల బస్సులనూ వినియోగించారు. జన సమీకరణ కోసం టీడీపీ నేతలు స్థాయిని బట్టి రూ.200 నుంచి రూ.300 వరకు నగదు ఇవ్వడంతోపాటు బిర్యాని ప్యాకెట్, మద్యం బాటిళ్లు అందించారు. టీడీపీ శ్రేణులు ఈ బస్సుల్లో మద్యాన్ని తీసుకెళ్లడం, మద్యం సేవించి ప్రయాణించడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వస్తే రూ.200..రాకుంటే రూ.2వేలు రాదు
వైఎస్ఆర్ జిల్లా,ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో మంగళవారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని జనాన్ని సమీకరిస్తున్నారు.పలు ప్రాంతాల్లో వెలుగు సిబ్బంది ద్వారా డ్వాక్రా మహిళలను హెచ్చరించారు. మీ గ్రామంలో బస్సు ఏర్పాటు చేశామని, సీఎం సభకు రాకుంటే మీకు రుణాలు రావని, పసుపు కుంకుమ కింద ఇచ్చే రూ.2వేలు కూడా బ్యాంకు అకౌంట్లో పడదని చెప్పారు. సభకు హాజరైతే రూ.200 చొప్పున ఇస్తామని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని సీతంపల్లె గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి చోటు చేసుకుంది. చెన్నమరాజుపల్లె గ్రామంలో వెలుగు యానిమేటర్లు, లీడర్లు ఇదే విధంగా బెదిరించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా మహిళలను కూడా ఇలాగే బెదిరిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమావేశానికి తప్పకుండా రావాలని సోమవారం వరదరాజులరెడ్డి, లింగారెడ్డి వర్గాలకు చెందిన నాయకులు సమాచారం పంపారు. తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఉన్న శాస్త్రీనగర్‌లో జనాన్ని సమీకరించేందుకు వరదరాజులరెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు సమావేశం ఏర్పాటు చేయగా ఆ వార్డు కౌన్సిలర్ రామాంజనేయరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ వార్డులోకి వచ్చి ఎలా మీటింగ్ పెడతారని ప్రశ్నించినట్లు సమాచారం. -
‘ధర్మ’..సంకటం..!
ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఒక లక్ష మంది జనసమీకరణతో తలపెట్టిన ధర్మ పోరాట సభ తమ్ముళ్లకు తలనొప్పిగా మారింది. ఈ సభ వ్యవహారం ఆ పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసింది. ఇక్కడ కుదరని పని..మా వళ్ల కాదురా ‘బాబూ’..అని మొత్తుకున్నా బలవంతంగా సభను నిర్వహిస్తున్నారని ఆ పార్టీలోని తమ్ముళ్లు కక్కలేక..మింగలేక లోలోపల కుమిలి..నలిగిపోతున్నారు. వద్దురా స్వామీ ఈ ‘అ’ధర్మ పోరాటం అని అనుచరుల వద్ద వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ ముహుర్తంలో ప్రొద్దుటూరులో ధర్మపోరాట సభను నిర్వహించాలని సంకల్పించారో తెలియదు గానీ, సభ నిర్వహణకు అనేక ఆటంకాలు ఎదురైతోన్నాయి. సభను జయప్రదం చేయడానికి ఆ పార్టీ తమ్ముళ్లు తిప్పలు పడుతున్నారు. ఇటీవల ఆ పార్టీలో చోటు చేసుకున్న పలు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుతమ్ముళ్లు అయిష్టత... మొదట ఈ సభను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారు. ఆ మేరకు గత 20వ తేదీన ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతలను ప్రధానంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగించా రు. ఇందుకు గాను కొంతమందికి ఆ పార్టీ పెద్దలు భారీగా డబ్బులు అందజేసినట్లు సమాచారం. మరికొన్ని నియోజక వర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లకే ఖర్చుల బాధ్యతలు మీద పడ్డాయి. జనసమీకరణకు ఇతర జిల్లాల నుంచి భారీగా వాహనాలు రప్పిస్తున్నారు. ఈ వాహనాలను చాలా వరకు ఇన్‌చార్జ్‌లకే అప్పగించారు. అంతవరకు బాగానే ఉంది. సొంత ఖర్చుతో లక్షలు ఖర్చు పెట్టి సభను విజయవంతం చేస్తాం సరే.మాకు టికెట్ కేటాయిస్తారో..లేదో తెలియదు...? అనే డైలమాలో పడ్డారు. ఎందుకు వచ్చిన గొవడరా బాబూ...! సభ రద్దు అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ విష యం పరోక్షంగా అధిష్టానం దృష్టికి సంకేతాలను పంపించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ససే మిరా అన్నారు. సభను జరిపి తీరాల్పిందే...అనే సం కేతాలు పంపారు. దీంతో చేసేది లేక తమ్ముళ్లు మిన్నకుండి పోయారు. అంతలోనే వర్షం పడడం తదితర కారణాల చేత 20వ తేదీన జరగాల్సిన సభ వాయిదా పడింది. ఇక సభ ఉండకపోవచ్చని అందరూ ఊపిరి ఆశించారు. అయితే 30వ తేదీన సభ జరిగుతుందని అధిష్టానం నుంచి సమాచారం రావడంతో సమస్య మొదటికి వచ్చింది. అనేక నాటకీయ పరిణా మాల మధ్య సభను జరపడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇక చేసేది లేక ఆ పార్టీ తమ్ముళ్లు అయిష్టంగానే సభ వైపు అడుగులు వేస్తున్నారు. బేధాభిప్రాయాలు.... సభ విజయవంతం బాధ్యతలను ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. దీంతో మిగిలిన అగ్రశ్రేణి నేతలు అలక వహించారు. మమ్ములను గుర్తించలేదు..మాకు వాహనాలు కేటాయించలేదు. మేముందుకు జనసమీకరణ చేస్తాం అని ప్రశ్నించారు. ఉదాహరణకు రైల్వేకోడూరుకు చెందిన ఒక నేత నేను 10 వేల మందిని సభకు తీసుకువస్తాను. ఒకరికి ఎంతిస్తారో చెప్పండని బహిర్గతమయ్యారు. ఇలా కమలాపురం, బద్వేల్ తదితర నియోజక వర్గ కేంద్రాల్లో సంఘనటలు చోటు చేసుకున్నాయి. సభకు వచ్చే వారికి ఒక్కొక్కరికి రూ 500.. కడప నియోజకవర్గంలో ఒక నేత రూ. 2 కోట్ల పనులను అప్పగించారు. అందుకు గాను రూ.20 లక్షల కమీషన్ వచ్చింది. ఈ డబ్బును జనసమీకరణకు ఉపయోగిస్తున్నారు. ఈ డబ్బును కడప నగరంలో ఒక ప్రముఖ ప్రభుత్వ అధికారికి అందజేశారు. ఒకరికి రూ.300 నుంచి రూ.500 వరకూ అప్పగించి సభకు జనాలను సమీకరించాలని ఆదేశించారు. ఇదే పరిస్దితి అంతటా కనిపిస్తోంది. దీనిపై ఆ పార్టీలో తీవ్ర చర్చసాగుతోంది. ఆయనకంటే ఆదాయం ఉంది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ విజయవంతానికి, భారీగా జనసమీకరణకు ఆ పార్టీ నేతలు దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. ఆమేరకు అనధికారిక కార్యక్రమం అయినప్పటికీ యంత్రాంగం మెప్మా, ఎస్‌హెచ్‌జీల సభ్యులను తరలించడంతో బాటు జనసమీకరణలో నిమగ్నమైంది. తాజా పరిస్థితుల్లో ధర్మపోరాట సభ విజయవంతం వ్యవహరం ఇటు తెలుగు తమ్ముళ్లకు..అటు ప్రభుత్వ అధికారులకు తల నొప్పిగా మారడం విశేషం. -
బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు
తణుకు : ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అన్ని వర్గాలను ఇబ్బందులపాల్జేసింది. జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలను భారీగా తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే డ్వాక్రా మహిళలను నయానో భయానో బెదిరించి ఆర్టీసీ, స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి బలవంతంగా వారిని సభాస్థలికి తరలించారు. అయితే చాలామంది మహిళలు సభాస్థలికి వెళ్లకుండానే బస్సుల్లోనే సేదతీరారు. మండుటెండలో ఇదేం ఖర్మరాబాబూ అనుకుంటూ తిరిగి ఇంటిముఖం పట్టారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలను భారీఎత్తున తరలించాలని అధికారులు మొదట్నుంచీ ప్రణాళికలు తయారు చేశారు. ఆయా గ్రామాలు, వార్డుల్లోని మహిళలను సంఘాలు వారీగా సమన్వయం చేసి వారికి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో తాడేపల్లిగూడెంలోని సభాస్థలికి తరలించారు. తిరుగు ప్రయాణం నరకం ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతుండగానే మహిళలు బయటకు వచ్చి వారిని తీసుకువచ్చిన బస్సులను వెతుక్కునే పనిలో పడ్డారు. తణుకువైపు నుంచి వెళ్లిన బస్సులను ప్రత్తిపాడు జంక్షన్ వద్ద నిలిపివేశారు. అయితే అక్కడి నుంచి హైవే వెంబడి అలంపురం వరకు బస్సులను నిలిపివేయడంతో వారిని తీసుకువచ్చిన బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలియక మహిళలు దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై పడిగాపులు పడ్డారు. సభాస్థలి నుంచి కిలోమీటర్లు మేర నడిచిన మహిళలు తమ వాహనాలు వెతుక్కునేందుకు అవస్థలు పడ్డారు. అయితే కొన్ని వాహనాలు కనిపించకపోవడంతో కార్యకర్తలు, మహిళలు చీకట్లోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు బయల్దేరారు. మరోవైపు సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర అవస్థలు పడ్డారు. మహిళలు, కార్యకర్తలను తరలించేందుకు వచ్చిన బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేయడంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ప్రత్తిపాడు నుంచి తణుకు మండలం దువ్వ గ్రామం వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో లారీలు, ఆర్టీసీ బస్సులు, కారులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. బస్సుల్లోని చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడేపల్లిగూడెం నుంచి తణుకు రావడానికి గంటన్నర సమయం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మాట నిలబెట్టుకోలేకపోవడం నమ్మకద్రోహమే...
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు మెట్రో: నాలుగున్నరేళ్లు పూర్తయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం నమ్మక ద్రోహమేనని కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నమ్మక ద్రోహం చేస్తారని కలలో కూడా అనుకోలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హేతుబద్ధత లేకుండా అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వం అని చెప్పి, దేశంలో 11 రాష్ట్రాలకు ఇచ్చి ఏపీకి మొండిచేయి చూపించిదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇంతవరకూ రివైజ్డ్ డీపీఆర్ ఇవ్వలేదని మండిపడ్డారు. భూసేకరణ, పునరావాసం కల్పించాల్సి ఉన్నా కేంద్రం మీనమేషాలు లెక్కబెడుతోందని విమర్శించారు. 2019 మే నాటికి గ్రావిటీపై నీరు ఇస్తామన్నారు. ఏపీని పట్టించుకోవడంలేదు ‘‘బుల్లెట్ ట్రైన్‌కు లక్ష పదిహేను వేలు కోట్లు ఖర్చుపెడతారు. ద్వారకలో కన్వెన్షన్ సెంటర్‌కు ఇరవై ఏడువేల కోట్లు ఖర్చుపెడతారు. ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామంటే రూ.1,500 కోట్లు ఇచ్చారు. దాంతో ఎలక్ట్రిసిటీ కేబుళ్లు కూడా రావు’’ అంటూ ప్రధానిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 11 జాతీయ విద్యాసంస్థలు ఇస్తామన్నారని, తొమ్మిది మాత్రం ఇచ్చి వాటికి నిధులు ఇవ్వలేదన్నారు. అవిపూర్తవడానికి 30 ఏళ్లు పడుతుందన్నారు. దుగరాజపట్నం పోర్టు ఇవ్వలేదని, రామాయపట్నంలో పోర్టు కట్టుకుంటామంటే.. వయొబిలిటీ లేదని అడ్డం పడుతున్నారు అని చంద్రబాబు చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం నూతన అధ్యాయమని, అయితే వైఎస్సార్సీపీ నేతలు రాజీనామాలు చేసి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను సైతం బెదిరించే ధోరణిలో మాట్లాడారని సీఎం చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ మాట్లాడదని, వారి సాక్షి పేపర్లో కేంద్రం చేసే అన్యాయం గురించి రాయరంటూ సీఎం ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటే వైఎస్సార్ పార్టీ నేతలు ఆందోళన చేస్తారని, రాజధానిపై కోర్టుకు వెళ్తారని, విశాఖలో భాగస్వామ్య సదస్సు పెడితే తునిలో విధ్వంసం చేశారనిప్రతిపక్షంపై సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్నమొన్నటి వరకూ తనను పొగిడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనను తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. పవన్ తన ప్రాణానికి ముప్పు ఉందని చెబుతున్నారని, ఆయనకు రక్షణ ఇచ్చే బాధ్యత తమదన్నారు. -
నిరసనల సెగ
కర్నూలు: కర్నూలు నగరంలో శనివారం ధర్మ పోరాట సభకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యార్థులు, రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎక్కడికక్కడే సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేసినప్పటికీ..స్థానిక ఆర్ఎస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ నాయకులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగానే గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలోవిద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాను ఎగురవేసి నిరసన ప్రకటించారు. ధర్మపోరాట సభకు ఆరు రీజియన్లకు సంబంధించి 1,173 బస్సులను వాడుకోవటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభకు వస్తూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. గ్రామాల్లోనే ఎక్కడికక్కడ మద్యం, డబ్బు ఇచ్చి.. జనాలను సీఎం సభకు తీసుకొచ్చారు. ఆర్‌యూలో నల్లజెండా ఎగురవేసి నిరసన సీఎం పర్యటనను నిరసిస్తూ రాయలసీమ విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు నాగరాజు, సురేష్, సూరి, రాజు, ప్రశాంత్ తదితరులు ఆర్యూ ముఖ ద్వారం వద్ద నల్లజెండాను ఎగుర వేసి నిరసన తెలిపారు. సీఎం దొంగ దీక్షలు చేస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని శ్రీరాములు విమర్శించారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాయలసీమ, ఉర్దూ వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు స్థానిక ఆర్ఎస్ రోడ్డు వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్, సురేంద్ర, నాయకులు అబ్దుల్లా, వెంకటేష్, నాగరాజు తదితరులు మెరుపు వేగంతో సీఎం కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని.. పెంచికలపాడు, నాగలాపురం, సీబెళగల్, కోడుమూరు, గూడూరు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కర్నూలు మార్కెట్ యార్డ్ ఎదుట సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఉల్లికి కనీస మద్దతు ధర కూడా లేదని వాపోయారు. పోలీసులు వారిని అడ్డుకొని కాన్వాయ్‌ను పోనిచ్చారు. రైతులను యార్డుకు తరలించారు. ముందస్తు అరెస్ట్‌లు సీఎం సభ నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కటిక గౌతం, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.భాస్కర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య, టీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.చంద్రప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివలను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అక్రమ అరెస్ట్‌ల విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేంద్రరెడ్డి, రాష్ట్రనాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవ పూజ ధనుంజయాచారి వారిని పరామర్శించారు. ఆర్‌యూలో నల్లజెండా ఎగురవేసిన ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, ఎస్ఎఫ్ఐ నేత నాగరాజు, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ నాయకులు ప్రశాంత్, నాగేంద్ర, మద్దిలేటిలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌కు తరలించారు. జీవో 550 ప్రకారం ఎంబీబీఎస్ ప్రవేశాలను కల్పించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య నేత లక్ష్మినరసింహ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ నేత శేషఫణిలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు నమోదు చేశారు. రైతు ఆత్మహత్యాయత్నం టీడీపీ నాయకులు తన పొలం వద్దనున్న బోరు పై భాగంలో ఇసుక తోడేస్తున్నారని, దీనివల్ల బోరులో నీరు ఎండిపోతోందని గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామానికి చెందిన రైతు బోయ రంగడు(35) సీఎం సభలో ఆత్మహత్య యత్నం చేశాడు. ఇతను తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. పొలం హంద్రీనది పక్కనే ఉంది. నది ఒడ్డున పొలంలో బోరు వేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నాడు. అయితే. .గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుడేపాల కర్రెగిడ్డి నది మధ్యలోని ఇసుకతో పాటు రంగడు పొలం పక్కనున్న ఇసుకనూ తోడసాగాడు. ఈ విషయమై రంగడు పది రోజుల క్రితం గోనెగండ్ల తహసీల్దార్‌కు, ఆ తర్వాత అక్కడి పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ రంగడు తమ్మున్ని శుక్రవారం కోడుమూరులో కర్రెగిడ్డి కొట్టాడు. గతంలోనూ అతని అనుచరులు రంగడు ఇంటి ముందు మంచినీటి కుళాయిని ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడి ఆగడాలు అధికం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పేందుకు రంగడు శనివారం కర్నూలుకు వచ్చాడు. ముందుగా తన పొలానికి అవసరమైన కలుపు మందును కొనుగోలు చేసి, ఆ తర్వాత సీఎం సభకు వెళ్లాడు. సీఎంతో తన బాధను చెప్పుకునేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర వేదనకు గురైన అక్కడే తన వద్ద ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణికుల అవస్థలు..కార్యకర్తల పడిగాపులు సీఎం సభకు జనాలను తరలించడానికి 1,173 ఆర్టీసీ బస్సులను వాడుకున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒం గోలు రీజియన్లకు చెందిన బస్సులను వినియోగించారు. ఒక్క కర్నూలు రీజియన్ నుంచే 353 బస్సులు తీసుకున్నారు. దీంతో పలు గ్రామాలకు, ప్రధాన పట్టణాలకు సైతం ఆర్టీసీ బస్సులను నడపలేదు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే వందల సంఖ్యలో నగరంలోకి బస్సులు రావటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర వాసులు నరకం చూశారు. టీడీపీ కార్యకర్తలు సైతం తిరిగి వెళ్లేందుకు బస్సుల్లేక అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు. వీరు ఉదయం వివిధ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఏర్పాటు చేసిన కార్లు, జీపులు, ఇతర వాహనాల్లో వచ్చారు. అయితే కర్నూలుకు వచ్చిన వెంటనే ఆ వాహనాలను తిప్పి పంపడంతో తిరుగు ప్రయాణానికి అవస్థ పడ్డారు. బస్సుల్లో వెళ్దామనుకుంటే వాటిని కూడా సీఎం సభకే వినియోగించడంతో పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు అర్ధరాత్రి వరకు కర్నూలులోనే పడిగాపులు కాశారు. నాయకులను నమ్మి వచ్చినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు ముందస్తు సెలవులు సీఎం ధర్మపోరాట సభ కోసం పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించారు. పాఠశాలల యాజమాన్యాలు దీనికి అంగీకరించక పోయినా అధికారుల ఒత్తిడితో సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. మూడు వర్గాలుగా.. ఆళ్లగడ్డ, నంద్యాల టీడీపీ నాయకులు మూడు వర్గాలుగా చీలిపోయారు. మంత్రి అఖిల ప్రియ, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి మూడు వర్గాలుగా ఎవరికి వారు సీఎం సభకు జనాన్ని తరలించారు. మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు తమ వర్గం ప్రజలను వేర్వేరు వాహనాల్లో కర్నూలుకు తీసుకురావడంతో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. -
కాంగ్రెస్ సహకారం తీసుకుంటాం : చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ సీనియర్లు, పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు. అవసరమైతే కాంగ్రెస్ సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరుతో తెలుగుదేశం పార్టీ శనివారం కర్నూలు ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తమకు సహకరించిన సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో అడగకుండానే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, మొన్న బీజేపీపై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ అడగకుండానే మద్దతు ప్రకటించిందని చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఇస్తామంటోందని కూడా ఆయన కాంగ్రెస్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అవసరమైనప్పుడు కచ్చితంగా సహకారం తీసుకుంటామని తేల్చి చెప్పారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందనే విషయం తమ పార్టీ నేతలకు సంకేతాలు పంపారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. కర్నూలులో ఐఐఐటీ తరగతి గదులు ఇంకా ప్రారంభం కాలేదని, గిరిజన వర్సిటీని ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా కేంద్రానికి లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్నారని నరేంద్ర మోదీ తనను అంటున్నారని, ప్రత్యేక హోదా విషయంలో మోదీనే రాంగ్‌టర్న్ తీసుకున్నారని చెప్పారు. గతంలో బ్రిటీషువారిపై పోరాడామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీపై పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుమల వెంకన్న వడ్డీతో సహా వసూలు చేస్తారని, తిరుపతి సభ సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ ఇచ్చిన హామీ అమలు చేయకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక ఎంపీతో బీజేపీ కొత్త పార్టీ కూడా పెట్టిస్తోందని చంద్రబాబు చెప్పారు. ధర్మపోరాట దీక్ష వృథా.. సంక్షేమ పథకాలు కాకుండా దీర్ఘకాలిక ప్రాజెక్టులను చేపట్టాలని ఎంపీ దివాకర్‌రెడ్డి సభలో మాట్లాడుతూ సూచించారు. ఇక్కడున్న అందరూ చంద్రబాబును పక్కదారి పట్టిస్తున్నారని, తనకేం మంత్రి పదవి రాదని, చంద్రబాబు ఇచ్చేది కూడా లేదని, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పారు. ధర్మపోరాట దీక్షలు వృథా అని తేల్చి చెప్పారు. విభజనతో ఎక్కువగా నష్టపోయింది కర్నూలేనని, న్యాయం జరగలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాజీ సుజనాచౌదరి, ఎంపీలు టీజీ వెంకటేష్, మాగంటి బాబు, నారాయణ, మురళీమోహన్, బుట్టా రేణుక, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు అఖిలప్రియ, దేవినేని ఉమా, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. -
ధర్మపోరాట దీక్షకు ఒకరు బలి
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కర్నూలు జిల్లాలో నిర్వహించిని ధర్మపోరాట దీక్షకు ఒకరు బలైయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూల్లో జరుగుతున్న సీఎం సభకు టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ హహనంలో బయలు దేరారు. మార్గం మధ్యలో భోజనం చేయడానికి గార్గేయపురం గ్రామం చేరువు దగ్గర దిగారు. భోజనం చేసి తిరిగి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో టీడీపీ కార్యకర్త అయ్యస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చేరుకుచెర్ల గ్రామానికి చెందిన అయ్యస్వామిగా పోలీసులు గుర్తించారు. -
ఖాకీల గుప్పిట్లో కర్నూలు
కర్నూలు /గాయత్రి ఎస్టేట్: ఎన్నడూలేని విధంగా అధికారుల హడావుడి.. పోలీసుల అతి జాగ్రత్తలు.. అడుగడుగునా ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపులు.. బారికేడ్లతో అడ్డుకోవడాలు..స్కూళ్లు త్వరగా మూసేయాలంటూ ఆదేశాలు..వెరసీ నగరంలో అందరికీ అవస్థలు. సీఎం చంద్రబాబు శనివారం ధర్మపోరాట దీక్ష కోసం కర్నూలు వస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసులు చేపడుతున్న చర్యలు నగరవాసులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆంక్షలు విధించారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో పలు విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం ముందస్తు అరెస్ట్‌లు చేశారు. సాయంత్రం నుంచే వారిపై నిఘా ఉంచి.. అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏబీవీపీ రాష్ట్రనాయకుడు సూర్యను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ విద్యార్థి సంఘం నాయకుడు కోనేటి వెంకటేశ్వర్లు, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములుతో పాటు మరికొందరు నేతల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యారంగ సమస్యల పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. కళాశాలలు, పాఠశాలల్లో సౌకర్యాలు కొరవడి విద్యార్థులు అవస్థ పడుతున్నారు. వీటిపై విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న భయంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. స్కూళ్లు త్వరగా మూసేయండి సీఎం వస్తున్నందున పాఠశాలలు త్వరగా మూసేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం పదిన్నరకల్లా మూసేయాలని స్పష్టం చేశారు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని కొన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. పోలీసుల వలయంలో కర్నూలు సీఎం చంద్రబాబు శనివారం కర్నూలుకు వస్తున్న సందర్భంగా పోలీసులు నగరాన్ని ఒకరోజు ముందే స్వాధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక వ్యక్తులు, ప్రజాసంఘాల నాయకులపై ప్రత్యేక నిఘా ఉంచారు. నగరాన్ని మ్యాప్పాయింట్ ఆధారంగా సెక్టార్లుగా విభజించి ఇన్‌చార్జ్‌లను నియమించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల నుంచి బందోబస్తు విధులకు సిబ్బందిని రప్పించారు. సీఎం సభ జరిగే ప్రాంతంలో నిఘా పటిష్టం చేశారు. ఏపీఎస్పీ మైదానం నుంచి ఎస్టీబీసీ కళాశాల వరకు సీఎం పర్యటించే ప్రధాన రహదారుల్లో బాంబు స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ తనిఖీలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ప్రధాన రోడ్లకు బ్యారికేడ్లు అడ్డంపెట్టి ట్రాఫిక్ మళ్లించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైఎస్ఆర్ సర్కిల్, ఐదు రోడ్ల కూడలి, రాజ్‌విహార్ సర్కిల్, ధర్మపేట సర్కిల్ రోడ్లను మొత్తం డివైడర్లతో మూసివేశారు. ఈ మార్గాల గుండా వెళ్లకుండా బస్సుల రాకపోకలను కూడా మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఏపీఎస్పీ మైదానం నుంచి ఎస్టీబీసీ కాలేజీ వరకు కాన్వాయ్ ట్రైల్స్ నిర్వహించారు. అలాగే ట్రైల్ రన్ కింద ఏపీఎస్పీ మైదానానికి సాయంత్రం హెలికాప్టర్ వచ్చి వెళ్లింది. అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ సీఎం పర్యటన పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశించారు. వారికి శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో దిశానిర్దేశం చేశారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ స్థలాలు, బహిరంగ ప్రదేశాల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్‌లకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు మాధవరెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఏ.బాబుప్రసాద్, వెంకటాద్రి, యుగంధర్‌బాబు, ఖాదర్‌బాష, నజీముద్దీన్, గోపాలకృష్ణ, హుస్సేన్‌పీరా, వినోద్‌కుమార్, మురళీధర్, ఇలియాజ్‌బాష, సీఎం గంగయ్య, ఈ–కాప్స్ ఇన్చార్జ్ రాఘవరెడ్డి, సీఐలు, ఎస్ఐలుపాల్గొన్నారు. -
ధర్మపోరాటం.. చాలా ఖరీదు గురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది అంటూ నిత్యం బీద అరుపులు అరుస్తూ, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న సీఎం చంద్రబాబు మరోవైపు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. కేంద్రంపై ధర్మపోరాటం పేరిట రూ.కోట్ల వ్యయంతో జిల్లాల్లో భారీఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల వల్ల ఖజానాకు నష్టమే తప్ప ప్రజలకు పైసా కూడా ఉపయోగం లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు. కలెక్టర్లదే బాధ్యత: బాబుగారి ధర్మపోరాటం చాలా ఖరీదు గురూ అంటూ సచివాలయంలో పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. సభలకు చేస్తున్న వ్యయాన్ని చూసి ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్మపోరాట సభకు ఏకంగా రూ.4 కోట్లు ఖర్చవుతోందని, ప్రజాధనంతో ముఖ్యమంత్రి వ్యక్తిగత, రాజకీయ ప్రచారం చేసుకోవడం ఎక్కడా చూడలేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ధర్మపోరాట సభల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. సభ వేదిక, సభలో కుర్చీలు, జనాన్ని బస్సుల్లో తీసుకురావడం, వారికి భోజనాలు, వీఐపీలకు బస, తదితర బాధ్యతలను కలెక్టర్లు చేపడుతున్నారు. వీటి కోసం నిధులివ్వాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు లేఖలు రాస్తున్నారు. బూడిదలో పోసిన పన్నీరే..: విజయవాడలో నిర్వహించిన ధర్మపోరాట సభకు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ వినతి మేరకు ప్రణాళికా శాఖ తొలుత రూ.2 కోట్లు ఇచ్చింది. మరో రూ.2 కోట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు. ధర్మపోరాట సభలకు తాము నిధులు ఇవ్వలేమని సాధారణ పరిపాలన శాఖ తేల్చిచెప్పింది. కలెక్టర్ రాసిన లేఖను ప్రణాళికా శాఖకు పంపించింది. తమ దగ్గర నిధుల్లేవని, జిల్లా నిధుల నుంచే బిల్లులు చెల్లించుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ప్రణాళికా శాఖ సూచించింది. ధర్మపోరాట సభలతో ముఖ్యమంత్రికి తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని అధికారులు అంటున్నారు. -
పాత హామీలే.. మారింది తేదీలే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాలుగేళ్లపాలనలో జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోమారు పాత హామీలను వల్లెవేయడం అందరిని ఆశ్చర్యపరించింది. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వెలిగొండ నీళ్లిచ్చే తేదీని మారుస్తూ రావడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఇటీవల కందుకూరుకు వచ్చిన సీఎం సభలో ప్రసంగిస్తూ డిసెంబర్ నాటికి టన్నెల్–1 పనులను పూర్తి చేసి ఫేజ్–1లో నీరిస్తామని చెప్పారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆ ఏడాదిలో నీళ్లొదులుతామంటూ ఏదోక తేదీని ప్రకటించి వెళ్లడం ఆయనకు అలవాటు. తాజాగా శనివారం ఒంగోలులో నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సభలో వచ్చే సంక్రాంతికి వెలిగొండ నీళ్లిస్తామని సీఎం మరోమారు కొత్తతేదీ ప్రకటించారు. వెలిగొండ నీటి విడుదలపై నోటికొచ్చిన తేదీలు ప్రకటిస్తూ వస్తున్న సీఎం తాజాగా ఒంగోలు సభలో మరో తేదీ ప్రకటించారు. పది రోజుల్లో పనులు మొదలు పెట్టి, సంక్రాంతి నాటికి ఫేజ్–1లో నీళ్లిస్తామన్నారు. మూడు నెలలుగా వెలిగొండ పనులు నిలిచి పోయాయి. పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య వివాదం కోర్టుకెక్కింది. పాతవారిని ఒప్పించి కొత్తవారికి పనులు అప్పగించుకోవచ్చని న్యాయస్థానం సూచించినట్లు సమచారం. మరోవైపు తమకు రావాల్సిన డబ్బులిస్తే పనులు వదులకోవడానికి సిద్ధమని పాత కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పాత కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించలేదు. దీంతో ప్రస్తుతం వెలిగొండ పనులు నిలిచి పోయాయి. అవేవి పట్టించుకోని ముఖ్యమంత్రి మాత్రం పది రోజుల్లో పనులు మొదలుపెడతామని, సంక్రాంతి నాటికి ఫేజ్–1లో నీళ్లిస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాదిలోనే రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టుతో చేసుకున్న ఒప్పందం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. పోర్టు యాజమాన్యంతో మాట్లాడినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామాయపట్నం పోర్టును ప్రారంభిస్తామన్నారు. గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల పథకాల విషయంలో కోర్టు సమస్యలు ఉన్నాయని వారితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే సమస్యలు పరిష్కరించి పనులు పూర్తి చేస్తామన్నారు. దొనకొండకు ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తుందని సీఎం చెప్పారు. నిమ్జ్‌కు కూడా త్వరలోనే పరిశ్రమలు వస్తాయన్నారు. ఒంగోలులో త్వరలోనే యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఒంగోలు నగరంలో 15వేల మందికి జీప్లస్ 3 కింద ఇళ్లు నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. పేపర్ మిల్లుల యజమానులతో సంప్రదిస్తున్నాం.. జిల్లాలో సుబాబుల్, జామాయిల్ గిట్టుబాటు ధర సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇక్కడే ఉన్నారని,æ ఆయనతో మాట్లాడి ముందుకెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలో పేపర్ మిల్లు ఏర్పాటుకు కొంత మంది మిల్లు యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం వెల్లడించారు. ట్రిపుల్ ఐటీని కనిగిరి వద్ద నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ఇచ్చిన పాత హామీలనే శనివారం సభలో సీఎం చెప్పడంపై మరోమారు విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగేళ్లు ఒక్క హామీని నెరవేర్చక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం పాత హామీలనే మరో మారు వల్లె వేయడంపై అధికార పార్టీ నేతలే పెదవి విరవడం కనిపించింది. ఈ సభలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు నారాయణ, పరిటాల సునీత, శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు, ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, కదిరి బాబూరావు, డేవిడ్‌రాజు, పోతల రామారావు, స్వామి, ఆమంచి కృష్ణమోహన్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరామ్, ఇన్చార్జులు విజయ్‌కుమార్, కందుల నారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోతుల సునీత, కరణం వెంకటేష్, శిద్దా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి
సాక్షి, దర్శి: ఈ నెల 28వ తేదీ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు కోరారు. సోమవారం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి ఒంగోలులో చేపట్టే ధర్మపోరాట దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు. అనంతరం పట్టణంలోని పుచ్చలమిట్టలో జరిగిన గ్రామదర్శిని– గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, నాయకులు పాల్గొన్నారు. -
సీఎం సభ : బారికేడ్లు తోసుకుని పారిపోయిన జనం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందంటూ నమ్మక ద్రోహం– కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం పేరుతో కాకినాడ జేఎన్టీయూకే క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన సభ పూర్తిగా బీజేపీ, వైఎస్సార్ సీపీ, పవన్‌కల్యాణ్‌పై నిందలు వేసేందుకు నిర్వహించిన సభలా సాగింది. ఎన్ని ఇబ్బందులు పడ్డా రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారు. పదేపదే తాను నాలుగు సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన అందిస్తున్నానని చెప్పారు. తప్పుచేసిన వారిని వదిలిపెట్టలేదని దీనికి మీ సమాధానం చప్పట్ల ద్వారా తెలియజేయాలని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం సభ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి గంటా ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా రావడంతో 4.10 గంటలకు ప్రారంభమైంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం సుమారు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊకదంపుడు ఉపన్యాసం సాగించారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పదేపదే చెప్పడంతో ప్రజలు విసుగుచెంది వెనుతిరిగారంటే ఆయన ఉపన్యాసం ఎలా సాగిందో వేరే చెప్పనవసరం లేదు. మధ్యాహ్నమే సభాస్థలికి చేరిన ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలస్యంగా రావడంతో అసహనంతో ఉన్నారు. ఆయన ప్రసంగంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతుండగానే మహిళలు వెనుతిరగడం కన్పించింది. మరోపక్క సుమారు నాలుగుగంటలకు పైగా కూర్చున్నా కనీసం తాగేందుకు మంచినీరు కూడా అందకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కళాశాల విద్యార్థులు సభకు ముఖ్యమంత్రి నిర్వహించిన సభకు నాయకులు విద్యార్థులను తరలించారు. ఉదయం కళాశాలలను నిర్వహించి మధ్యాహ్నం సెలవు ప్రకటించి కళాశాలల బస్సుల్లోనే విద్యార్థులను నేరుగా సభాస్థలికి తీసుకొని వచ్చారు. పుస్తకాల బ్యాగ్‌లు వీపునకు తగిలించుకొని మరీ ముఖ్యమంత్రి సభలో కూర్చోవాల్సి వచ్చింది. బస్సులు లేక ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు ముఖ్యమంత్రి సభకు జనాన్ని తీసుకొని వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు అన్ని నియోజకవర్గాలకు తరలించారు. దీంతో సాధారణ ప్రయాణికులు పడరానిపాట్లు పడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కాకినాడ, రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లు బస్సులు లేక వెలవెలపోయాయి. జనాన్ని తరలించడానికి నాయకులు నానా తంటాలు పడ్డారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించారు. 1300కు పైగా ఆర్టీసీ బస్సుల ద్వారా సీఎం సభకు ప్రజలను తరలించారు. దీక్ష సభలో విద్యుత్‌శాఖామంత్రి కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా తన రాజకీయ అనుభవంతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఐటీ, పంచాయతీరాజ్‌శాఖామంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ట్రైలర్ వేస్తేనే బీజేపీ ఓడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాయకులకు ఏపీలో సినిమా చూపిస్తామన్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ, పవన్‌కల్యాణ్ కుట్రపన్ని టీడీపీపై లేనిపోని నిందలు మోపుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కేంద్రంలో ప్రధానమంత్రిని నిర్ణయిస్తారని గొప్పలు చెప్పారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ విభజన హామీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంగలో కలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ ఎంపీలుగాతాము ఎంత పోరాటం చేసిన ప్రత్యేక హోదా సాధ్యం కాలేదని, ప్రజల మద్దతు అవసరమన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కలిసి కట్టుగా పనిచేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, కాకినాడ మేయర్ సుంకర పావని, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
బాబూ.. ఇది ధర్మమా?
భీమవరం(పకాశం చౌక్): బాబు గారు ఎప్పుడు ఎక్కడ దీక్ష చేసినా లేదా ఏ సభైనా చేపట్టినా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు. ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఫుల్‌గా వాడుకోవడంతో ప్రయాణికులు పాట్లు పడతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఇదే తంతు. తాజాగా శుక్రవారం ఆయన కాకినాడలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు పార్టీ నాయకులను, కార్యకర్తలను తీసుకెళ్లడానికి మరోసారి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడరాని పాట్లు పడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి అధిక చార్జీలు చెల్లించి ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించారు. బస్సులు లేవు అని తెలియక చాలా మంది ప్రయాణికులు ఆయా బస్టాండుల్లో పడిగాపులు కాసి నరకం చూశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేల మంది వచ్చేలా చూడాలని బాబుగారు ఆర్డర్ వేస్తే కనీసం వెయ్యిమందినైనా తరలించాలని నాయకులు జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధిక సంఖ్యలో ఉపయోగించుకున్నారు. జిల్లా నుంచి 200 బస్సులు జిల్లా నుంచి జనాన్ని కాకినాడ తరలించడానికి సుమారు 200 ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఒకరోజు ఆర్టీసీ నష్టం సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంటే మరో పక్క సీఎం చంద్రబాబు దీక్షల వల్ల బస్సు సర్వీసులు లేకుండా పోవడంతో ప్రతి డిపోకు లక్షల్లో నష్టం వస్తోంది. దీంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రే దీక్షల పేరుతో అథోగతి పాలు చేయడం ఏంటని ప్రజలు, ప్రయాణికులు మండిపడుతున్నారు. -
టీడీపీ బలపడుతుందనే అసెంబ్లీ సీట్లు పెంచలేదు
కాకినాడ: రాష్ట్రంలో టీడీపీ బలపడుతుందన్న భయంతోనే అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచే ప్రతిపాదనకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డుకట్ట వేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటారని మద్దతుగా నిలిస్తే ప్రధాని మోదీ నిలువునా దగా చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసికందులాంటి ఆంధ్రప్రదేశ్‌ను పెంచి పెద్ద చేయాల్సిన కీలక బాధ్యతలో ఉన్న ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో అన్నివిధాలా అన్యాయం చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి ప్రజాదరణ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి తాను మద్దతుగా నిలిస్తే 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిప్పించుకుని చివరకు కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ చేసిన ప్రసంగాన్ని, దాన్ని అనువాదం చేసిన వెంకయ్యనాయుడు ప్రకటనను ఈ సందర్భంగా చంద్రబాబు చదివి వినిపించారు. అప్పుగా ఇస్తామనడం అన్యాయం కేంద్రం వల్ల ఏపీ రోజురోజుకూ నష్టపోయే పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం రూ.3,950 కోట్లు మాత్రమే సహాయం చేసిందని, పలు ప్రాజెక్టుల విషయంలో దగా చేసిందన్నారు. పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలిచ్చిన మోదీ సర్కార్ మనకు మాత్రం ఎస్పీవీ ద్వారా అప్పుగా నిధులిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తెలుగు జాతిపై అడుగడుగునా కుట్ర, కుతంత్రాలతో వ్యవహరిస్తున్న కేంద్రాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు బొబ్బిలిపులి, కొండవీటి సింహాల్లా మారి తెలుగు ప్రజల సత్తాను కేంద్రానికి చూపాలని పిలుపునిచ్చారు. అక్రమార్కులకు అండగా నిలుస్తున్న మోదీ విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాంటి అక్రమార్కులకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని, ఆయన హయాంలో ఎన్నో కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదలకు పంచుతానని ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు స్విస్ ఖాతాలు 50 శాతం పెరిగాయంటే మోదీ హయాంలో ప్రగతి ఏ స్థాయిలో ఉందో గ్రహించవచ్చని ఎద్దేవా చేశారు. కేజీ బేసిన్లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే అందుకు కూడా కేంద్రం అవరోధంగా నిలిచిందని ఆరోపించారు. మొక్కుబడిగా నిధులు విదిల్చి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తోందన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వాలే చట్టాలను ఉల్లంఘించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘సాక్షి’తమపై అవాస్తవ కథనాలు రాస్తోందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఉపన్యాసం దాదాపు రెండు గంటలపాటు కొనసాగడంతో ప్రజలు మధ్యలోనే లేచి వెళ్లిపోవడం కనిపించింది. -
ధర్మ పోరాట దీక్షకు ఆర్టీసీ బస్సులో ప్రజలను తరలింపు!