
కర్నూలులో విద్యార్థి నాయకులపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు
కర్నూలు: కర్నూలు నగరంలో శనివారం ధర్మ పోరాట సభకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యార్థులు, రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఎక్కడికక్కడే సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేసినప్పటికీ..స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగానే గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. రాయలసీమ విశ్వవిద్యాలయంలోవిద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లజెండాను ఎగురవేసి నిరసన ప్రకటించారు. ధర్మపోరాట సభకు ఆరు రీజియన్లకు సంబంధించి 1,173 బస్సులను వాడుకోవటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభకు వస్తూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. గ్రామాల్లోనే ఎక్కడికక్కడ మద్యం, డబ్బు ఇచ్చి.. జనాలను సీఎం సభకు తీసుకొచ్చారు.
ఆర్‌యూలో నల్లజెండా ఎగురవేసి నిరసన
సీఎం పర్యటనను నిరసిస్తూ రాయలసీమ విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు నాగరాజు, సురేష్, సూరి, రాజు, ప్రశాంత్ తదితరులు ఆర్‌యూ ముఖ ద్వారం వద్ద నల్లజెండాను ఎగుర వేసి నిరసన తెలిపారు. సీఎం దొంగ దీక్షలు చేస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని శ్రీరాములు విమర్శించారు.
కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రాయలసీమ, ఉర్దూ వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్థానిక ఆర్‌ఎస్ రోడ్డు వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్, సురేంద్ర, నాయకులు అబ్దుల్లా, వెంకటేష్, నాగరాజు తదితరులు మెరుపు వేగంతో సీఎం కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిని పక్కకు లాగేశారు.
ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని..
పెంచికలపాడు, నాగలాపురం, సీబెళగల్, కోడుమూరు, గూడూరు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది రైతులు ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కర్నూలు మార్కెట్ యార్డ్ ఎదుట సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఉల్లికి కనీస మద్దతు ధర కూడా లేదని వాపోయారు. పోలీసులు వారిని అడ్డుకొని కాన్వాయ్‌ను పోనిచ్చారు. రైతులను యార్డుకు తరలించారు.
ముందస్తు అరెస్ట్‌లు
సీఎం సభ నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కటిక గౌతం, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.భాస్కర్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య, టీఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.చంద్రప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివలను తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల అక్రమ అరెస్ట్‌ల విషయాన్ని తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేంద్రరెడ్డి, రాష్ట్రనాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవ పూజ ధనుంజయాచారి వారిని పరామర్శించారు. ఆర్‌యూలో నల్లజెండా ఎగురవేసిన ఆర్‌యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, ఎస్‌ఎఫ్‌ఐ నేత నాగరాజు, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ నాయకులు ప్రశాంత్, నాగేంద్ర, మద్దిలేటిలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌కు తరలించారు. జీవో 550 ప్రకారం ఎంబీబీఎస్ ప్రవేశాలను కల్పించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య నేత లక్ష్మినరసింహ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ నేత శేషఫణిలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు నమోదు చేశారు.
రైతు ఆత్మహత్యాయత్నం
టీడీపీ నాయకులు తన పొలం వద్దనున్న బోరు పై భాగంలో ఇసుక తోడేస్తున్నారని, దీనివల్ల బోరులో నీరు ఎండిపోతోందని గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామానికి చెందిన రైతు బోయ రంగడు(35) సీఎం సభలో ఆత్మహత్య యత్నం చేశాడు. ఇతను తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. పొలం హంద్రీనది పక్కనే ఉంది. నది ఒడ్డున పొలంలో బోరు వేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నాడు. అయితే. .గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుడేపాల కర్రెగిడ్డి నది మధ్యలోని ఇసుకతో పాటు రంగడు పొలం పక్కనున్న ఇసుకనూ తోడసాగాడు. ఈ విషయమై రంగడు పది రోజుల క్రితం గోనెగండ్ల తహసీల్దార్‌కు, ఆ తర్వాత అక్కడి పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ రంగడు తమ్మున్ని శుక్రవారం కోడుమూరులో కర్రెగిడ్డి కొట్టాడు. గతంలోనూ అతని అనుచరులు రంగడు ఇంటి ముందు మంచినీటి కుళాయిని ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడి ఆగడాలు అధికం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పేందుకు రంగడు శనివారం కర్నూలుకు వచ్చాడు. ముందుగా తన పొలానికి అవసరమైన కలుపు మందును కొనుగోలు చేసి, ఆ తర్వాత సీఎం సభకు వెళ్లాడు. సీఎంతో తన బాధను చెప్పుకునేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర వేదనకు గురైన అక్కడే తన వద్ద ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.
ప్రయాణికుల అవస్థలు..కార్యకర్తల పడిగాపులు
సీఎం సభకు జనాలను తరలించడానికి 1,173 ఆర్టీసీ బస్సులను వాడుకున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒం గోలు రీజియన్లకు చెందిన బస్సులను వినియోగించారు. ఒక్క కర్నూలు రీజియన్ నుంచే 353 బస్సులు తీసుకున్నారు. దీంతో పలు గ్రామాలకు, ప్రధాన పట్టణాలకు సైతం ఆర్టీసీ బస్సులను నడపలేదు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే వందల సంఖ్యలో నగరంలోకి బస్సులు రావటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర వాసులు నరకం చూశారు. టీడీపీ కార్యకర్తలు సైతం తిరిగి వెళ్లేందుకు బస్సుల్లేక అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు. వీరు ఉదయం వివిధ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఏర్పాటు చేసిన కార్లు, జీపులు, ఇతర వాహనాల్లో వచ్చారు. అయితే కర్నూలుకు వచ్చిన వెంటనే ఆ వాహనాలను తిప్పి పంపడంతో తిరుగు ప్రయాణానికి అవస్థ పడ్డారు. బస్సుల్లో వెళ్దామనుకుంటే వాటిని కూడా సీఎం సభకే వినియోగించడంతో పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు అర్ధరాత్రి వరకు కర్నూలులోనే పడిగాపులు కాశారు. నాయకులను నమ్మి వచ్చినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలకు ముందస్తు సెలవులు
సీఎం ధర్మపోరాట సభ కోసం పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించారు. పాఠశాలల యాజమాన్యాలు దీనికి అంగీకరించక పోయినా అధికారుల ఒత్తిడితో సెలవులు ప్రకటించాల్సి వచ్చింది.
మూడు వర్గాలుగా..
ఆళ్లగడ్డ, నంద్యాల టీడీపీ నాయకులు మూడు వర్గాలుగా చీలిపోయారు. మంత్రి అఖిల ప్రియ, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి మూడు వర్గాలుగా ఎవరికి వారు సీఎం సభకు జనాన్ని తరలించారు. మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు తమ వర్గం ప్రజలను వేర్వేరు వాహనాల్లో కర్నూలుకు తీసుకురావడంతో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment