దర్మపోరాట దీక్షకు సిద్ధం చేసిన సభ
ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఒక లక్ష మంది జనసమీకరణతో తలపెట్టిన ధర్మ పోరాట సభ తమ్ముళ్లకు తలనొప్పిగా మారింది. ఈ సభ వ్యవహారం ఆ పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసింది. ఇక్కడ కుదరని పని..మా వళ్ల కాదురా ‘బాబూ’..అని మొత్తుకున్నా బలవంతంగా సభను నిర్వహిస్తున్నారని ఆ పార్టీలోని తమ్ముళ్లు కక్కలేక..మింగలేక లోలోపల కుమిలి..నలిగిపోతున్నారు. వద్దురా స్వామీ ఈ ‘అ’ధర్మ పోరాటం అని అనుచరుల వద్ద వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ ముహుర్తంలో ప్రొద్దుటూరులో ధర్మపోరాట సభను నిర్వహించాలని సంకల్పించారో తెలియదు గానీ, సభ నిర్వహణకు అనేక ఆటంకాలు ఎదురైతోన్నాయి. సభను జయప్రదం చేయడానికి ఆ పార్టీ తమ్ముళ్లు తిప్పలు పడుతున్నారు. ఇటీవల ఆ పార్టీలో చోటు చేసుకున్న పలు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగుతమ్ముళ్లు అయిష్టత...
మొదట ఈ సభను జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారు. ఆ మేరకు గత 20వ తేదీన ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతలను ప్రధానంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగించా రు. ఇందుకు గాను కొంతమందికి ఆ పార్టీ పెద్దలు భారీగా డబ్బులు అందజేసినట్లు సమాచారం. మరికొన్ని నియోజక వర్గాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లకే ఖర్చుల బాధ్యతలు మీద పడ్డాయి. జనసమీకరణకు ఇతర జిల్లాల నుంచి భారీగా వాహనాలు రప్పిస్తున్నారు. ఈ వాహనాలను చాలా వరకు ఇన్‌చార్జ్‌లకే అప్పగించారు.
అంతవరకు బాగానే ఉంది. సొంత ఖర్చుతో లక్షలు ఖర్చు పెట్టి సభను విజయవంతం చేస్తాం సరే.మాకు టికెట్ కేటాయిస్తారో..లేదో తెలియదు...? అనే డైలమాలో పడ్డారు. ఎందుకు వచ్చిన గొవడరా బాబూ...! సభ రద్దు అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ విష యం పరోక్షంగా అధిష్టానం దృష్టికి సంకేతాలను పంపించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ససే మిరా అన్నారు. సభను జరిపి తీరాల్పిందే...అనే సం కేతాలు పంపారు. దీంతో చేసేది లేక తమ్ముళ్లు మిన్నకుండి పోయారు. అంతలోనే వర్షం పడడం తదితర కారణాల చేత 20వ తేదీన జరగాల్సిన సభ వాయిదా పడింది. ఇక సభ ఉండకపోవచ్చని అందరూ ఊపిరి ఆశించారు. అయితే 30వ తేదీన సభ జరిగుతుందని అధిష్టానం నుంచి సమాచారం రావడంతో సమస్య మొదటికి వచ్చింది. అనేక నాటకీయ పరిణా మాల మధ్య సభను జరపడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇక చేసేది లేక ఆ పార్టీ తమ్ముళ్లు అయిష్టంగానే సభ వైపు అడుగులు వేస్తున్నారు.
బేధాభిప్రాయాలు....
సభ విజయవంతం బాధ్యతలను ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. దీంతో మిగిలిన అగ్రశ్రేణి నేతలు అలక వహించారు. మమ్ములను గుర్తించలేదు..మాకు వాహనాలు కేటాయించలేదు. మేముందుకు జనసమీకరణ చేస్తాం అని ప్రశ్నించారు. ఉదాహరణకు రైల్వేకోడూరుకు చెందిన ఒక నేత నేను 10 వేల మందిని సభకు తీసుకువస్తాను. ఒకరికి ఎంతిస్తారో చెప్పండని బహిర్గతమయ్యారు. ఇలా కమలాపురం, బద్వేల్ తదితర నియోజక వర్గ కేంద్రాల్లో సంఘనటలు చోటు చేసుకున్నాయి.
సభకు వచ్చే వారికి ఒక్కొక్కరికి రూ 500..
కడప నియోజకవర్గంలో ఒక నేత రూ. 2 కోట్ల పనులను అప్పగించారు. అందుకు గాను రూ.20 లక్షల కమీషన్ వచ్చింది. ఈ డబ్బును జనసమీకరణకు ఉపయోగిస్తున్నారు. ఈ డబ్బును కడప నగరంలో ఒక ప్రముఖ ప్రభుత్వ అధికారికి అందజేశారు. ఒకరికి రూ.300 నుంచి రూ.500 వరకూ అప్పగించి సభకు జనాలను సమీకరించాలని ఆదేశించారు. ఇదే పరిస్దితి అంతటా కనిపిస్తోంది. దీనిపై ఆ పార్టీలో తీవ్ర చర్చసాగుతోంది. ఆయనకంటే ఆదాయం ఉంది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ విజయవంతానికి, భారీగా జనసమీకరణకు ఆ పార్టీ నేతలు దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. ఆమేరకు అనధికారిక కార్యక్రమం అయినప్పటికీ యంత్రాంగం మెప్మా, ఎస్‌హెచ్‌జీల సభ్యులను తరలించడంతో బాటు జనసమీకరణలో నిమగ్నమైంది. తాజా పరిస్థితుల్లో ధర్మపోరాట సభ విజయవంతం వ్యవహరం ఇటు తెలుగు తమ్ముళ్లకు..అటు ప్రభుత్వ అధికారులకు తల నొప్పిగా మారడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment