సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటీ అమలు కావడం లేదని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విజయవాడ వదరపాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ధ్వజమెత్తారు. కొవ్వొత్తులకు రూ. 26 కోట్లు, పులిహోరకు రూ. 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘తెలంగాణాలో హైడ్రాలాగా, ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు తెచ్చారు. ఎన్ని రోజులు వీటితో తప్పించుకు తిరుగుతారు? నాలుగు నెలల కాలంలోనే ఇంతగా ఒక ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఈ దేశ ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వారి భక్తులను నమ్మకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. నాణ్యత లేదని నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపినామని ఈఓ స్పష్టంగా చెప్పినా సీఎం కల్తీ జరిగిందని ఎలా చెబుతారని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది.
లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో అబాసు పాలయ్యారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ తీరును నిలదీయడంతో శ్రీవారి భక్తులు లడ్డూ అపవిత్రత కాలేదని తేలిపోయింది. చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో అపవిత్రుడు అయ్యాడు.. ఆయన జీవితం అంతా అపవిత్రమే. ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు అందే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment