
వైఎస్సార్ కడప, సాక్షి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి స్పందన శూన్యమని కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పదవులు లేకపోయినా పచ్చ కండువాలు వేసుకుని గ్రామసభల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 13 వేల కోట్ల అప్పు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నామా అని ప్రజలు బాధ పడుతున్నారు.
.. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన గ్రామ సభకు కూడా ప్రజల నుండి స్పందన లేదు. సూపర్ సిక్స్ పథకాలను పక్కాగా అమలు చేయాలి. లేకుంటే ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేసేందుకు సిద్ధం. చంద్రబాబు 2014లో మోసం చేశారు.. ఇప్పుడు కూడా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’’ అని అన్నారు.