గుంటూరు, సాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు మూడు నాలుగు రోజులు అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైయస్సార్‌సీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు.
అక్రమ కేసులు బనాయించిన అధికారులను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ చెప్పారు. అక్రమ కేసులు బనాయించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చి వెళ్లినా.. రిటైర్ అయిపోయిన వదిలే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. అధికారులను బెదిరించడం ఏమిటని పవన్ మాట్లాడుతున్నారు. అంటే పవన్ కల్యాణ్ మమ్మల్ని బెదిరిస్తున్నారా?. మీ బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ లేరు.
అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితేనే వైఎస్ జగన్ భయపడలేదు. పెద్దపెద్ద వాళ్లతో ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలుపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా.. అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు.
..సుధారాణిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో కొట్టారు.మాజీమంత్రి విడుదల రజనిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. మాటలతో చెప్పుకోలేని విధంగా ఆమెను దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన ముగ్గురు అధికారులపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌లో ఉన్న 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సూపర్ సిక్స్, ఉచిత ఇసుక ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పోలీసులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నా నోటితో నేను చెప్పలేను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment