ధర్మపోరాట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి కడప: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ఎవరైనా సహజంగా అభివృద్ధి పథకాలు వేగం పుంజుకుంటాయని, పెండింగ్ పథకాలు పురోగతి సాధిస్తాయని, నూతన పథకాలకు ఆస్కారం ఉంటుందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. ఆశిస్తారు.. కానీ ముఖ్యమంత్రి చేపట్టిన ధర్మపోరాట సభ అందుకు భిన్నంగా నడిచింది. ఆది నుంచి అంతం వరకూ ‘ఆత్మస్తుతి.. పరనిందే’ ప్రధానంగా కొనసాగింది. మంగళవారం ప్రొద్దుటూరు కేంద్రంగా సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర ప్రభుత్వం, విపక్షపార్టీలను టార్గెట్ చేస్తూ ప్రసంగించడం.. తమ గొప్పలు చెప్పుకోవడమే అసలు లక్ష్యంగా కనిపించింది. ధర్మపోరాట సభ విజయవంతం కోసం దాదాపు 10 రోజులుగా టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట సభలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని జిల్లా నేతలు, మంత్రులు ఊదరగొట్టారు. ఈ సభకు వైఎస్సార్ జిల్లాతోపాటు చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో జన సమీకరణ చేశారు. లక్షమందిని తరలించాలని అంచనాలు పెట్టుకున్నారు. ఇంత చేసినా అందులో 20శాతం మాత్రమే సాధించగలిగారు. వారు కూడా కొద్ది సేపటికే ప్రాంగణం నుంచి వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం ఖాళీ అవుతూ వచ్చింది. పరిస్థితి ఇలాఉండగా మంత్రులు, ఎంపీలే కాకుండా ముఖ్యమంత్రి వరకూ ప్రసంగించిన ప్రతివారు పరనిందకే పరిమితమయ్యారు.
ఉక్కు పరిశ్రమకు మరో నెల గడువు..
కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి నాలుగున్నరేళ్లుగా ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరులో మరో నెలరోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని మంగళవారం ప్రకటించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలచే ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణదీక్ష చేయించారు. వీరి దీక్ష ముంగింపు సందర్భంగా జూన్ 30న ‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కేంద్ర ప్రభుత్వానికి 2నెలలు గడువు ఇస్తున్నాం. రెండు నెలలల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. లేదంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతామని’ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన చేశాక, నాలుగు నెలలు గడువు ముగిసింది. ఇప్పటికి ఎలాంటి పురోగతి లేకపోగా, తాజాగా మరో నెలలో శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. ఆమేరకు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో కేబినేట్ క్లియరెన్సు ఇస్తామని తెలిపారు. తిరిగి పాత పల్లవే అందుకున్నారు.. మీరు నిర్ణయం తీసుకుంటే సరేసరి..లేదంటే మేమే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బహుశా టీడీపీ శ్రేణులు ఆశించిన కీలక ప్రకటన ఇదే కాబోలు. అదే విధంగా గండికోట ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.3500 కోట్లతో చేపట్టే ఈ పనులకు నెలలో టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు.
విపక్షంపై విసుర్లు..
కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు అండగా నిలవలేదని ప్రకటిస్తే పెద్దగా ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ రాష్ట్రంలోని విపక్షాలపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తడాన్ని సభికులు హర్షించలేదు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వస్తే ప్రభుత్వం చొరవ తీసుకొని సత్వర చర్యలు చేపట్టాల్సి ఉంది. కాగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధితుల్ని పరామర్శించలేదని, జనసేనాని పవన్‌కళ్యాణ్ సకాలంలో స్పందించలేదని ఆరోపణలు గుప్పించడం విడ్డూరంగా ఉందని అక్కడికి చేరిన ప్రజానీకం చర్చించుకోసాగారు. అధికారంలో ఉన్న వారికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని, విపక్షాలపై ఆరోపణలు ఏమిటీ? 40ఏళ్లు అనుభవం ఉన్నందువల్లే ఇలాంటి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయా? అంటూ పలువురు బాహాటంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు విపక్షంలో ఉన్న వారిని నిందించడమేమిటని ప్రశ్నించుకోసాగారు.
ఆదితో ఆరంభమై సీఎంతో ముగింపు..
జిల్లాలో ధర్మపోరాట సభ అసలు ఉద్దేశం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే అన్నట్లుగా కన్పించింది. మంత్రి ఆదినారాయణరెడ్డితో ప్రారంభమైన ఈ వైఖరి ఎంపీలు సీఎం రమేష్ , జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా వరుసగా అందరూ వారివారి శైలిలో విపక్షనేతపై విమర్శలు చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం ఆరంభం కాగానే వెనుకవైపు ఉన్న సభికులు లేచిపోవడం కన్పించింది. సోమిరెడ్డి, లోకేష్ ప్రసంగాలు ముగిసే సమయానికి దాదాపు సగం ఖాళీ అయింది. ఇక ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సభికుల స్పందన కోరుతుంటే ముందువైపు ఉన్న వారు మినహా వెనుక వైపు స్పందించేందుకు ప్రజానీకం కరువయ్యారు. వెనుకవైపు ఉన్న గ్యాలరీల్లో అక్కడక్కడా ఉన్న కొద్ది మంది కూడా మౌనంగా ఉండిపోయారు. గట్టిగా అరుస్తూ సీఎం ప్రసంగిస్తున్నా ఆశించిన స్పందన కన్పించకపోవడం విశేషం. మొత్తంమీద వైఎస్సార్‌సీపీ, బీజేపీ, జనసేనను విమర్శించడం.. తమ గురించి చెప్పుకోవడానికే ధర్మపోరాట సభ నిర్వహించినట్లు ఉందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment