
కాకినాడ: రాష్ట్రంలో టీడీపీ బలపడుతుందన్న భయంతోనే అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచే ప్రతిపాదనకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డుకట్ట వేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటారని మద్దతుగా నిలిస్తే ప్రధాని మోదీ నిలువునా దగా చేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పసికందులాంటి ఆంధ్రప్రదేశ్‌ను పెంచి పెద్ద చేయాల్సిన కీలక బాధ్యతలో ఉన్న ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో అన్నివిధాలా అన్యాయం చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి ప్రజాదరణ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి తాను మద్దతుగా నిలిస్తే 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిప్పించుకుని చివరకు కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ చేసిన ప్రసంగాన్ని, దాన్ని అనువాదం చేసిన వెంకయ్యనాయుడు ప్రకటనను ఈ సందర్భంగా చంద్రబాబు చదివి వినిపించారు.
అప్పుగా ఇస్తామనడం అన్యాయం
కేంద్రం వల్ల ఏపీ రోజురోజుకూ నష్టపోయే పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం రూ.3,950 కోట్లు మాత్రమే సహాయం చేసిందని, పలు ప్రాజెక్టుల విషయంలో దగా చేసిందన్నారు. పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలిచ్చిన మోదీ సర్కార్ మనకు మాత్రం ఎస్‌పీవీ ద్వారా అప్పుగా నిధులిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తెలుగు జాతిపై అడుగడుగునా కుట్ర, కుతంత్రాలతో వ్యవహరిస్తున్న కేంద్రాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు బొబ్బిలిపులి, కొండవీటి సింహాల్లా మారి తెలుగు ప్రజల సత్తాను కేంద్రానికి చూపాలని పిలుపునిచ్చారు.
అక్రమార్కులకు అండగా నిలుస్తున్న మోదీ
విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాంటి అక్రమార్కులకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని, ఆయన హయాంలో ఎన్నో కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదలకు పంచుతానని ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు స్విస్ ఖాతాలు 50 శాతం పెరిగాయంటే మోదీ హయాంలో ప్రగతి ఏ స్థాయిలో ఉందో గ్రహించవచ్చని ఎద్దేవా చేశారు. కేజీ బేసిన్‌లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే అందుకు కూడా కేంద్రం అవరోధంగా నిలిచిందని ఆరోపించారు. మొక్కుబడిగా నిధులు విదిల్చి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తోందన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వాలే చట్టాలను ఉల్లంఘించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘సాక్షి’తమపై అవాస్తవ కథనాలు రాస్తోందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఉపన్యాసం దాదాపు రెండు గంటలపాటు కొనసాగడంతో ప్రజలు మధ్యలోనే లేచి వెళ్లిపోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment