గతేడాది టీడీపీ ధర్మపోరాట సభ సందర్భంగా ఏయూ మైదానాన్ని పసుపుమయం చేసిన దృశ్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) మైదానాన్ని సొంత అవసరాలకు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 27న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని ఏయూ గ్రౌండ్స్‌లో బహిరంగసభ నిర్వహించాలని భావించారు. ఏయూ ఉన్నతాధికారులను సంప్రదించగా, ప్రధాని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని తెగేసి చెప్పారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాన మంత్రి సభకు ఈ మైదానాన్ని ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లున్నాయని, కావాలంటే ముఖ్యమంత్రిని అడగాలని అధికారులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూజీసీ నిధులతోనే నడుస్తున్న ఏయూలో ప్రధాని సభకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ఏయూ మైదానం టీడీపీ సర్కారు సొంత జాగీరా? అని మండిపడుతున్నారు.
టీడీపీ సభలకు వాడుకున్నారుగా?
ప్రధానమంత్రి సభకు అనుమతి నిరాకరించిన ఏయూ అధికారులు గతంలో టీడీపీ మహానాడు మొదలు పార్టీ సభలకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 2017 మే నెలలో టీడీపీ మూడు రోజులపాటు ఏయూ గ్రౌండ్స్‌లో మహానాడు సభలు నిర్వహించింది. 2018 మేలో ఇదే ఏయూ గ్రౌండ్స్‌లో ధర్మపోరాట సభ పేరిట తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఏయూను పూర్తిగా టీడీపీ జెండాలతో పసుపుమయం చేసేశారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో జ్ఞానభేరి సదస్సు, గత నెలలో పసుపు కుంకుమ పంపిణీ పేరిట టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలతో భారీ సభ నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అధికార టీడీపీ నేతల కుమారుల వివాహాలు మొదలు.. గతేడాది మంత్రి లోకేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు కూడా ఏయూలోనే అట్టహాసంగా నిర్వహించారని అంటున్నారు.
కుదరదని చెప్పాం...
ప్రధానమంత్రి సభకు అనుమతించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అడిగారు. రాజకీయ పరమైన సభ కాబట్టి కుదరదని చెప్పా. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే మాకు అభ్యంతరం లేదు.
– నాగేశ్వరరావు, ఏయూ వైస్ చాన్సలర్
పెళ్లిళ్లకు ఇస్తారు.. ప్రధాని సభకివ్వరా?
తెలుగుదేశం నాయకులు ఏయూను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకే కాదు.. ఆ పార్టీల నేతల వివాహాలకు కూడా గ్రౌండ్స్ వాడుతున్నారు. కానీ, ప్రధానమంత్రి బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పడం దారుణం. వీసీని అనుమతి అడిగితే కుదరదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశా. కేవలం ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యానే ఏయూ గ్రౌండ్స్ సరైందని భావించి అడుగుతున్నాం.
– విష్ణుకుమార్ రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత
Comments
Please login to add a commentAdd a comment