
ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ
హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పాలన
31 మంది హత్య.. 300 మందిపై హత్యాయత్నాలు.. టీడీపీ నేతల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య
560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు.. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం
అరాచకాలు భరించలేక ఊళ్లు విడిచివెళ్లిన 2,700 కుటుంబాలు.. ఇవికాకుండా 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు
వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలే ఇవన్నీ..
ఓ మంత్రి రెడ్ బుక్ పేరిట హోర్డింగ్‌లతో దాడులకు పురిగొల్పారు
అడ్డుకోవద్దని అధికారులకు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ గూండాల స్వైర విహారం
వినుకొండలో నడిరోడ్డుపై నరమేధం..
పుంగనూరులో పార్టీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకల దాడి
ఈ అరాచకాలను అంతమొందించి తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపండి
కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో విచారణ జరపాలని విన్నపం
ఈ దురాగతాలను నివేదించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని వినతి
సాక్షి, అమరావతి: వివక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు. హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రాజకీయమయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా దాదాపు 27 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా చేశారంటే సీఎం చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని తెలిపారు.
ఈ మేరకు గురువారం రాత్రి ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ‘‘కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ నేతల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్లిపోయాయి. ఇవికాకుండా 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడుల ఘటనలు జరిగాయి’’ అని పేర్కొన్నారు.
ఇవన్నీ యాథృచ్ఛికంగా జరిగినవి కాదని, వైఎస్సార్ సీపీని అణగదొక్కడమే లక్ష్యంగా ఒక పథకం ప్రకారం దుర్మార్గాలని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎవరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారని.. ఆమేరకు ప్రభుత్వంలో ఉన్నవారు కింది స్థాయివరకూ అధికారులకు సంకేతాలు పంపారని తెలిపారు. ఒక మంత్రి రెడ్‌బుక్ పేరిట ఏకంగా హోర్డింగులు పెట్టి నేరుగా దాడులు చేయాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారన్నారు.
వాటిని అడ్డుకోవద్దని అధికారులకు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని, తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని విన్నవించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగించిన దురాగతాలను నివేదించేందుకు వీలైన రోజు అపాయిమెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
శాంతి భద్రతలు క్షీణించాయి.. వ్యవస్థలు కుప్పకూలాయి..
⇒ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక ఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుషంగా ఘటనలు జరుగుతున్నాయి.
⇒ ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. అధికారాన్ని అండగా పెట్టుకుని యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లపై, నాయకుల ఇళ్లపై, వారి వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారు. రోడ్డుపక్కనే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొట్ట పోసుకుంటున్న వారిపై ఉపాధిని దెబ్బకొట్టారు. రాజకీయ కారణాలతో వారి దుకాణాలను జేసీబీలతో కూల్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు.
⇒ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ఆస్తులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం చేకూర్చారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామస్థాయిలోనే ప్రజలకు అత్యంత చేరువగా సేవలందిస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్‌నూ విడిచిపెట్టలేదు. కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థలను తెచ్చిందనే ఏకైక కారణంతో వాటిని ధ్వంసం చేశారు.
⇒ అన్నిటినీ మించి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గత బుధవారం రోజు పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి. అల్లరిమూకలు పట్టపగలే నడిరోడ్డుమీద కత్తులతో స్వైరవిహారం చేస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సర్వ సాధారణం అయిపోయాయి.
ఎంపీకే రక్షణ లేని పరిస్థితి..
వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంట్‌కు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభపక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఒక ఎంపీకి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
రెడ్‌బుక్ రాజ్యాంగానికి వదిలేశారు..
⇒ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించడంలేదు. రాజ్యాంగం, చట్టం లేదు. పోలీసు వ్యవస్థ పని చేయడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి రాష్ట్రాన్ని రెడ్‌బుక్ రాజ్యాంగానికి వదిలేశారు. గూండాలకు, ఉన్మాదులకు, మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి, చిన్నారులపై దారుణాలకు ఒడిగట్టేవారికి రాష్ట్రాన్ని అప్పగించేశారు.
⇒ గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తమ విద్య, నాణ్యమైన వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్ట లా అండ్ ఆర్డర్, సుస్థిర, సమగ్ర అభివృద్ధికి నిలయమని పేరు పొందితే ఇవాళ ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో అరాచకాలు మినహా పరిపాలన కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment