ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం పాతబస్టాండ్/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు ఆపేది లేదని.. ఎన్నాళ్లయినా మోదీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో శనివారం చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి కనీస నిధులు కూడా కేంద్రం ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం కోసం తనకంటే తక్కువ అనుభవం ఉన్న మోదీ వద్దకు 29 సార్లు వెళ్లానన్నారు. మోదీకంటే తాను ముందుగానే సీఎం అయ్యానని చెప్పుకొన్నారు. నాలుగేళ్ల బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి, మన రాష్ట్రానికి ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని చెప్పి ఆ నిధులు కూడా విడుదల చేయలేదని తెలిపారు. కేంద్రం నుంచి బయటకొచ్చాక మంత్రులపైనా, ఎంపీలపైనా ఐటీ, విజిలెన్స్ దాడులకు పాల్పడుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, సీమ డ్రిప్ ఇరిగేషన్, కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్, అమరావతి నిర్మాణం.. తదితరాల్లో కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ప్రజాస్వామ్య మనుగడ కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, నల్లధనం బయటకు తీయలేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏటీఎంలు పనిచేయడంలేదు, బ్యాంకుల్లో డబ్బులేదన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, నదులను అనుసంధానం చేస్తామన్నారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం
రానున్న ఎన్నికల్లో ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ నిర్వహించేందుకు పోరాటం అవసరమన్నారు. దీక్షలో జిల్లాకు చెందిన మంత్రులు కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ప్రయోజనాల కోసమే పార్టీలను కూడగడుతున్నాం: ఇండియాటుడే
కాంక్లేవ్‌లో చంద్రబాబు
ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అనివార్యమని, జాతీయ ప్రయోజనాల కోసమే ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్‌లో సీఎంతో ఆ సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్ పలు రాజకీయ అంశాలపై సంభాషించారు. దేశంలో తానే సీనియర్ సీఎంనని చంద్రబాబు చెప్పుకొన్నారు. ప్రధాని మోదీది నెగెటివ్ క్యారెక్టర్ అని, ఆర్థిక వ్యవస్థను, జాతిని ఆయన నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘తాను బలవంతుడినని చెప్పుకొనే మోదీ.. జాతికి ఏం చేశారు? సీబీఐ కంటే ఏపీలోని ఏసీబీ సమర్థంగా పనిచేస్తోంది. ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారు’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించడం లేదని, మోదీ కంటే గత ప్రధానులంతా ఉత్తమమైన వారేనన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తాను సమర్థించడం లేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే బీజేపీ వ్యతిరేక కూటమి ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని చంద్రబాబు వివరించారు.
జనం అవస్థలు...
ధర్మపోరాట దీక్షతో శ్రీకాకుళం జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని అయిదు ఆర్టీసీ డిపోల నుంచి సుమారుగా 600 బస్సులను ఈ కార్యక్రమానికి వినియోగించడంలో గ్రామీణ ప్రాంతాల వారికి బస్సు సదుపాయాల్లేక అష్టకష్టాలుపడ్డారు. కార్యకర్తలు బలవంతంగా గ్రామాల్లో ప్రజలను భయపెట్టి సదస్సుకు తరలించే యత్నం చేశారు.
మోదీ నాకు మంచి మిత్రుడే కానీ..
ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని, కానీ సైద్ధాంతికంగానే ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను చూసి ఆయనను విశ్వసించానని, కానీ అధికారంలోకి వచ్చాక ఏవీ అమలు కాలేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దును తాను స్వాగతించిన మాట వాస్తవమేనని, కానీ రూ.2,000.. 500 నోట్లను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించానన్నారు. జాతి ప్రయోజనాల కోసం.. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీఏతో మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారా? అన్న సర్‌దేశాయ్ ప్రశ్నలకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతి పైనే అభివృద్ధినంతా కేంద్రీకరిస్తున్నారన్న విమర్శలను సీఎం ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment