ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతిపత్రం
విభజన హామీలపై ఏపీ ఇంకా పోరాడుతూనే ఉంది
కేంద్రం చేయూత మినహా మరో మార్గం లేదు
కేంద్ర మంత్రులతో సీఎం వేర్వేరుగా సమావేశం
నేడు నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌సింగ్, నడ్డా, నీతి ఆయోగ్ సీఈఓలతో భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో కేంద్రంతో ఏపీ ఇంకా పోరాడుతూనే ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రధానిని కలసి వినతిపత్రం అందచేశారు.
పోలవరం పూర్తికి సహకరించండి
విభజన సమస్యలతోపాటు వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగిందని, ఆర్థిక వసూళ్లు తగ్గిపోయాయని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని చెప్పారు. జీతాలు, పెన్షన్లు, ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం, పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, వనరుల కొరత కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. ఇలాంటి పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇవ్వడం మినహా మరో మార్గం లేదని ప్రధానికి నివేదించారు.
కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు ఆయన వెంట ఉన్నారు.
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.385 కోట్లు విడుదల చేయాలని, నిర్వహణకు రూ.27.54 కోట్లు కేటాయించాలని, రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 79 నుంచి 117కు పెంచాలని అమిత్‌షాను కోరారు. అమరావతి చుట్టూ ఔటర్ రింగు రోడ్ ప్రాజెక్టు మంజూరు చేయాలని, హైదరాబాద్–విజయవాడ – అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అభివృద్ధి చేయాలని, కుప్పం–హోసూర్–బెంగళూరు నుంచి నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే, విశాఖ–మూలపేట నుంచి 4 లేన్ గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ హైవే ఏర్పాటుకు సహకరించాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో నాలుగు పారిశ్రామిక నోడ్‌లను గుర్తించి విద్యుత్తు, రైల్వే రోడ్డు కనెక్టివిటీ సదుపాయాలకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. ఆక్వా పార్క్ మంజూరు చేయాలని, హార్టికల్చర్ రైతులకు సబ్సిడీ పెంచేందుకు విధానాన్ని రూపొందించాలని, పీఎండీఎంసీ పథకం కింద రూ.125.52 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేయాలని శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. కర్నూలు నుంచి వైజాగ్ వరకు హెచ్‌వీడీసీ ఐఎస్‌టీఎస్ లైన్ ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని, వైజాగ్–కాకినాడ గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా ప్రకటించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ తూర్పు బైపాస్‌కు టెండర్లు
విజయవాడ తూర్పు బైపాస్‌కు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు నితిన్ గడ్కరీ పచ్చ జెండా ఊపినట్లు వెల్లడించారు. విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌పై కూడా సమీక్ష జరిగిందని, ఈ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు చెప్పారు.
⇒ సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కలుసుకుంటారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment