ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..! | Ksr Comments On BJP Leader Narendra Modi's Double Game Behaviour | Sakshi
Sakshi News home page

ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..!

Published Mon, May 20 2024 12:43 PM | Last Updated on Mon, May 20 2024 3:33 PM

Ksr Comments On BJP Leader Narendra Modi's Double Game Behaviour

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని శ్రీరాముడు మళ్లీ టెంట్ కిందకు వస్తాడు.. ఆలయంపై బుల్డోజర్ పంపుతారు.. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక వ్యాఖ్య. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఇంత మాట ఎలా అన్నారో అర్దం కాదు. ఈ మాట విన్నప్పుడు ఒక్కసారిగా దేశ ప్రజలంతా ఆశ్చర్యం చెందారు. మోదీనేనా ఇలా మాట్లాడుతుంది.. అని అంతా విస్తుపోయారు. దాంతో మోదీ ఈసారి ఎందుకో తడబడుతున్నారన్న భావన ఏర్పడింది. గత రెండు ఎన్నికలలో మోదీ ఇంత ఘోరంగా మాట్లాడారన్న విమర్శలు రాలేదు. ఈ ఒక్కటే కాదు. కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ సంతోషిస్తుందని, ముస్లింలను అప్పీజ్ చేస్తోందని, ముస్లింలకు రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

⇒ అంటే ఈ విమర్శల ద్వారా హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు మోదీ, ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు ప్రయత్నించారు. ఇక్కడ కూడా వారు డబుల్ గేమ్ ఆడారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. గతంలో కర్నాటకలో కూడా అలాగే చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాన్ని నిలబెటుకోలేకపోయారు. తెలంగాణలో ఆ పాయింట్ పైన కూడా గట్టి ఉపన్యాసాలు చేశారు. కానీ ఏపీకి వెళ్లేసరికి అక్కడ మళ్లీ టీడీపీ, జనసేనల కూటమితో కలిసి ఉండడంతో, ముస్లిం రిజర్వేషన్ల గురించి ప్రసంగాలలో ప్రస్తావించకపోవడం కూడా అందరూ గమనించారు.

⇒ 2014 ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన వ్యూహాత్మకంగా దేశం అంతటా గుజరాత్‌లో జరిగిన అబివృద్ది అంటూ టీవీలలో, పత్రికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తద్వారా ఒక ఇమేజీని తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్దిగా కూడా నిర్ణయం కాలేదు. కానీ తన ప్రచార వ్యూహం ద్వారా బీజేపీని కూడా ఆయన ప్రభావితం చేయగలిగారు. దేశ ప్రజలంతా మోదీ అంటే అభివృద్ది అని నమ్మారు. గుజరాత్‌లో ఆయన బాగా చేశారన్న భావన బాగా బలపడింది. ఆ రోజుల్లో టీవీలలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే జనం నుంచి నిరసన వచ్చేది. నేను లైవ్ షో చేస్తున్నప్పుడు సైతం ఈ అనుభవం చూశాను. ఎక్కడైనా మోదీని ఒక్క మాట అంటే జనం ఊరుకునేవారుకారు. అలాంటిది దశాబ్దం తర్వాత మోదీని లైవ్ షోలలో ఫోన్ చేసి ప్రజలే విమర్శిస్తున్నారు.

⇒ అంతమాత్రాన ఆయనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని కాదు. కానీ ఒక నేత ఎలా ఉండాలని అనుకుంటారో ఆయన అలా లేరన్న భావన పెరుగుతోందన్నమాట. ప్రత్యేకించి రామాలయంపై బుల్డోజర్‌ నడుపుతారన్న ఆయన ఆరోపణను ఎవరూ జీర్ణించుకోలేదు. ఆయనను సమర్ధించేవారు సైతం మోదీ అలాంటి విమర్శ చేసి ఉండాల్సింది కాదనే అనుకుంటున్నారు. ప్రధాని మోదీ వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసి, రెండువేల రూపాయల నోట్లు తెచ్చినప్పుడు చాలామందికి అంత ఇష్టం లేదు. దానివల్ల సామాన్యులు చాలా కష్టపడ్డారు. అయినా మోదీ చిత్తశుద్దిని జనం శంకించలేదు. దేశం కోసం, నల్లధనం నిర్మూలనకోసమే ఆయన ఇలా చేసి ఉండవచ్చులే అని సర్దుకున్నారు.

⇒ జీఎస్‌టీ వంటివాటిపై కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో బీజేపీ గెలవదన్న అంచనాకు వచ్చిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు వంటివారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగారు. ఆ తరుణంలో జరిగిన పుల్వమా ఘటనతో దేశం మూడ్ మారిపోయింది. పాక్ ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న బస్‌ను పేల్చడంతో, మోదీ ధైర్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వైమానిక దళాన్ని పంపించి ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయించారు. అప్పుడు ఇండియా పైలట్ ఒకరు పాక్‌కు పట్టుబడగా, జాగ్రత్తగా హాండిల్ చేసి ఆయనను భద్రంగా ఇండియాకు తీసుకు రాగలిగారు. దాంతో మోదీపై విశ్వాసం పెరిగింది. మళ్లీ మోదీ వేవ్ వీచి ఎన్‌డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.

⇒ 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని టెర్రరిస్తు అని విమర్శించారు. భార్యను ఏలుకోలేని వ్యక్తి దేశాన్ని ఏమి ఏలతారని అన్నారు, ముస్లింలను బతకనివ్వరని, మంచివాడు కాదని.. అవినీతిపరుడని.. ఇలా ఏవేవో పిచ్చి విమర్శలు చేశారు. దానికి ప్రతిగా చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ మాదిరి వాడుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. లోకేష్ తండ్రి అంటూ చాలా వ్యంగ్యంగా చంద్రబాబు సీనియారిటీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ 2024 నాటికి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీతో జతకట్టడం ప్రజలందరిని ఆశ్చర్యపరిచింది. మోదీ ఎంతో వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉన్న నేత అని భావిస్తున్న సపోర్టర్లకు ఆయన షాక్ ఇచ్చారని చెప్పాలి.

⇒ అలాగే టెర్రరిస్టు అన్న నోటితోనే చంద్రబాబు నాయుడు విశ్వగురు అంటూ మోదీని పొగిడారు. మరి వీళ్లిద్దరూ గతంలో దూషించుకున్న విషయాలను నమ్మిన ప్రజలు ఏమైపోవాలి. వీరు మారితే ప్రజలంతా మారిపోవాలా? అన్న చర్చ జరిగింది. దేశ ప్రధాని అయిన తర్వాత రాజకీయ నేతగా కాకుండా రాజనీతిజ్ఞుడుగా మారాలని అంతా ఆశిస్తారు. గతంలో చేసిన పలువురు ప్రధాన మంత్రులు చాలావరకు అలాగే వ్యవహరించారు. ప్రతిదానిలోను రాజకీయం చూడలేదు. రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేసినా చాలా హుందాగా ఉండేవి. వ్యక్తిగత ఆరోపణలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ మోదీ రాష్ట్రస్థాయి నాయకులతో పోటీపడినట్లుగా, ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి వెనుకాడలేదు.

⇒ ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అవినీతిపరులను జైలులోనే ఉంచుతామని తాజాగా ఆయన చేసిన ప్రకటనను కూడా జనం సీరియస్‌గా తీసుకోవడం లేదు. డిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఒకదానిని తీసుకుని ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను, ఆయన మంత్రులు కొందరిని జైలులో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారన్న విమర్శ వచ్చింది. అదే టైమ్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసిన వారిని, వందల కోట్ల మోసాలు చేసినవారిని బీజేపీలో చేర్చుకుని వారికి ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చి, వారికోసం ప్రచారానికి స్వయంగా వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. నిజంగా మోదీకి అవినీతిని అంతం చేయాలన్న చిత్తశుద్ది ఉందా అన్న సందేహం కలుగుతుంది.

⇒ గతంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో పలు ఆరోపణలు వచ్చినా జనం పట్టించుకోలేదు. కానీ మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదన్న భావన ప్రజలలో ప్రబలితే అది వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అసలు మోదీ బుల్డోజర్ విమర్శలు చేయగానే అందరికి గుర్తుకు వచ్చింది యూపీ ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ తోనే ప్రభుత్వం నడిపారన్న వ్యాఖ్య ఉంది. రౌడీ షీటర్లు, అల్లర్లకు పాల్పడిన వారిని చట్టం ప్రకారం శిక్షించడం కాకుండా బుల్డోజర్‌లతో వారి ఇళ్లు కూల్పించారు. ఇప్పుడు ఆరోపణ మోదీ కాంగ్రెస్ పై చేస్తున్నారు. అంతేకాదు, అయోధ్యలో వివాదాస్పద బాబ్రి మసీదును కూల్చింది కూడా బీజేపీనే అన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మత రాజకీయాలు చేయడంలో బీజేపీదే అగ్రస్థానంగా ఉందన్నది వాస్తవం. అయినా మోదీ కాంగ్రెస్‌పై మతపరమైన ఆరోపణలు చేస్తుంటారు. అలా అని కాంగ్రెస్ ఏదో పత్తిత్తు అనడం లేదు.

⇒ తెలంగాణలో ఆర్ఆర్‌టాక్స్ అంటూ మోదీ విమర్శలు చేశారు. బాగానే ఉంది. మరి గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును అవినీతిపరుడని విమర్శించారు కదా.. ఇప్పుడు ఎలా కలిశారంటే అందుకు జవాబుదొరకదు. చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు కేంద్రం ప్రకటన చేసింది కదా.. అదేమైంది అని ఎవరైనా అడిగితే బదులు ఉండదు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిన విషయంలో ఏమి తేల్చారో ఎవరూ చెప్పరు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పలు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆయన తమ పార్టీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చి మరీ ఆదరించింది. దీనిని ఏ విధంగా చూడాలి. ఇలా అన్నిటిలొను డబుల్ గేమ్ ఆడుతున్న నేతలలో మోదీ చేరడం ఆయనను అభిమానించేవారికి కాస్త బాధ కలిగించే విషయమే కదా!

⇒ మరో విషయం మాట్లాడుకోవాలి. ఒకవైపు బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. ఇంకోవైపు ఆయా రాష్ట్రాలలో రకరకాల ఉచిత వాగ్దానాలు చేస్తుంటారు. ఉదాహరణకు ఒడిషాలో శాసనసభ ఎన్నికలలో ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల ఓచర్ ఇస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందట. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవులు అధికంగా ఉంటారు కనుక అక్కడ ఉచితంగా జెరుసలెం యాత్రకు హామీ ఇస్తుంటారు.ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రకటించిన మానిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెబుతారు. అదే టైమ్ లో వారి మానిఫెస్టోకి మద్దతు ఇస్తున్నామని అంటారు. దీని అర్ధం ఏమిటో ఎవరికి తెలియదు. బీజేపీలో ఇతర పార్టీ అభ్యర్ధులను తీసుకుని టిక్కెట్లు ఇస్తుంటారు. దేశ వ్యాప్తంగా 108 మంది ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం అభ్యర్ధులలో నాలుగో వంతు ఇతర పార్టీలకు చెందినవారే అన్నమాట.

⇒ అంతదాకా ఎందుకు ఏపీలో ఆరుగురు అభ్యర్ధులలో ఐదుగురు వేరే పార్టీల నుంచి వచ్చి చేరినవారే. వారిలో కొందరు టీడీపీ కోవర్టులుగా ముద్రపడ్డవారు. తెలంగాణలో సైతం పదిమందికి పైగానే ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. ఇలాంటి పరిస‍్థితిలో గతంలో కాంగ్రెస్ పార్టీ తీరుకు, ఇప్పుడు బీజేపీ తీరుకు పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టారు. ఇప్పుడు ఎమర్జన్సీ లేకుండానే ఏదో కేసులో పెట్టి తమకు గిట్టనివారిని జైలుకు పంపుతున్నారన్న విమర్శలను మోదీ ఎదుర్కుంటున్నారు. అదే టైమ్‌లో బీజేపీలో చేరగానే కేసులు ఏవీ ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాయన్న బావన ఏర్పడింది. అందుకే ఆయా రాష్ట్రాలలో కొంతమంది తాము ఎన్ని అవినీతి పనులు చేసినా బీజేపీ గొడుగు కిందకు చేరి రక్షణ పొందుతున్నారన్న అబిప్రాయం వ్యాపిస్తోంది.

⇒ ఇది మోదీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇలాంటి కారణాల వల్లే ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్‌డీఏకి 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు పలువురు చెబుతున్నా, అదంతా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ మోదీ వంటి పెద్ద నేత తన ప్రసంగాలలో సంయమనంగా ఉంటేనే మంచిది. దానివల్ల దేశ రాజకీయాలు కొంత ఆరోగ్యకరంగా సాగడానికి అవకాశం ఉంటుంది. విశేషమేమిటంటే శ్రీరాముడిని సొంతం చేసుకుని రాజకీయాలు సాగించాలన్న వ్యూహంలో ఉన్న బీజేపీ రామాలయం ఉన్న అయోధ్యలోనే తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోందట.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement