Division guarantees
-
ఆదుకోండి.. కేంద్రం చేయూత మినహా మరో మార్గం లేదు: సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో కేంద్రంతో ఏపీ ఇంకా పోరాడుతూనే ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రధానిని కలసి వినతిపత్రం అందచేశారు. పోలవరం పూర్తికి సహకరించండివిభజన సమస్యలతోపాటు వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగిందని, ఆర్థిక వసూళ్లు తగ్గిపోయాయని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని చెప్పారు. జీతాలు, పెన్షన్లు, ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం, పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, వనరుల కొరత కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. ఇలాంటి పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇవ్వడం మినహా మరో మార్గం లేదని ప్రధానికి నివేదించారు.కేంద్ర మంత్రులకు వినతిపత్రాలుకేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు ఆయన వెంట ఉన్నారు. గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.385 కోట్లు విడుదల చేయాలని, నిర్వహణకు రూ.27.54 కోట్లు కేటాయించాలని, రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 79 నుంచి 117కు పెంచాలని అమిత్‌షాను కోరారు. అమరావతి చుట్టూ ఔటర్ రింగు రోడ్ ప్రాజెక్టు మంజూరు చేయాలని, హైదరాబాద్–విజయవాడ – అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అభివృద్ధి చేయాలని, కుప్పం–హోసూర్–బెంగళూరు నుంచి నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే, విశాఖ–మూలపేట నుంచి 4 లేన్ గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ హైవే ఏర్పాటుకు సహకరించాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాలుగు పారిశ్రామిక నోడ్లను గుర్తించి విద్యుత్తు, రైల్వే రోడ్డు కనెక్టివిటీ సదుపాయాలకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. ఆక్వా పార్క్ మంజూరు చేయాలని, హార్టికల్చర్ రైతులకు సబ్సిడీ పెంచేందుకు విధానాన్ని రూపొందించాలని, పీఎండీఎంసీ పథకం కింద రూ.125.52 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేయాలని శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. కర్నూలు నుంచి వైజాగ్ వరకు హెచ్వీడీసీ ఐఎస్టీఎస్ లైన్ ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని, వైజాగ్–కాకినాడ గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా ప్రకటించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు బైపాస్కు టెండర్లువిజయవాడ తూర్పు బైపాస్కు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు నితిన్ గడ్కరీ పచ్చ జెండా ఊపినట్లు వెల్లడించారు. విజయవాడ వెస్ట్రన్ బైపాస్‌పై కూడా సమీక్ష జరిగిందని, ఈ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు చెప్పారు.⇒ సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కలుసుకుంటారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ కానున్నారు. -
విభజన హామీలు ఎప్పుడు నెరవేరేను?
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ 2014లో రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా, హడావిడిగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ఫలితాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రధాన లక్ష్యం రెండు రాష్ట్రాలు విడివిడిగా సర్వతోముఖాభివృద్ధి సాధించడం. మరి అది జరుగుతోందా?పునర్విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.విశాఖపట్టణం–చెన్నె పారిశ్రామిక కారిడార్, ప్రస్తుతం ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడే రాజధానికి మంచి రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను కల్పించడం వంటివి నెరవేర్చవలసి ఉంది. విశాఖపట్టణంలో క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.ఇది వరలో పునర్విభజన చట్టాలలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పన్నుల విషయంలో కొన్ని అసాధారణతలు చోటు చేసుకొన్నాయి. వాటిని సరిదిద్దడానికి చట్టంలో అవసరమైన సవరణలు చేయమని లేదా వాటివల్ల కలుగుతున్న నష్టం రూ. 3,820 కోట్లను మంజూరుచేయమని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది. పై విషయాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి, తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో పూర్తి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిలోని అనేక కార్పొరేషన్లు వాటి హక్కుల సాధన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంపై కోర్టులో అనేక వ్యాజ్యాలు (కేసులు) వేశాయి. ఆ కేసులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఒక్క తీర్పును కూడా అమలు పరచలేదు. తెలంగాణ రాష్ట్రం, శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాగునీరు, సాగునీటి అవసరాలకు నిర్లక్ష్యం చేస్తూ జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తోంది. ఈ పరిస్థితులలో గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ప్రకారం సమగ్రమైన సూచనలను ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే పరిస్థితిని నివారించాలని ఆశిద్దాం.కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్ -
జీవనాడికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విభజన హామీల నోడల్ ఏజెన్సీ అయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయినా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై దృష్టిసారించాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. బుధవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన రాత్రి సుమారు 40 నిమిషాల పాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘అశాస్త్రీయ విభజన వల్ల ఏపీకి ఆర్థికంగా, ఆదాయాల పరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాల నుంచి కాపాడేందుకు పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. అది జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టి సారించాలి’ అని సీఎం కోరారు. ఇంకా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన అంశాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం అధికారిక నివాసానికి వెళ్తున్న సీఎం జగన్ వేగం పెరగాలంటే నిధులివ్వాలి ► అనూహ్య వరదల కారణంగా పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతింది. ఆ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసింది. ఈ సొమ్ములు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సొంత ఖజానా నుంచి రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్లుగా ఈ సొమ్ము పెండింగ్‌లో ఉంది. వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్ధారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలి. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలి. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలి. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలి. డీబీటీ పద్ధతిలో ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. ఈ నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి. ► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూడాలి. ► రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ► తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి. ► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3 లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టి సారించాలి. ► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాం. ► కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. (జిల్లాకు ఒక కాలేజీ చొప్పున మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది.. రాష్ట్రంలో మరో రెండు కాలేజీలు అదనం) ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత, తలారి రంగయ్య, శ్రీకృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనూరాధ, మాధవి, బీవీ సత్యవతి, ఆర్.కృష్ణయ్య, కోటగిరి శ్రీధర్, బీద మస్తానరావులు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాత్రి అధికారిక నివాసంలో బస చేశారు. గురువారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
విభజన హామీలకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, తిరుపతి/తిరుపతి అర్బన్: విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ పునరుద్ఘాటించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరిట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలసి శుక్రవారం తిరుపతిలో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు, సోలార్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ–వెహికల్స్‌పై త్వరలో ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామని, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి యాంటీ డంపింగ్ డ్యూటీ విధించే విషయమై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏర్పేడులో స్థాపించనున్న ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రైజర్స్, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.ఏపీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు పెద్దఎత్తున రావాల్సి ఉందన్నారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పనే ధ్యేయం పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను జిల్లా స్థాయిలోనూ అమలు చేస్తామన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్‌కు గోల్డ్ రేటింగ్ అవార్డు తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రకటించిన గోల్డ్ రేటింగ్ అవార్డును కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రైల్వే అధికారులకు అందజేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ 50 శాతం కన్నా ఎక్కువ మెరుగైన వసతులు ఉన్న రైల్వే స్టేషన్లకు గ్రీన్ బిల్డింగ్ కార్పొరేషన్ ఈ అవార్డులు ఇస్తోందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య, డీఆర్ఎం విజయప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడ ఎంఐఎంతో.. అక్కడ బీజేపీతో దోస్తీ: చాడ
సిద్దిపేటకమాన్: నాలుగేళ్ల కాలంలో విభజన హామీలు ఒక్కటీ అమలు కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మంజూరు కాలేదని, ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, హైకోర్టు విభజన జరలేదని పేర్కొన్నారు. రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే, టీఆర్ఎస్ మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వడం దేనికి సంకేతం అని నిలదీశారు. ఇక్కడ ఎంఐఎంతో దోస్తీ చేస్తూ అక్కడ బీజేపీతో దోస్తీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాలను తాకట్టు పెడితే సహించేదిలేదన్నారు. కాగా, ‘సమస్యలపై సమరం’పేరుతో తమ పార్టీ తరఫున ఈ నెల 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేయనున్నామని పేర్కొన్నారు. -
అసెంబ్లీని సమావేశపర్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాల ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విష యంలో ప్రజలకు నిజాలు తెలియాలంటే శాసనసభ, మండలిని సమావేశపరిచి చర్చించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారంలో సీఎల్పీ కార్యాలయంలో శాసనసభాపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు గురించి సీఎంగా ఉండి కూడా కేసీఆర్ ప్రధాని మోదీ ముందు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ఎంపీ కవిత ముందు సమర్థించి ఆ తర్వాత మాట మార్చారని, ఇన్నాళ్లు నోరుమెదపని రాష్ట్ర మంత్రులు ఇప్పుడు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం కూడా ఒడిసిపోయిందా? విభజన చట్టం కూడా ఒడిసిపోయిన సబ్జెక్టేనని సీఎం కేసీఆర్ అంటారా అని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. విభజన హామీల అమలు కోసం తాను సుప్రీంకోర్టులో పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదని చెప్పారు. తెలంగాణ నుంచి తమకు సమాధానం రావడం లేదని కేంద్రం చెబుతోందని, విభజన చట్టం అమల్లో రాష్ట్ర ప్రయోజనాలున్నాయనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
విభజన హామీలపై ఉమ్మడి పోరు
ఇబ్రహీంపట్నం(మైలవరం): రాష్ట్ర విభజన హామీల సాధనకు ఫిబ్రవరిలో ఉమ్మడి పోరుకు శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు తెలిపారు. పశ్చిమ కృష్ణా జిల్లా మహాసభలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏవిధమైన హామీలు పొందారు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాడితే తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. గుంటూరు జిల్లా గొట్టుపాడులో దళితులపై దాడిచేసిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములను అరెస్ట్ చేయకపోతే ‘చలో గుంటూరు’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు సిద్ధం కండి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా రింగ్సెంటర్లో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఏ కాలనీ గ్రౌండ్ నుంచి స్థానిక రింగ్‌సెంటర్ వరకు కార్యకర్తలు, పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో బాబూరావు మాట్లాడుతూ పాలకులు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారలు మోపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆయిల్ ఉత్పత్తుల ధరలు పెంచడమేనని చెప్పారు. ధరలు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఉద్యమించనున్నుట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, స్వరూపారాణి, జమలయ్య, శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆర్.రఘు, నాగేశ్వరరెడ్డి, పీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. పశ్చిమ కృష్ణా కార్యదర్శిగా డీవీ కృష్ణ రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఎం జిల్లా మహాసభలో పశ్చిమకృష్ణా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా డీవీ కృష్ణ, కార్యవర్గదర్శివర్గ సభ్యులుగా దోనేపూడికాశీనా«థ్, ఎన్సీహెచ్ శ్రీనివాస్, శ్రీదేవి, పీవీ ఆంజనేయులు, నాగేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్లను ఎన్నికయ్యారు. మరో 24 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
విభజన హామీలు సాధించే వరకు పోరాడుతాం
స్పష్టం చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనే ముందు పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నివాసంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, బుట్టారేణుక, అవినాశ్ రెడ్డి, మిథున్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. విభజన హామీలను సాధించుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు లాంటి హామీలను అమలు చేయాలని పార్లమెంటులో పట్టుబడతామని తెలిపారు. అనంతరం ఎంపీలందరూ పార్లమెంటుకు కలసి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. -
హోదా కోసం ‘తప్పెటగుళ్లు’
-
హోదా కోసం ‘తప్పెటగుళ్లు’
టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన.. సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయాలంటూ మంగళవారం ఢిల్లీలో తప్పెటగుళ్ల వేషధారణలో టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆందోళన చేశారు. ఈ సందర్భగా ఏపీకి ఇచ్చిన హామీలపై శివప్రసాద్ పాట పాడి వినిపించారు. ప్రత్యేక హోదా కోసం వేచి చూసి ఓపిక నశిస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోందని, అయితే హోదా కోసమే తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. హోదా సాధనకు వైఎస్ జగన్ సహా ఏ పార్టీ పోరాటం చేసినా సహకరిస్తామని వెల్లడించారు. -
ధనికుల చేతిలో టీడీపీ బందీ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలు సిటీ: రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల కోసం నందమూరి తారకా రామారావు..టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు..పార్టీని ధనవంతుల కోసమే నడుపుతున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గడప గడపకు సీపీఐ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి సాధించారని నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేసి విభజన హామీలను అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు అగ్రవర్ణాలకు చెందిన పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన చేశారని, బాబు దృష్టిలో అగ్రవర్ణాల్లో పేదలంటే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లేనని రాజ్య సభసీట్ల కేటాయింపును బట్టి అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి రసూల్, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాణిక్యం, ఏఐయస్‌యఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -
రిజిస్ట్రేషన్ లేకుండా.. వారసత్వం
-
రిజిస్ట్రేషన్ లేకుండా.. వారసత్వం
* త్వరలో చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడి * విశాఖలో ‘మీ ఇంటికి మీ భూమి’ ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: తండ్రి సంపాదించిన భూమిని పిల్లలు రిజిస్ట్రేషన్ లేకుండా వారసత్వంగా పొందేలా చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని సోమవారం అనకాపల్లి సమీపంలోని శంకరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే తమ భూమి వివరాలను తెలుసుకునే అవకాశాన్ని ‘మీ ఇంటికి మీ భూమి’ ద్వారా కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ర్టంలో 2.24 కోట్ల సర్వే నంబర్లుండగా..72 లక్షల మంది పట్టాదారులున్నారని చెప్పారు. వీరికి చెందిన భూమి వివరాలు సేకరించి మీ భూమి వెబ్సైట్లో పొందుపరిచేందుకు ఈ నెలాఖరు వరకు అధికారులు సర్వే చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్‌తో రెవెన్యూ రికార్డుల అనుసంధానం చేపట్టామన్నారు. తెల్లరేషన్‌కార్డునే ఆదాయ ధ్రువీకరణపత్రంగా చూపించవచ్చని, ఆధార్‌కార్డులుంటే నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. విశాఖలో నల్లబెల్లంపై దీర్ఘకాలంగా ఉన్న నిషేధం ఎత్తివేత విషయంలో నిబంధనలు సడలిస్తామన్నారు. ఈ సందర్భంగా ‘మీ ఇంటికి- మీ భూమి’ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. విభజన హామీలు నిలబెట్టుకోండి.. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీకి కనీసం ఐదేళ్ల పాటైనా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరినీ కలుస్తామని చెప్పారు. ఆశా వర్కర్ల నిరసన..: వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభించే సమయంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాలని.. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని వినతిపత్రమిచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అనుమతించలేదు. దీంతో స్టాల్స్ ప్రారంభించే సమయంలో సీఎం ఎదుట వారు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నినాదాలు చేయొద్దు.. మీలో ఎవరైనా వచ్చి వినతి పత్రమివ్వండని మంత్రులు సూచించడంతో నాయకులు వచ్చి సమస్యలు తెలపగా సీఎం వినతిపత్రం తీసుకుని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ర్ట మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జడ్పీ చైర్పర్సన్ భవానీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణకు మొండిచేయి
విభజన హామీలు తప్ప కొత్త కేటాయింపులేమీ లేవు సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరాశపరిచింది. ‘పునర్విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చట్టపరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది...’ అన్న మాటమాత్ర ప్రస్తావన తప్ప తెలంగాణకు ప్రత్యేక హోదా గానీ, నిధులు గానీ ఈ బడ్జెట్లో ఏమీ దక్కలేదు. రాబోయే ఐదేళ్లలో స్థాపించే కొత్త పరిశ్రమలకు 15 శాతం అదనపు పన్ను రాయితీ, పన్ను తరుగుదలలో 15 శాతం రాయితీ ఇస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. 2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి 31 వరకు స్థాపించే యూనిట్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొనడం పరిశ్రమలకు ఊరటనిచ్చే పరిణామమే. అయినా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆశించిన విధంగా కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవటం నూతన పారిశ్రామిక విధానాన్ని ఎంచుకున్న తెలంగాణ పురోగతికి కళ్లెం వేసినట్లయింది. గత బడ్జెట్లో ప్రస్తావించిన ఉద్యానవన వర్సిటీకి రూ.75 కోట్లు కేటాయించటం కొంత ఊరటనిచ్చింది. వారసత్వ సంపద పరిరక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్కు చోటు దక్కడంతో పర్యాటకాభివృద్ధికి కొత్త బాటలు వేసినట్లయింది. హైదరాబాద్ ఐఐటీకి రూ.55 కోట్ల కేటాయింపులు, గిరిజన వర్సిటీకి రూ.కోటి మాత్రం ఈ బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన పద్దులుగా కనిపించాయి. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు ఆర్థిక సాయం చేయాలని సీఎం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి చేసిన అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోలేదు. వాటా పెరిగినా అంతే.. కేంద్ర పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించాలన్న నిర్ణయంతో భారీ మొత్తంలో నిధులు వస్తాయని ఆశపడ్డ తెలంగాణకు, పంపిణీ వాటా తగ్గటంతో నష్టం వాటిల్లింది. పైగా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను ఈ బడ్జెట్లో దాదాపు 27 శాతం మేరకు తగ్గించారు. దాంతో పది శాతం పన్నుల వాటా పెరిగినా మొత్తంమీద ఏటా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులేమీ పెరగకపోవచ్చని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. కొత్త సాయం అందకపోగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) పథకాన్ని రద్దు చేయటంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రంలో 9 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల జాబితాలోనే ఉన్నాయి. ఏటేటా ఈ ప్రాంతాల్లో రోడ్డు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం బీఆర్జీఎఫ్ కింద రూ.255 కోట్లు విడుదల చేసేది. దీనికి తోడు గ్రామపంచాయతీల అభివృద్ధికి రాజీవ్‌గాంధి శశక్తీకరణ్ పథకంలో భాగంగా ఏటా రూ.150 కోట్లు కేంద్రం నుంచి విడుదలవుతున్నాయి. ఈ పథకాలను ఉపసంహరించుకోవటంతో ఏటా రూ.400 కోట్ల మేరకు లోటు ఏర్పడనుంది. సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే ఏఐబీపీ ఈ బడ్జెట్టులో కనుమరుగైంది.