
ధనికుల చేతిలో టీడీపీ బందీ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కర్నూలు సిటీ: రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల కోసం నందమూరి తారకా రామారావు..టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు..పార్టీని ధనవంతుల కోసమే నడుపుతున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గడప గడపకు సీపీఐ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి సాధించారని నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.
దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేసి విభజన హామీలను అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు అగ్రవర్ణాలకు చెందిన పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటన చేశారని, బాబు దృష్టిలో అగ్రవర్ణాల్లో పేదలంటే సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లేనని రాజ్య సభసీట్ల కేటాయింపును బట్టి అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి రసూల్, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాణిక్యం, ఏఐయస్‌యఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ