అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ 2014లో రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా, హడావిడిగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ఫలితాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రధాన లక్ష్యం రెండు రాష్ట్రాలు విడివిడిగా సర్వతోముఖాభివృద్ధి సాధించడం. మరి అది జరుగుతోందా?
పునర్విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.
చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.
విశాఖపట్టణం–చెన్నె పారిశ్రామిక కారిడార్, ప్రస్తుతం ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడే రాజధానికి మంచి రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను కల్పించడం వంటివి నెరవేర్చవలసి ఉంది. విశాఖపట్టణంలో క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.
ఇది వరలో పునర్విభజన చట్టాలలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పన్నుల విషయంలో కొన్ని అసాధారణతలు చోటు చేసుకొన్నాయి. వాటిని సరిదిద్దడానికి చట్టంలో అవసరమైన సవరణలు చేయమని లేదా వాటివల్ల కలుగుతున్న నష్టం రూ. 3,820 కోట్లను మంజూరుచేయమని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది.
ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది. పై విషయాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి, తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో పూర్తి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమౌతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిలోని అనేక కార్పొరేషన్లు వాటి హక్కుల సాధన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంపై కోర్టులో అనేక వ్యాజ్యాలు (కేసులు) వేశాయి. ఆ కేసులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఒక్క తీర్పును కూడా అమలు పరచలేదు. తెలంగాణ రాష్ట్రం, శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాగునీరు, సాగునీటి అవసరాలకు నిర్లక్ష్యం చేస్తూ జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తోంది. ఈ పరిస్థితులలో గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ప్రకారం సమగ్రమైన సూచనలను ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే పరిస్థితిని నివారించాలని ఆశిద్దాం.
కొవ్వూరి త్రినాథరెడ్డి
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్
Comments
Please login to add a commentAdd a comment