సందర్భం
రాష్ట్ర విభజన జరిగి జూన్ 2 నాటికి పదేళ్లు గడిచాయి. పాలకుల వైఫల్యం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య ఏర్పడిన అసమాన అభివృద్ధి విధానాలు విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దశాబ్దా్దలుగా జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల నెత్తుటి మరకలను పాలకులు తమ తిరోగమన విధానాలతో తుడిపేస్తున్నారు. ఈ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పోకడ భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టేలా వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తన పబ్బం గడుపుకోవడం మీదనే కేంద్రం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చివరికి ఎగ్గొట్టారు. తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తామని మొండిచేయి చూపించారు.
ఇక, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ప్రేక్షక పాత్ర వహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, నిర్వహించాల్సిన బాధ్యతలను నిర్వహించలేదు. పదేళ్ల పాటు చేతులు దులుపుకునే ప్రయత్నమే జరిగింది. కృష్ణా, గోదావరీ నదీజలాల వ్యవహారంలో ఎటూ తేల్చకపోగా, కేంద్రమే స్వయంగా గొడవలు పెడుతోంది.
విద్యుత్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల విభజన లాంటి ముఖ్యమైన అంశాలను కూడా తేల్చలేదు. ద్రవ్యలోటు పూడ్చే విధంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన కేంద్రం అసలు తాను ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోగా, సాగునీటి రంగానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉపయోగించుకోవడమే తప్ప ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు.
మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ నాటి టీఆర్‌ఎస్ (నేటి బీఆర్‌ఎస్) పార్టీ అధికారంలో వుండగా ప్రాతినిధ్యంలోకి రాలేదు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబ కృషిగానే మలిచే ప్రయత్నం చేశారు. దీని ఫలితమే టీఆర్‌ఎస్ గడిచిన 10 ఏళ్ల పాలన ఏకఛత్రాధిపత్యంగా సాగడానికి కారణమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, దోపిడి, పీడనకు వ్యతిరేకంగా జరిగింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనూ, ప్రశ్నించే గొంతులనూ అణచివేస్తూ కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు.
పార్లమెంటులో విభజన చట్టంపై చర్చ జరుతున్న సందర్భంలో ప్రతిపక్షం (బీజేపీ) నుండి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన హామీగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ప్రధాన బాధ్యతలు చేపట్టి తను డిమాండ్ చేసిన ప్రత్యేక హోదాలు ఈ 10 ఏండ్లలో పట్టించుకోకుండా గాలికొదిలేశారు.
రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ నీటి యుద్ధం కొనసాగుతూనే వుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి నీటిని క్రమబద్ధీ్దకరించటం, రివర్ బోర్డు ఏర్పాటు, ద్రవ్యలోటు పూడ్చడం, ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపడం, ఆంధ్రలో కలిపిన ఏడు తెలంగాణ గ్రామాల ఉమ్మడి సమస్యలు వంటివి పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీలో మిగిలివున్న 3 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన హామీలు అమలు జరుగలేదు. 9, 10 షెడ్యూల్‌లో వున్న 91 ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో 71 సంస్థలను విభజించినట్లు ప్రకటించి, నేటికీ ఉమ్మడిగానే కొసాగిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు పాలకుల విధానాల వల్ల ప్రాంతాలు, ప్రజల మధ్య ఏర్పడిన ఆర్థిక, సామాజిక అంతరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపకరించే భూమి, ఉపాధి, నీటి వనరులు, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలను పట్టించుకోలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో అభివృద్ధి భూమిక ఏర్పడలేదు. భూములు పంచుతామన్న పాలకులు ఉన్న భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు. వ్యవసాయానికి ప్రోత్సాహం లేక చిన్న, మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్ సంస్థల వద్ద అతితక్కువ వేతనాలకు వాచ్‌మెన్లుగా, గార్డెన్లలో పనిచేసే కూలీలుగా మారినారు.
తెలంగాణ ఏర్పడితే ఈ పరిస్థితులు వస్తాయని ప్రజలు భావించలేదు. ఉద్యోగాలు వస్తాయనీ, ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతాయనీ, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అయితే స్థానికంగా ఉపాధి పొందుతామనీ భావించారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి.
ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతూనే వున్నాయి. ఇది సామాజిక దోపిడి, వివక్షకు దారితీసింది. దీని ఫలితమే బీఆర్‌ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించి, ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించవలసిన అవసరం వున్నది. రాష్ట్రంలో, దేశంలో అస్తిత్వ రాజకీయాల ప్రభావం పెరుగుతున్నది. ప్రజల ప్రధాన సమస్యలైన భూమి, కూలి, ఉద్యోగ సమస్యలను తీర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ ప్రయోజనాల కొరకైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు తీసుకొని పరిపాలన సాగించాలి. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీపై వుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించినట్టు ఇప్పటి నుంచైనా అధికారంలోకి వచ్చే, వచ్చిన పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధి కనబరచాలి.
జూలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు
(నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment