విభజన తెరిచిన కొత్త తలుపులు | Sakshi Guest Column On AP Telangana State Division | Sakshi
Sakshi News home page

విభజన తెరిచిన కొత్త తలుపులు

Published Fri, Jun 14 2024 4:28 AM | Last Updated on Fri, Jun 14 2024 1:22 PM

Sakshi Guest Column On AP Telangana State Division

అభిప్రాయం

ప్రస్తుతం ఏపీలో నెలకొని ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల కోసం ముప్పై ఏళ్ల క్రితం 1994లో జరిగిన ఎన్నికల ముందు పంజాబ్‌కు చెందిన మాజీ రక్షణశాఖ అధికారీ, బహుజన సమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం ఏడాది పాటు ఇక్కడ ‘క్యాంప్‌’ చేసి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం అప్పట్లో ఆయన వెతుకులాడారు. 

అయితే ఆయన ఆశించిన సామాజిక సమీకరణాలు ఇక్కడ లేవని నిర్ధారించుకున్నాక ఆయన వెళ్ళిపోయారు. అప్పట్లో ఆయన ప్రయత్నం ఫలించి ఉత్తరప్రదేశ్‌లో 1995లో సమాజవాదీ పార్టీ మద్దతుతో బీఎస్పీ నుంచి మాయావతి తొలి ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యారు. అవే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించి ఎన్టీఆర్‌  గెలవడంతో 1995లో చంద్రబాబు ‘మార్క్‌’ టీడీపీ రాజకీయాలకు తెలుగునాట మార్గం సుగమం అయింది. 

అప్పటి నుంచి యూపీ – ఏపీ రాజకీయాలు రైలు పట్టాలు మాదిరిగా సమాంతరంగానే ఉంటూ ఎక్కడా సారూప్యత లేని రీతిలో ఉన్నాయి. ఉత్తర–దక్షిణ దిక్కుల్లో ఉన్న రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాల పైబడిన ఆర్థిక సంస్కరణల ప్రభావం దేశ సామాజిక రంగం మీద ఆ యా రాష్ట్రాలను బట్టి ఎక్కువ తక్కువగా కనిపించడం అయితే కాదనలేనిది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వెనుక ఉన్నది కూడా ఈ సంస్కరణల కాల ప్రభావమే. అలాగే సంస్కరణల్లోని ‘సరళీకరణ’ అంశం మనవద్ద సీబీఎన్‌ సరికొత్త–‘ద్రవ రాజకీయాలకు’ (‘లిక్విడ్‌ పాలిటిక్స్‌’) ప్రాతిపదిక అయింది. వాటి లక్షణం అది కనుక మారుతున్న కాలంతో పాటుగా దాన్ని ఆయన ‘అడాప్ట్‌’ చేసుకున్నారు. 

అయితే ‘సరళీకరణ’ను తమకు తగినట్టు ‘అడాప్ట్‌’ చేసుకోవడం అనేది, ఏ ఒక్కరి గుత్త సొత్తో కాదు కనుక, సంస్కరణలు మొదలైన పదేళ్ళకే 2000లో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, బిహార్‌ నుంచి జార్ఖండ్‌లు విడిపోయాయి. మరో పదేళ్లకు ఈ రాష్ట్రాల సరిహద్దున ఉన్న తెలంగాణ... ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది. దీనికి వ్యతిరేకంగా ఆధిపత్య వర్గాలు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎన్ని కారణాలు ఉన్నా అవి దాన్ని ఆపలేక పోయాయి. ఉపరితలాల్లో కనిపించకుండా భూగర్భ పొరలను కుదిపే తాత్విక అంశం–‘సరళీకరణ’ అనబడే ‘లిబరలైజేషన్‌’. ఈ ముప్పై ఏళ్లలో ఐదు కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, వాటిలో కొత్త పార్టీలు ఏర్పడి అవి అధికారాల్లోకి వచ్చాయి. అలా కొత్త సమాజాలకు అవకాశాలు వచ్చాయి. 

ఇటువంటి జాతీయ పరిణామం చూసినప్పుడు, ప్రాంతాల మధ్య విభజన తర్వాతే... ముప్పై ఏళ్ల క్రితం కాన్షీరాం ఆశించిన కులాలవారీగా విడిపోయిన రాజకీయ ఆంధ్రప్రదేశ్‌ ఇక్కడ ఏర్పడలేదు. ఇప్పటికీ కొందరు దీన్ని ‘నెగిటివ్‌’ దృష్టి నుంచి చూసినా, గడచిన పదేళ్ళలో అది ‘మర్యాద’ ముసుగును తొలగించుకుని మరీ ‘ఓపెన్‌’గా మన మధ్య స్థిరపడింది. 

కనుక ఇప్పుడు బిహార్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ‘కులం’ పోషించే సూక్ష్మస్థాయి పాత్రను ఏపీ విషయంలో మనం అన్వయించి చూడవచ్చు. ఇకముందు అదేమంత ‘బూతు’ అవదు. ఎంత త్వరగా మనం ఏమిటో మనం స్వీయప్రకటన చేసుకుంటే అంత మేర మనకు సమయం వృథా అవదు. అయితే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత, ఏపీలో నెలకొనివున్న సామాజిక రాజకీయ సమీకరణాలను చూసినప్పుడు ఇప్పటికే అవి కాన్షీరాం దృష్టి దాటి విస్తరించాయా అనేది ‘కేస్‌ స్టడీ’ అవుతుంది.  

అలా కావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది– గత ప్రభుత్వం కోనసీమ జిల్లాకు పేరు మార్చినప్పుడు మే 2022లో అమలాపురంలో జరిగిన ఆందోళన, విధ్వంసం, గృహదహనాలు విభజిత ఏపీ చరిత్రలో మొదటి సామాజిక హింసాత్మక సంఘటన. అన్ని రాజకీయ పార్టీలు సామాజికంగా అదొక సున్నితమైన తొలికూతగా గుర్తించాలి. రెండవది– కొంచెం లోతైన విస్తృతమైన చర్చ అవసరమైనది. కాపు కులం నుంచి ముఖ్యమంత్రి రావాలి, అంటూ తిరుపతి మాజీ కాంగ్రెస్‌ ఎంపీ చింతా మోహన్‌ కొంత కాలంగా కోరుతున్నారు. అలా కనుక జరిగితే, ఆ తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రి అవుతారు అనేది బహుశా ఆయన ఆశ కావొచ్చు. 

ఈ మొత్తాన్ని సమీక్షించడానికి 2024 ఏపీ ఎన్నికల పూర్వరంగం సరైన ‘ఎరీనా’ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎస్సీ ముఖ్యమంత్రిగా మాయావతి 2007–12 మధ్య చెప్పుకోదగిన పరిపాలనా సంస్కరణలు తెచ్చారు. అయితే, ఎస్సీ కాకపోయినా ఓసీ కులాల్లో పేదల నుంచి అన్ని కులాల్లోని పేదల వరకూ... అందరికీ 2019–24 మధ్య జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు  అందాయి. 

కేవలం ఆర్థిక పరమైన ఊరట మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న పరిపాలనా వైఖరి కారణంగా సూక్ష్మ స్థాయిలో ‘పవర్‌ పాలిటిక్స్‌’ స్థానంలోకి ‘ఫంక్షనల్‌ పాలిటిక్స్‌’ ప్రవేశించాయి. వీటిలో ‘డెలివరీ’ ప్రధానం తప్ప రాజకీయ పార్టీల పట్ల విశ్వాసాలతో పెద్దగా పని ఉండదు. శ్రేణులలో కూడా మొదలైన ఇటువంటి ‘లిక్విడ్‌ పాలిటిక్స్‌’ ధోరణి కారణంగా ఇకముందు ముఖ్యమంత్రి కులం ప్రజల సానుకూల తీర్పుకు ప్రాతిపదిక కాకపోవచ్చు.


జాన్‌సన్‌ చోరగుడి  
వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement