రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు ఈ ఐదేళ్ళలో ఆసక్తికరమైన పరిణామ క్రమం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సభల్లో ‘రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నది అందులో నేను అర్జునుణ్ణి’ అంటుంటారు. ఏదో ఒక ప్రతీకగా అన్నట్టుగా ఇది ఉన్నప్పటికీ, ఈ మాట వెనుక ఎంతో లోతైన విషయం ఉంది.
అందులో పైకి కనిపించని రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక శాస్త్రముంది. దాని లోతులు-లూయిస్ టెల్లిన్ రాసిన ఆక్సిఫర్డ్ యూనివర్సిటి ప్రెస్ ప్రచురణ ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ దెయిర్ పొలిటికల్ ఆరిజన్స్’ గ్రంధం చూసినప్పుడు, మనకు అర్ధం అవుతుంది. అందులో ముందుమాటలోనే ఆమె- ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీఉంది? ఏవి ఎవరి చేజారిపోతున్నాయి.. అనేది నిర్ధారిస్తుంది’ అంటారు.
ఇటువంటి ‘ఇరు వర్గాల మధ్య పరస్పరం పోటీ’ గురించే,కొంతకాలంగా సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన పరిపాలనలో సంక్షేమం అమలుకు ‘ఆన్ లైన్’ సాంకేతికతను, యుద్దభూమిలో ‘డాలు’ మాదిరిగా వాడుతూ విమర్శకుల దాడి తనను తాకకుండా చూసుకున్నారు. దాంతో ఒకప్పుడు ఆ ‘టెక్నాలజీ’ గురించే 24X7 మాట్లాడిన వారికి ఇప్పుడు దాన్ని తప్పుపట్టడానికి నోరు పెగలడం లేదు. ప్రతిపక్షవర్గాలకు ఇటువంటి నిస్సహాయతలో నుంచి వచ్చిందే ‘విధ్వంసం’ వంటి ఏకవాక్య వ్యాఖ్య. వాళ్ళు అ మాటకు వివరం ఏమిటో ఇంకా చెప్పలేదు.
అయితే, జగన్ దాన్ని-‘పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం’ అంటారు. రాజనీతి శాస్త్రంలో ఈ ‘పరస్పర పోటీ’సూత్రాన్ని ప్రతిపాదిస్తున్న ఈ రచయిత్రి ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజిలో ‘ఇండియా ఇనిస్టిట్యూట్’తో పాటుగా ‘కేంబ్రిడ్జి’ ‘లండన్ స్కూల్ ఆఫ్ఎకనామిక్స్’ వంటి ప్రపంచ ప్రసిద్ద యూనివర్సిటిల్లో బోధిస్తున్నారు. ఈమె గతంలో బీబీసీ సౌత్ ఆసియా అనలిస్ట్ గాపనిచేసారు. ఈమె ఈ రచన 2014లోమన రాష్ట్ర విభజన నాటికివెలువడింది. ఉత్తరాదిలో ‘ఇండియా రీమ్యాపింగ్’కు దారితీసిన పరిస్థితులే దక్షణాదిలో మన వద్ద కూడా స్థూలంగా అవే చారిత్రిక, రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక పరిస్థితులు కారణం కావడం ఈ రచనలో చూస్తాము.
ఇప్పుడు ఏమైంది 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో- ‘రీ మ్యాపింగ్ ఇండియా’వర్తమాన రాజకీయ నిర్ణయంగా ‘అకడమిక్’ చర్చగా మారి తెరమీదికి వచ్చింది. ఏమైంది, పదేళ్లకు ఇక్కడా అదే ‘సీన్ రిపీట్’ అయింది. అప్పుడు ఏమి జరగాలి? ‘రీ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్’ మొదలవ్వాలి. ఎందుకంటే, ‘సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలోవర్గాల మధ్య పోటీకి కారణం అవుతాయి’ అనేది సూత్రం అయినప్పుడు, నాయకుడు దాన్ని విధిగా ‘అడ్రెస్’ చేయాలి. అయితే నాయకుడు అక్కడ ఉత్పన్నం అయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలి, అందుకు అతడు ధైర్యస్తుడై ఉండాలి.
ఆ పనే జగన్ చేశాడు. ఆయన 13 జిల్లాలను 26 చేసి ఆ పని పూర్తిచేసాడు. రేపు చిన్నవో పెద్దవో సమస్యలు వస్తే వాటిని కూడా పరిష్కరిస్తాడు. ఒకప్పటి విజయనగరం జిల్లాలోని పార్వతీపురంను కొత్త జిల్లా చేయడానికి ఒడిస్సా సరిహద్దున ఉన్న 22 కొటియా గ్రామాల వివాదం ఒకటి చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాని పరిష్కారం కోసం నవంబర్ 2021లో మన ముఖ్యమంత్రి జగన్.. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి రెండు రాష్ట్రాల మధ్య ‘పెండింగ్’ ఉన్న సరిహద్దు గ్రామాలు, నదీజలాల అంశాలు గురించి మాట్లాడాక, ఏప్రిల్ 2022న కొత్త జిల్లాలను ప్రకటించారు. తన మొదటి ‘టర్మ్’లోనే ఇటువంటి ‘రీ మ్యాపింగ్’ కసరత్తు తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళబోతున్నది. ఔ
ఏప్రిల్ మూడో తేదీన ‘నవ్యాంధ్ర పదేళ్ళ ప్రస్థానం’ అంశంపై బీబీసీ తెలుగు విజయవాడలో చర్చావేదిక ఏర్పాటుచేసి, నన్ను కూడా పిలవడంతో వెళ్ళాను. అన్ని పార్టీల ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. సమన్వయకర్త చర్చ నాతోనే ప్రారంభిస్తూ ‘మీరీమధ్య తరుచూ ఇక్కడి అభివృద్దిపై వ్యాసాలు రాస్తున్నారు కదా, ‘డాట్స్’ ను కలిపి చూడాలి అంటారు. నవ్యాంధ్ర ఈ పదేళ్ళలో ఏమైనా ముందుకు వెళ్ళిందా? లేక వెనక్కి వెళ్ళిందా? మీరు ఏమనుకుంటున్నారు?’ అని అడిగారు.
నేను చెప్పాను.. ‘వైఎస్సార్ కాలంలో మన్మోహన్ సింగ్ ఏపీలో తరచూ ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ ‘ఏపీ మోడల్’ వంటి వ్యాఖ్యలు చేసేవారు. విభజన తర్వాత, అదే ఇక్కడ మరింత మెరుగైన రీతిలో కొనసాగుతూ, దాంతోపాటుగా-‘కోర్స్ కరక్షన్’ కూడా జరుగుతోందని చెప్పాను. ప్రస్థానం అనగానే అది ముందుకే వెళ్ళాలి అనుకుంటాం. అన్నిసార్లు అది అలాగే ఉండనక్కరలేదు. ఉన్నచోటే కొన్నాళ్ళు ఆగి, ప్రజల అవసరాలు చూస్తూ.. రేపు మనం వెళ్ళవలసిన మార్గాన్ని ముందుగా సరిచేసుకోవడం కూడా ఉంటుంది. అది ఆగిపోవడం కాదు, అది వెళ్ళాల్సిన మార్గంలో ఉన్న వ్యత్యాసాల ఎత్తుపల్లాలు సరిచేయడం అవుతుంది.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సరిహద్దులు (బోర్డర్స్) గురించిన స్పృహ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఉండడం అనేది, ఎవ్వరు పెద్దగా గుర్తించలేదు గానీ అది అసాధారణమైన అంశం. అది ఉన్నప్పుడే- ‘రీ మ్యాపింగ్’ సాధ్యం అవుతుంది. మన సమాజంలో ‘బోర్డర్స్’లో ఉండేది ఎవరు? ఒక ఊళ్ళో ఊరి చివర ఉండేది ఎవరు? ఇటువంటి చివరి సమాజాల కోసం, ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల కేంద్రాలను వీరి సమీపానికి చేర్చింది. కొందరు ఉంటారు, వారు ‘బోర్డర్స్’ను మరోలా చూస్తారు. వారు భద్రమైన నియోజకవర్గాల కోసం ‘బోర్డర్స్’కు వెళ్లి ఆ ప్రాంతం ఎదగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, దశాబ్దాలుగా ఆ ప్రజలమీద పడి బ్రతికేస్తుంటారు.
ఉత్తరాంధ్ర ప్రముఖ కధకుడు అట్టాడ అప్పల నాయుడు 2007లో ‘షా’ అనే కథ రాసారు. ఇరిగేషన్ కాంట్రాక్టులు చేయడానికి కోస్తా నుంచి శ్రీకాకుళం వచ్చిన చౌదరి స్థానిక సంస్థల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాడు. దాని గురించి ఒక రాత్రి మందు పార్టీ వద్ద కొందరు రాజకీయ స్పృహ ఉన్న స్థానికులు మాట్లాడుకోవడం ఈ కథ. అయితే, ఇప్పుడు అది కథ కాదు. సరిహద్దుల్లో పరిష్కారం మొదలయింది. అదే ఇప్పుడు కొందరికి విధ్వంసంగా కనిపిస్తున్నది.
రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత
జాన్ సన్ చోరగుడి
Comments
Please login to add a commentAdd a comment