Kovvuri Trinatha Reddy
-
విభజన హామీలు ఎప్పుడు నెరవేరేను?
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ 2014లో రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా, హడావిడిగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ఫలితాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రధాన లక్ష్యం రెండు రాష్ట్రాలు విడివిడిగా సర్వతోముఖాభివృద్ధి సాధించడం. మరి అది జరుగుతోందా?పునర్విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.విశాఖపట్టణం–చెన్నె పారిశ్రామిక కారిడార్, ప్రస్తుతం ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడే రాజధానికి మంచి రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను కల్పించడం వంటివి నెరవేర్చవలసి ఉంది. విశాఖపట్టణంలో క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.ఇది వరలో పునర్విభజన చట్టాలలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పన్నుల విషయంలో కొన్ని అసాధారణతలు చోటు చేసుకొన్నాయి. వాటిని సరిదిద్దడానికి చట్టంలో అవసరమైన సవరణలు చేయమని లేదా వాటివల్ల కలుగుతున్న నష్టం రూ. 3,820 కోట్లను మంజూరుచేయమని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది. పై విషయాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి, తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో పూర్తి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిలోని అనేక కార్పొరేషన్లు వాటి హక్కుల సాధన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంపై కోర్టులో అనేక వ్యాజ్యాలు (కేసులు) వేశాయి. ఆ కేసులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఒక్క తీర్పును కూడా అమలు పరచలేదు. తెలంగాణ రాష్ట్రం, శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాగునీరు, సాగునీటి అవసరాలకు నిర్లక్ష్యం చేస్తూ జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తోంది. ఈ పరిస్థితులలో గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ప్రకారం సమగ్రమైన సూచనలను ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే పరిస్థితిని నివారించాలని ఆశిద్దాం.కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్ -
కొత్త రూపంలో పాత ఎఫ్ఆర్డీఐ బిల్లు
కొన్నేళ్లక్రితం సహకార రంగ బ్యాంకులన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ)బిల్లు కొత్త రూపంలో మళ్లీ రాబోతోంది. ఈ నెల మొదట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాక విలేకరులతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎఫ్ఆర్డీఐ బిల్లులో మార్పులు చేర్పులు చేసి కొత్త రూపంలో దాన్ని తీసుకొస్తామని చెప్పారు. అయితే బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతామన్నది ఆమె చెప్పలేదు. 2017లో ఆ బిల్లును చట్టంగా మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందులో ఉన్న ‘బెయిల్ ఇన్’ అనే పదంపై అందరికీ తీవ్ర అభ్యంతరాలున్నాయి. బ్యాంకు దివాలా తీసే పరిస్థితుల్లో ఆ బ్యాంకులోవున్న డిపాజిట్లలో కొంత భాగంగానీ, మొత్తంగా గానీ డిపాజిట్‌దారునికి తదనంతర కాలంలో ఇవ్వొచ్చునని ఆ క్లాజు చెబుతోంది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులు, సాధారణ ప్రజలకు చెందిన 68 శాతం డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. నెలనెలా ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో వారు బతుకీడుస్తున్నారు. కనుకనే ఆ బిల్లుపై అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ సెక్యూరిటీ డెవలప్మెంట్ రిజల్యూషన్(ఎఫ్‌ఎస్‌డీఆర్) పేరిట కొత్త బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు స్వల్ప మార్పులు చేసి, బిల్లు పేరు మార్చి, ‘బెయిల్ ఇన్’ అనే పదం తొలగించి అంతకన్నా ప్రమాదకరమైన అంశాలతో దీన్ని రూపొందించారు. ఇది చట్టమైతే ఫైనాన్స్ సెక్యూరిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్ఎస్డీఏ) పేరిట ఒక నియంత్రణ సంస్థ ఏర్పాటవుతుంది. ఒక ఫైనాన్స్ సంస్థ నష్టాల బారిన పడితే ఆ సంస్థకున్న డిపాజిట్లను వినియోగించి ఆ నష్టాలను పూడ్చివేయడానికి లేదా అదే డిపాజిట్లతో కొత్త వ్యాపార సంస్థను నెలకొల్పడానికి ఆ నియంత్రణ సంస్థకు అధికారం వుంటుంది. డిపాజిట్ల నుంచి కొంత లేదా పూర్తి మొత్తం తీసుకుని ఎప్పుడైనా తిరిగిచ్చే వీలు వుంటుంది. ఈ బిల్లు చట్టమైతే స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వ్ బ్యాంక్ నిర్వీర్యమవుతుంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నియంత్రణ ఆర్బీఐ పరిధి నుంచి అథారిటీకి వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రస్తుతం బ్యాంకులకు రావాల్సిన రుణాల్లో కార్పొరేట్ సంస్థలు ఎగవేసినవే 86 శాతం వరకూ వున్నాయి. మిగిలిన 14 శాతం వ్యవసాయదారులు, చిన్న పరిశ్రమలవారు తీసుకున్నవే. ఇప్పటికైతే అన్ని బ్యాంకుల నిరర్థక ఆస్తులు(అంటే పారు బాకీలు) 9 శాతం( అంటే రూ. 8 లక్షల కోట్లు) అని చెబుతున్నారు. వచ్చే నెలకు ఈ మొత్తం పది లక్షల కోట్లు ఉండొచ్చునని నిపుణుల అంచనా. బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటివరకూ వున్న రూ. లక్ష గ్యారంటీని రూ. 5 లక్షలకు పెంచామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఇప్పుడు రూపొందిస్తున్న బిల్లులోని అంశాలు అందుకు అనుగుణంగా లేవు. డిపాజిట్‌దారునికి ఇందులో వున్న రక్షణ ఏమిటో అర్థంకాని పరిస్థితివుంది. ఈమధ్య టీఎంసీ బ్యాంకు, మరి కొన్ని ఫైనాన్స్ సంస్థలు దివాలా తీసి డిపాజిట్‌దారులకు శఠగోపం పెట్టిన నేపథ్యంలో అందరిలో ఆందోళన నెలకొంది. తాజా బిల్లులో అథారిటీకి విస్తృతమైన అధికారాలున్నాయి. ఈ బిల్లు చట్టమైతే బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీలు వుండవు. వాస్తవానికి అలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. నష్టజాతక బ్యాంకులకు రూ. 2 లక్షల 11 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇచ్చింది రూ. 95,000 కోట్లు మాత్రమే. చాలా బ్యాంకులు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. అప్పులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యలు అమలవుతుంటే ఎవరూ బాకీలు ఎగ్గొట్టడానికి సాహసించరు. కానీ మన దేశంలో ఆ పరిస్థితులున్నాయా? లేవు కాబట్టే పారు బాకీలు వసూలు కావడం అసాధ్యం. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారు రుణాలు తీసుకుని, చెల్లించే సమయం వచ్చేసరికి చడీచప్పుడూ లేకుండా విదేశాలకు పరారయ్యారు. గత రెండేళ్లలో కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బాకీలు భారీయెత్తున రద్దయ్యాయి. ఇలాంటి చర్యలు తీసుకోవాల్సివచ్చినప్పుడు ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకుండా వుండటానికే తాజా బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసీ వంటి సంస్థ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇక ఎఫ్ఆర్డీఐ బిల్లు ఏ రూపంలో వచ్చినా పరిస్థితి మరింత అధ్వానమవుతుంది. కనుక ఇలాంటి ఆలోచన మానుకోవడం ఉత్తమం. కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఉమ్మడి ఏపీ నీటి సంఘాల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి ఫోన్: 9440204323 -
వికేంద్రీకరణతోనే సమన్యాయం
రాజకీయాలలో రెండు రకాల నాయకులు ఉంటారు. వారిలో అభివృద్ధి కోసం రాజకీయాలు చేసే నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి. రాజకీయం కోసం రాజకీయం చేసేవాడు రెండవ కోవకు చెందినవాడు చంద్రబాబునాయుడు. ప్రపంచ రాజధాని నిర్మాణం కోసం అనిచెప్పి మూడు పంటలు పండే రైతుల భూములను పూలింగ్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బలవంతంగా లాక్కొని రైతుల నోట్లో మట్టికొట్టారు. గత ప్రభుత్వం ఎంతోమంది రైతులపై కేసులుపెట్టి, పంటలను కూడా బుల్డోజర్లతో తొక్కించింది. చంద్రబాబు తన అనుయాయులకు ముందే లీకులిచ్చి తుళ్ళూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను కొనిపించడమే కాకుండా, తన సంస్థలకు కూడా భూములు కొన్న సంగతి తెలిసిందే. రాజధాని బిల్డింగులన్నీ తాత్కాలికమే అని చెబుతూనే ఒక చదరపు అడుగుకు 10 వేలకు పైన ఖర్చు చూపించి, వేల కోట్ల ధనాన్ని దుర్విని యోగం చేశారు. రాజధానిని ప్రపంచ స్థాయి రాజ ధానిగా నిర్మించేస్తానని గ్రాఫిక్స్ చూపించి ఆంధ్రప్రజలను పూర్తిగా భ్రమింపచేశారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను కూడా తుంగలో తొక్కి సొంత లాభం కోసం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టారు. కొద్దిపాటి గాలికి, వర్షానికి కూడా సచివాలయంలో నీరు రావడం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయంతో యావదాంధ్రకు మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంవల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో త్వరితగతిన ఫలితాలను ఇస్తుంది. బోస్టన్ కన్సల్టెన్సీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ కావడం, గత ప్రభుత్వంలో రెండుసార్లు చంద్రబాబు ఈ కన్సల్టెన్సీ ద్వారా సేవలు తీసుకొని ఇప్పుడు ఆ కన్సల్టెన్సీని విమర్శించడం, అలాగే జి.యన్.రావు కమిటీని కూడా విమర్శించడం ఆయన కుటిలనీతిని బయటపెడుతుంది. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నట్టు చెప్పుకొనే సీపీఐ, బాబు ఎజెండానే పాటిస్తున్న జనసేన పార్టీ చెప్పే భాష్యాలు ఎవరికి అర్థం కావటం లేదు. ఒకవైపు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, కానీ రెండో వైపు రాజధాని అమరావతిలోనే ఉండి అక్కడే అభివృద్ధి జరగాలంటున్న చంద్రబాబుకి అండగా ఉండటంలో అర్థమేమిటో ఆ పార్టీలకే తెలియాలి. రైతుకు భూమికి ఉన్న అనుబంధం తెలియని మనిషి బాబు. ఆ అనుబంధం తెలిసిన మనిషి వైఎస్ జగన్. గత ప్రభుత్వం నిర్బంధంగా లాక్కున్న భూమిని ఇప్పుడు తిరిగి యిచ్చేస్తాననడంతో రైతులు చాలా ఆనందపడుతున్నారు. రాజధాని రైతులు భూమిని ఇచ్చి ప్రభుత్వానికి త్యాగం చేశారని చంద్రబాబు చెప్తున్నారు. అలాగే నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టినప్పుడు రైతుల త్యాగాలను బాబు మర్చిపోయారా? బాబు సతీ మణికి రాజధాని రైతులపై జాలి కలిగి బంగారు గాజులను ఇచ్చేశారు. మరి రాజధాని కోసం భూములను బలవంతంగా లాక్కున్నప్పుడు ఈ జాలి, దయ ఏమైందో వారికే తెలియాలి. వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిపుష్ఠి కోసం జి.ఎన్.రావు కమిటీని అపాయింట్ చేయడమే కాకుడా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్‌ని రాష్ట్ర అభివృద్ధి కోసం కన్సల్టెంట్‌గా నియమించడం ఆహ్వానించదగ్గ విషయం. ప్రస్తుతం ప్రపంచంలో 90కి పైగా దేశాలలోని ఆఫీసులతో 18,500 ఆర్థిక నిపుణులు గల ప్రపంచ స్థాయి సంస్థలలో ఒకటిగా ఉన్న బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీలో ఏఏ ప్రాంతాలలో ఏయే వనరులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ రకమైన అభివృద్ధి చేయాలో వివరణాత్మకంగా రిపోర్టు ఇచ్చింది. రాజధాని అమరావతిలో లక్షా పది వేల కోట్లు పెట్టే కన్నా అన్ని ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమనీ, అన్ని ప్రాంతాలలోనూ ఈ పెట్టుబడి పెట్టడంవల్ల సమన్యాయం జరుగుతుంది. అందుకనే అన్ని ప్రాంతాలవారు మూడు రాజధానులు ఉండటమే శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా బాబు సొంత ప్రయోజనాల కోసం రాజకీయం మానుకొని అభివృద్ధి కోసం రాజకీయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 94402 04323 -
పోలవరం ఒక త్రిశంకు స్వర్గం?
పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టు అన్నాడొకాయన. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని భ్రమింపచేస్తూ 48 గేట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టులో 1 గేటు పెట్టి ప్రాజెక్టు పూర్తి అయిపోయిందన్న భ్రమ కల్పించి బాహుబలి సినిమాను తలదన్నేలా గ్రాఫిక్స్‌ను చూపించి ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. కనీసం ఒక్క గేటు అమర్చటానికి 2 నెలలు పడుతుంది. మిగిలిన 47 గేట్లు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలుస్తుంది. పోలవరం అంచనాలను తనకు కావలసిన రీతిలో పెంచుకొని ప్రాజెక్టును 58 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి అయిపోయాయని ప్రకటనలు చేస్తున్నారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇక 40 శాతమే మిగిలింది. చంద్రబాబు వేసిన అంచనా ప్రకారం 58 వేల కోట్ల ప్రాజెక్టు 60 శాతం పూర్తి అయిందని చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం ఇంకా 23 వేల కోట్లు పని మాత్రమే మిగిలింది. నిజానికి 11,500 కోట్లు మాత్రం ఇప్పటివరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. దానిలో వై.ఎస్.ఆర్. హయాంలో దాదాపు 5,500 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 6 వేల కోట్లు కేంద్రం యిచ్చిన కేటాయింపు, ఈ తక్కువ మొత్తంతోనే 60 శాతం పని ఎలాపూర్తి చేస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 మే నెలలో నీరు ఇస్తాననడం ఎడారిలో ఎండమావి లెక్కే. కాపర్‌డ్యామ్ ఎత్తు 31 మీటర్లు అని ముందు అంచనా కాని ఇపుడు 41 మీటర్లు పెంచడం ప్రమాదకరం అని నిపుణులైన ఇంజనీర్లు చెబుతున్నారు. ఎందుకంటే కాపర్‌డ్యామ్ అనేది తాతాల్కిక అడ్డుకట్ట. కేవలం ఎర్త్ కమ్ రాక్పిల్ డ్యామ్ నిర్మించి స్పిల్‌వే ద్వారా నీటిని మళ్లించడానికి కాపర్డ్యామ్ను నిర్మిస్తారు. అలాగే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కి దిగువకూడా కాపర్‌డ్యామ్ కడతారు. 41 మీటర్లు ఎత్తు పెంచి దాని ద్వారా వచ్చే నీరు కాలువకు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి అయిందనే భ్రమ కల్పించడానికి చేస్తున్న ఎత్తుగడ ఇది. గోదావరిలో ఎక్కువ నీటి ప్రవాహం వస్తే కాపర్‌డ్యామ్ కొట్టుకొనిపోవడం ఖాయం. 31 మీటర్ల ఎత్తులో అయితే కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయినా ప్రమాదం తక్కువ. అది 41 మీటర్లు కడితే ప్రమాదం జరిగితే అది గోదావరి గట్టు కంటే 5 మీటర్ల ఎత్తుకు నీరు ప్రవహించి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వరదల ప్రమాదం ఏర్పతుంది. ఇవన్నీ ఆలోచిస్తే పోలవరం ఇప్పట్లో పూర్తి అవుతుందనేది భ్రమ. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎండాకాలంలో కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయింది. తక్కువ ఎత్తు కావటం వలన క్రింద ప్రాంతానికి పెద్దగా నష్టం జరగలేదు. కానీ 41 మీటర్ల ఎత్తు కట్టబోతున్న పోలవరం కాపర్‌డ్యామ్ వర్షాకాలంలోగాని కూలిపోతే ఉభయగోదావరి జిల్లాలు మునగడం ఖాయం. ప్రాజెక్టులో అవినీతికి అంతులేకుండా పోయిందని కాగ్ చెప్పినప్పటికీ కేంద్రం దానిపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం చూస్తే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల స్పందన చూసిన చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టి ఎలాగైనా గెలవాలని తాపత్రయంతో ఈ గ్రాఫిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఏదిఏమైనా పోలవరం బాబుకు ఒక పాడి ఆవులాగ ఉంది. పునరావాస ప్యాకేజీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేదు. ముంపు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల పరిహారం సైతం పచ్చచొక్కాలకు అందచేసిన మోసాలు, ఇలాంటి ఎన్నో రకాల మోసాలు చేస్తూ అధినాయకుడు నుంచి కింది నాయకుల వరకు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రాజెక్టులో జియోలాజికల్ సర్వే, సి.డబ్లు్య.సి ఇచ్చి మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న వైనం చూస్తే ప్రాజెక్టులను ఎటువైపునకు తీసుకొని వస్తారో అని భయాందోళనలతో ప్రజలు వున్నారు. 2018లో పోలవరం పూర్తి అవుతుందని రాసుకో జగన్ అని పిచ్చికూతలు కూసిన సాగునీటిశాఖ మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా 2019లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పడం చూస్తే వారి అవగాహన ఏ మేరకుందో తెలుస్తుంది. ప్రతిపనికి ఒక శంకుస్థాపన, ఒక గ్రాఫిక్‌తో ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలలో ప్రజలను డబ్బుతో కొనేయవచ్చుననే భ్రమలో ఉన్నాడు. పోలవరం నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రాజెక్టు అ«థారిటీ బీటలువారిన స్పిల్‌వేను చూపిం చినా, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఆధారాలతో చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. ఒక రోడ్డు వేసిన 21 రోజుల తరువాత, లోడ్ టెస్టింగ్ అనేది చెయ్యటం పరిపాటి, ఇంత పెద్ద ప్రాజెక్టుకి కాంక్రీటు వేసిన తరువాత కనీసం ప్రామాణిక పరీక్ష చెయ్యకపోవటం, మార్గదర్శకాలను పాటిం చకపోవటం ప్రాజెక్టుకే ప్రమాదంగా మారింది. ఇప్పటికైనా జిమ్మిక్కులు మాని, ప్రాజెక్టును నాణ్యతాప్రమాణాలతోను, సి.డబ్లు్య.సి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాలను అమలు చేస్తూ ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. -కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త రాష్ట్ర నీటి సంఘాల అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మొబైల్ : 94402 04323 -
జీరో బడ్జెట్ వ్యవసాయం జీరోనే
రైతుకి భూమికి ఉన్న అనుబంధం తెలిసినవారు వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ఆ అనుబంధం తెలియని వాడు చంద్రబాబునాయుడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితిలో తనకు వ్యవసాయంపై మాట్లాడటానికి ఆహ్వానం వచ్చిందని రకరకాల చిందులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి ప్రపంచ వేదికల మీద చెప్పిన అబద్ధాలు సామాన్య జనానికికూడా అర్థమవుతోంది. ఇప్పటికే 60 వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లో పాలేకర్ విధానంలో వ్యవసాయంలో ఉన్నారని చెప్పడం హాస్యాస్పదం. అయితే ఎక్కడ ఉన్నారో చూపిస్తే అది ఎంత వరకు నిజమో తెలుస్తుంది. ఆవు ఉన్న ప్రతీ రైతు సహజసేద్యం చేస్తున్నట్లు లెక్కలు చూపించి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2029కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పాలేకర్ సేద్యంలో తీసుకెళ్ళడానికి ప్రణాళిక. దానికి దాదాపు రూ. 16,000 కోట్లు అప్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇది రైతులకు మేలు చేసే కార్యక్రమం కాదు అన్నది నిస్సందేహం. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి వెళుతున్నానని, మోదీకన్నా నేనే గొప్పవాడినని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఆయనకు అలవాటే, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. దాని పక్క చాలా హాల్స్ ఉంటాయి. దానిలో ఎప్పుడూ ఏదో ఒక సెమినార్లు, మీటింగ్‌లు అనేక విషయాలపై జరుగుతుంటాయి. వీటికి ఎవరైనా తమ సొంత ఖర్చులపై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదేదో ఏపీ ముఖ్యమంత్రి ఒక్కడికే అవకాశం వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న రహస్యం రైతులు చేసే వ్యవసాయం పేరుతో అప్పు తెచ్చుకోవడం. ఐక్యరాజ్యసమితిలో సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ, పీఎన్బీ పరిబాస్, యూఎన్ ఎన్విరాన్ మెంటల్ ప్రోగ్రాం, ఎ వరల్డ్ ఆగ్రా పార్స్టీ సెంటర్ అన్నీ కలిపి పెట్టిన ఒక సెమినార్‌కు చంద్రబాబు హాజరై దానిలో వ్యవసాయం గురించి మాట్లాడటం జరిగింది. అసలు చంద్రబాబుకి వ్యవసాయం అంటే తెలుసా? ఎందుకంటే వ్యవసాయం దండగని చెప్పిన బాబు రైతులను తొలి నుంచీ దగాచేస్తూనే వచ్చారు. వ్యవసాయంలో ప్రకృతి, సేంద్రీయ, జీవరసాయన ఎరువుల వ్యవసాయం వంటి పద్ధతులు ఉన్నాయి. కొండకోనలో ఎవరు ఏమీ చేయకపోయినా ఏదో ఒక పండ్లు కానీ ఇతరత్రా పంటలు కానీ పండేది ప్రకృతి వ్యవసాయం. పశువుల ఎరువు, ఇతర వర్మికంపోస్టుల నుంచి తయారు చేసిన ఎరువులతో చేసేది సేంద్రీయ వ్యవసాయం. జీవరసాయన వ్యవసాయం అంటే మనకు దొరికే ఉమ్మెత్త, మారేడు బెల్లం, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు మొదలైన వాటి నుండి జీవామృతం తయారు చేసి వాటి ద్వారా వ్యవసాయం చేసే ఒక పద్ధతి. దేశంలో హరిత విప్లవం సాధించాలని, రసాయనాలతో అత్యంత దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా దేశానికి అన్నంపెట్టడం సాధ్యమయింది. రసాయన ఎరువు వేసి పండిన పంటల వలన జీవన విధానానికి ముప్పువాటిల్లుతున్న మాట నిజమే కానీ వాటిని బాగా తగ్గించి ప్రతి రైతుకీ అవగాహన కల్పించి, రైతులను ప్రోత్సహించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అలాగని ప్రకృతి, సేంద్రియ, జీవరసాయన వ్యవసాయాలు తప్పు అని చెప్పటం కాదు. చిన్న చిన్న క్షేత్రాలకే పరిమితమైతే వాటి దిగుబడులు కూడా తగ్గడం జరుగుతుంది. బాబు రాజదాని కోసం తీసుకున్న 36 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని చెప్పినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే బీడు బారిన ఆ భూములలో పిచ్చి మొక్కలు ఎలాగూ ఉంటాయి కనుక. అదే జీరో బడ్జెట్ వ్యవసాయమని చెప్పినా ఆశ్చర్యంలేదు. 2029కి 100% జీరో బడ్జెట్ ఫైనాన్స్ వ్యవసాయంలో రైతులందరినీ భాగస్వామ్యం చేస్తానని చెప్పటం ఏ మేరకు సాధ్యపడుతుంది? అలాగే రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లకు ఈ విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేస్తానని చెప్పిన మాటలు సత్య దూరం. అసలు అంత సాగు భూమి రాష్ట్రంలో ఉందా? చంద్రబాబుకి తెలియకా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇలాంటి చీప్ పబ్లిసిటీ వ్యవహారాలు మానుకొని రైతుల కష్టాలు తెలుసుకొని వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతులను ఆదుకోవాలి. జీరో బడ్జెట్ వ్యవసాయం చేయడం సాధ్యం కాదని దీని వల్ల దిగుబడులు సాధించలేమని ఇప్పటికైనా తెలుసుకొని, ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులు తీర్చడం రాష్ట్రానికి గుదిబండగా మారినందున, మళ్లీ కొత్త అప్పులు తేవడం మాని, రాష్ట్రంలో ఉన్న అవి నీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ప్రజలు కోరుచున్నారు. కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం మొబైల్ : 9440204323 -
పోలవరానికి ‘పట్టిసీమ’ గ్రహణం
సందర్భం బడ్జెట్‌కు ముందే యుటిలిటీ సర్టిఫికెట్‌ను పంపితే రూ. 1,000 కోట్లు కేటాయిస్తామని కేంద్రం చెప్పినా పంపక బాబు పోలవరానికి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ ఏ మేలూ చేయని పట్టిసీమతో పోలవరాన్ని అటకెక్కించాలని చూస్తున్నారు. తాడి చెట్టు ఎందుకు ఎక్కా వంటే దూడ మేత కోసమన్న ట్టుంది మన రాష్ట్ర సర్కారు తీరు. ‘సత్వర నీటి ప్రయోజన పథకం’ కింద కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన రూ. 850 కోట్లను మరే ప్రభుత్వ మైనా అయితే... పూర్తికానున్న ప్రాజెక్టులకు కేటాయించి వెం టనే రైతులకు సాగునీటిని అందించడానికి ప్రాధాన్యం ఇచ్చి ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటే వేరు. అందుకే హఠాత్తుగా తెరపైకి తెచ్చిన పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి ఏకంగా రూ.775 కోట్లను కేటాయిం చింది. ఉభయ గోదావరులు, కృష్ణా డెల్టా, రాయలసీమ రైతులకెవరికీ ఏ మేలూ చేయలేని పట్టిసీమను చేపట్టిం ది. పైగా అది సీమకు తక్షణమే నీరందించేందుకేనని, గోదావరి, కృష్ణాజిల్లాల రైతాంగం ప్రయోజనాల కోసమే నని నమ్మించాలని ప్రయత్నిస్తోంది! పట్టిసీమపై జారీ చేసిన జి.ఒ. ఆర్టీ. నం: 200ను పరిశీలిస్తే బాబు ప్రభుత్వ దగాకోరుతనం బట్టబయలవుతుంది. పట్టిసీమ వద్ద లిఫ్ట్‌ను 14 మీటర్ల ఎత్తున అమరుస్తున్నట్టు అది పేర్కొం ది. కాబట్టి గోదావరి వరద నీటిని మాత్రమే కృష్ణకు లిఫ్ట్ చేస్తామని ప్రభుత్వ వాదన. కానీ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీ 10.67 మీటర్లు, గరిష్ట వరద స్థాయి (ఎంఎఫ్ఎల్) 13.67 మీటర్లు. 40 కిలోమీటర్ల దూరం లోని పట్టిసీమ, ధవళేశ్వరం కంటే రెండు మీటర్ల ఎత్తులో ఉంది. అంటే పట్టిసీమ వద్ద 15.67 మీటర్ల ఎత్తున లిఫ్ట్‌ను అమరిస్తేనే వరద జలాలనే పంపు చేస్తారని నమ్మ డం సాధ్యం. కానీ పంపును 14 మీటర్ల ఎలివేషన్‌లో, ఫుట్‌వాల్వును కనీస నీటినిల్వ స్థాయి 12.5 మీటర్ల వద్ద అమరుస్తున్నారు. అంటే కనిష్ట నీటి స్థాయి నుంచి కూడా నీటిని లిఫ్ట్ చే సే ఉద్దేశం ఉన్నట్టే. గోదావరి జిల్లాల అవస రాలు తీరాకనే 14 మీటర్లపై నుంచే లిఫ్ట్ చేస్తామని ప్రభు త్వం అంటోంది. జీవోలో ఆ ప్రస్తావనే లేదు. ఎత్తిపోతల విషయంలో జీవోల్లోని పరిమితులు, నిషేధాలు అమలు కావు. తాటిపూడి, గూటాల, వేగేశ్వరపురం, పుష్కర, చాగల్నాడు తదితర లిఫ్ట్‌లు మొదటి పంట తర్వాత పని చేయకూడదని జీవోలో ఉంది. కానీ తాగునీటి, పారిశ్రా మిక అవసరాల కోసం అవి నిరంతరం పనిచేస్తూనే ఉం టాయి. వరద జలాలు లభించే కొద్ది రోజులే పట్టిసీమ లిఫ్ట్‌లు పనిచేస్తాయనే నోటి మాట నీటి మూట కాకుం డా ఉంటుందా? 3,20,000 ఎకరాల పోలవరం కుడికాలువ ఆయ కట్టులో పశ్చిమ గోదావరిలో 2,00,000 ఎకరాలు వివిధ ఎత్తిపోతల కింద సాగవుతున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మిగతా 1,20,000 ఎకరాల ఆయ కట్టుకు పాక్షికంగా నీరందిస్తామని జీవో నం: 1 చెబు తోంది. అంటే పంట కాలంలో సగానికా? ఆయకట్టులో సగానికా? చంద్రబాబే చెప్పాలి. కృష్ణానదిలోకి 80 టీఎంసీల నీటిని పంప్ చేస్తామంటున్నారు. ఉభయ గోదావరుల తాగునీటి, పారిశ్రామిక అవసరాలే 8 టీఎంసీలు. మరి ఒక్క కృష్ణా డెల్టాకే అంత నీరు దేనికి? బచావత్ అవార్డు ప్రకారం కుడి కాలువకు తాగునీటి కేటాయింపు లేదు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మెట్టప్రాంతాలకు మాత్రం ఎడమ కాలువకు 23.44 టీఎంసీలను కేటాయించింది. ప్రస్తుతం ఎడమ కాలువ ప్రాంత రైతులు తాగునీటి కోసం పోరాటానికి సిద్ధమ వుతున్నారు. అదే జరిగితే చంద్రబాబు ఎడమ కాలువపై మరో లిఫ్ట్ పెట్టేస్తానంటారు. ఆపై పోలవరం అవస రమే లేదని వాదించొచ్చు. పాత అంచనా ప్రకారం పోల వరం ప్రాజెక్టు వ్యయం రూ. 12,000 కోట్లు. ప్రస్తుత అంచనా రూ. 15,000 కోట్లకు పైనే. ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించింది రూ. 100 కోట్లు! ఈ కేటాయింపులతో అది ఎన్నటికి పూర్తికావాలి? ఇది కూడా బాబు ‘పుణ్య మే.’ ఏ ప్రాజెక్టుకైనా కేంద్ర బడ్జెట్‌కు ముందే యుటిలిటీ సర్టిఫికెట్‌ను (యూసీ) పంపాలి. యూసీ ఇస్తే పోలవరా నికి వెయ్యి కోట్లయినా కేటాయించడానికి సిద్ధమేనని కేంద్రం చెప్పినా బాబు ప్రభుత్వం యూసీని ఇవ్వక ఆ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడిచింది. అది చాలక, పోలవ రంపై కపట ప్రేమను ఒలకబోస్తూ ఉభయగోదావరి జిల్లాల ప్రజలను మోసగిస్తున్నారు. ప్రాజెక్టు నిధులను ఖర్చుపెట్టకుండా పనులను ఆపేసినందుకు పోలవరం అథారిటీ మొట్టికాయలు వేసినా దానికి పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పోలవరాన్ని అటకెక్కిం చేస్తాడని 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు అక్షర సత్యాలని బాబు పట్టిసీమ దొంగాట రుజువు చేసి చూపిస్తోంది. కృష్ణానది నుంచి సీమకు సాగునీటిని అందించడం తోపాటూ అనంతపూర్ దాహార్తిని తీర్చేస్తానంటూ బాబు చెబుతున్న మాటలను సీమవాసులెవరూ నమ్మ డం లేదు. సీమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, గాలేరునగరి, వెలుగొండ, తెలుగుగంగలకు బడ్జె ట్లో బాబు నామమాత్రంగా నిధులను కేటాయించారు. హంద్రీనీవా, గాలేరునగరి పూర్తికావడానికి రూ. 4,500 కోట్లు కావాలి. అది పూర్తికాకుండానే సీమకు తాగునీరు, సాగునీరు ఎలా అందిస్తారు? సమాధానం లేదు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన రాష్ట్ర రైతు సంఘాల సదస్సు... పట్టిసీమకు కేటాయించిన రూ. 1,300 కోట్లకు, మరో రూ. 1,200 కోట్లు కలిపి మొత్తం రూ. 2,500 కోట్లను రాయలసీమ ప్రాజెక్టులకు కేటా యించి తాగు, సాగు నీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాన్ని పెడచెవిన పెట్టి బాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. అది చాలక హంద్రీనీవా, తెలుగుగంగల కోసం ఎన్టీఆర్ కృష్ణా మిగు లు జలాలపై హక్కును వదులుకుంటామని ఆనాడే కేంద్ర జల సంఘానికి తెలిపారు. బాబు సహా తర్వాతి ప్రభుత్వాలూ దాన్నే కొనసాగిస్తూ వచ్చాయి. అంతా తెలిసి కూడా కృష్ణా మిగులు జలాలపై హక్కులను వైఎస్ఆర్ వదిలేసుకున్నారని ఎదురుదాడి చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభు త్వం కల్లబొల్లి కబుర్లు మాని, పట్టిసీమను రద్దు చేసి పోలవరం పరిపూర్తిపై దృష్టిని కేంద్రీకరిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందనడం నిస్సందేహం. (వ్యాసకర్త ‘రాష్ట్ర నీటి వినియోగదారుల సమాఖ్య’ ప్రధాన కార్యదర్శి) ఫోన్ నం: 9440204323