పిచ్చి కుదిరింది తలకు రోకలి చుట్టు అన్నాడొకాయన. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని భ్రమింపచేస్తూ 48 గేట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టులో 1 గేటు పెట్టి ప్రాజెక్టు పూర్తి అయిపోయిందన్న భ్రమ కల్పించి బాహుబలి సినిమాను తలదన్నేలా గ్రాఫిక్స్‌ను చూపించి ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. కనీసం ఒక్క గేటు అమర్చటానికి 2 నెలలు పడుతుంది. మిగిలిన 47 గేట్లు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలుస్తుంది. పోలవరం అంచనాలను తనకు కావలసిన రీతిలో పెంచుకొని ప్రాజెక్టును 58 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి అయిపోయాయని ప్రకటనలు చేస్తున్నారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇక 40 శాతమే మిగిలింది. చంద్రబాబు వేసిన అంచనా ప్రకారం 58 వేల కోట్ల ప్రాజెక్టు 60 శాతం పూర్తి అయిందని చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం ఇంకా 23 వేల కోట్లు పని మాత్రమే మిగిలింది. నిజానికి 11,500 కోట్లు మాత్రం ఇప్పటివరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. దానిలో వై.ఎస్.ఆర్. హయాంలో దాదాపు 5,500 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 6 వేల కోట్లు కేంద్రం యిచ్చిన కేటాయింపు, ఈ తక్కువ మొత్తంతోనే 60 శాతం పని ఎలాపూర్తి చేస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు.
పోలవరం ప్రాజెక్టు నుంచి 2019 మే నెలలో నీరు ఇస్తాననడం ఎడారిలో ఎండమావి లెక్కే. కాపర్‌డ్యామ్ ఎత్తు 31 మీటర్లు అని ముందు అంచనా కాని ఇపుడు 41 మీటర్లు పెంచడం ప్రమాదకరం అని నిపుణులైన ఇంజనీర్లు చెబుతున్నారు. ఎందుకంటే కాపర్‌డ్యామ్ అనేది తాతాల్కిక అడ్డుకట్ట. కేవలం ఎర్త్ కమ్ రాక్‌పిల్ డ్యామ్ నిర్మించి స్పిల్‌వే ద్వారా నీటిని మళ్లించడానికి కాపర్‌డ్యామ్‌ను నిర్మిస్తారు. అలాగే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కి దిగువకూడా కాపర్‌డ్యామ్ కడతారు. 41 మీటర్లు ఎత్తు పెంచి దాని ద్వారా వచ్చే నీరు కాలువకు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి అయిందనే భ్రమ కల్పించడానికి చేస్తున్న ఎత్తుగడ ఇది. గోదావరిలో ఎక్కువ నీటి ప్రవాహం వస్తే కాపర్‌డ్యామ్ కొట్టుకొనిపోవడం ఖాయం. 31 మీటర్ల ఎత్తులో అయితే కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయినా ప్రమాదం తక్కువ. అది 41 మీటర్లు కడితే ప్రమాదం జరిగితే అది గోదావరి గట్టు కంటే 5 మీటర్ల ఎత్తుకు నీరు ప్రవహించి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వరదల ప్రమాదం ఏర్పతుంది.
ఇవన్నీ ఆలోచిస్తే పోలవరం ఇప్పట్లో పూర్తి అవుతుందనేది భ్రమ. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎండాకాలంలో కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయింది. తక్కువ ఎత్తు కావటం వలన క్రింద ప్రాంతానికి పెద్దగా నష్టం జరగలేదు. కానీ 41 మీటర్ల ఎత్తు కట్టబోతున్న పోలవరం కాపర్‌డ్యామ్ వర్షాకాలంలోగాని కూలిపోతే ఉభయగోదావరి జిల్లాలు మునగడం ఖాయం. ప్రాజెక్టులో అవినీతికి అంతులేకుండా పోయిందని కాగ్ చెప్పినప్పటికీ కేంద్రం దానిపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం చూస్తే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడింది. జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల స్పందన చూసిన చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టి ఎలాగైనా గెలవాలని తాపత్రయంతో ఈ గ్రాఫిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఏదిఏమైనా పోలవరం బాబుకు ఒక పాడి ఆవులాగ ఉంది. పునరావాస ప్యాకేజీలో జరుగుతున్న అక్రమాలకు అంతులేదు. ముంపు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల పరిహారం సైతం పచ్చచొక్కాలకు అందచేసిన మోసాలు, ఇలాంటి ఎన్నో రకాల మోసాలు చేస్తూ అధినాయకుడు నుంచి కింది నాయకుల వరకు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రాజెక్టులో జియోలాజికల్ సర్వే, సి.డబ్లు్య.సి ఇచ్చి మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న వైనం చూస్తే ప్రాజెక్టులను ఎటువైపునకు తీసుకొని వస్తారో అని భయాందోళనలతో ప్రజలు వున్నారు.
2018లో పోలవరం పూర్తి అవుతుందని రాసుకో జగన్ అని పిచ్చికూతలు కూసిన సాగునీటిశాఖ మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా 2019లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పడం చూస్తే వారి అవగాహన ఏ మేరకుందో తెలుస్తుంది. ప్రతిపనికి ఒక శంకుస్థాపన, ఒక గ్రాఫిక్‌తో ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలలో ప్రజలను డబ్బుతో కొనేయవచ్చుననే భ్రమలో ఉన్నాడు. పోలవరం నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రాజెక్టు అ«థారిటీ బీటలువారిన స్పిల్‌వేను చూపిం చినా, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాగ్ ఆధారాలతో చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. ఒక రోడ్డు వేసిన 21 రోజుల తరువాత, లోడ్ టెస్టింగ్ అనేది చెయ్యటం పరిపాటి, ఇంత పెద్ద ప్రాజెక్టుకి కాంక్రీటు వేసిన తరువాత కనీసం ప్రామాణిక పరీక్ష చెయ్యకపోవటం, మార్గదర్శకాలను పాటిం చకపోవటం ప్రాజెక్టుకే ప్రమాదంగా మారింది.
ఇప్పటికైనా జిమ్మిక్కులు మాని, ప్రాజెక్టును నాణ్యతాప్రమాణాలతోను, సి.డబ్లు్య.సి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాలను అమలు చేస్తూ ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
-కొవ్వూరి త్రినాథరెడ్డి
వ్యాసకర్త రాష్ట్ర నీటి సంఘాల అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి,
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి
మొబైల్ : 94402 04323
పోలవరం ఒక త్రిశంకు స్వర్గం?
Published Sun, Feb 10 2019 1:27 AM | Last Updated on Sun, Feb 10 2019 1:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment