పోలవరం నిర్మాణంలో వాస్తవాలేంటి? | Dr Srinivasa Sharma Article on Real Facts of Polavaram Construction | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్మాణంలో వాస్తవాలేంటి?

Published Thu, Feb 24 2022 8:34 AM | Last Updated on Thu, Feb 24 2022 8:34 AM

Dr Srinivasa Sharma Article on Real Facts of Polavaram Construction - Sakshi

పోలవరం ప్రాజెక్టుకు 1981 మే 21న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి. అంజయ్య శంకుస్థాపన చేసిన నాటినుండి 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి భూమి పూజ చేసే వరకు పోల వరం ప్రాజెక్టును పట్టించుకున్న ప్రభు త్వమే లేదు. సుమారు పదహారున్నర సంవత్సరాల కాలం తెలుగుదేశం అప్పటికే అధికారంలో ఉంది. అయినా పోలవరం పేరెత్తిన పాపాన పోలేదు. అంతకుముందు ఈ తరహా ప్రాజెక్టుకు సర్వే చేయడానికి దశాబ్దాల కాలం పట్టేది. కానీ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను వివిధ భాగాలుగా విభజించి ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవడంతో పనులు శరవేగం అందుకున్నాయి. 

అయితే ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించాలంటే అనేక రకాల అనుమతులు అవసరం.  రాజశేఖరరెడ్డి హయాంలోనే దాదాపు అన్ని అనుమతులూ తెచ్చారు. 2005లో సైట్‌ క్లియరెన్సు అనుమతులను; రీలొకేషన్, రీహేబిలిటేషన్‌ అను మతులను 2007లో; వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ, ఫారెస్ట్‌ క్లియ రెన్సులను 2008లో, టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్‌ను 2009లో రాజశేఖర రెడ్డి తేగలిగారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణంలో సింహ భాగం పూర్తిచేయగలిగారు. అప్పట్లోనే పోలవరంను జాతీయ ప్రాజె క్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. అయితే వైఎస్సార్‌ దివంగతులు అయిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా ప్రాజెక్టు నత్తనడక నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం అయిన చంద్రబాబు చేపట్టిన అరకొర పనులు నష్టదాయకంగా తయారయ్యాయి.

చంద్రబాబు హయాంలో స్పిల్‌ వే నిర్మాణం పూర్తి కాకుండా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టడంవల్ల సమస్యలు తలెత్తాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నది ఎడమ వైపున మొదలుపెట్టి కుడి వైపున ఖాళీ వదిలి పెట్టడం, దిగువ కాఫర్‌ డ్యామ్‌ నది కుడివైపున మొదలుపెట్టి ఎడమవైపున ఖాళీ వదిలిపెట్టడం వల్ల నది వరద కాలంలో నీరు ‘ఎస్‌’(ట) ఆకారంలో ప్రవహిస్తూ వంపులు తిరుగుతూ దిగువకు వెళ్ళ వలసి రావడం వల్ల ఆ ప్రవాహంలో కాఫర్‌ డ్యామ్‌ల వెంబడి సుడులు ఏర్పడి అప్పటి వరకు పాక్షికంగా çపూర్తయిన కాఫర్‌ డ్యామ్‌లు అనేక చోట్ల దెబ్బతిన్నాయి. ప్రచార యావతో చంద్రబాబు ప్రభుత్వం ‘గిన్నిస్‌’ రికార్డుల కోసం నాణ్యతా ప్రమాణాలను పణంగా పెట్టి...  కేవలం 24 గంటల్లో సుమారు 33 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను స్పిల్‌ వే ఛానల్‌లో కుమ్మరించింది. అయినా పని పూర్తి చేయలేక పోయింది.  

ఈ నేపథ్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య మంత్రిగా అధికారంలోకి వచ్చారు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టును తాను త్వరితగతిన పూర్తి చేయాలనే తపనతో పోలవరం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన  చంద్రబాబు హయాంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి, రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతి ద్వారా టెండర్లు ఖరారు చేశారు. దీంతో సుమారు రూ. 800 కోట్లు పైగా నిధులు ఆదా అయ్యాయి. ఐతే దీనిపై ‘చంద్రబాబు టీమ్‌’ న్యాయస్థానాల్లో కేసులు వేయడంతో ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నిటినీ అధిగమిస్తూ ప్రాజెక్టును 2022 జులై కల్లా పూర్తి చేసి పొలాలకు నీరందించాలనే సంకల్పంతో జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది. 

ఇప్పటికే స్పిల్‌ వే పనులు పూర్తి చేయడం, 42  గేట్లను పూర్తిగా బిగించడం జరిగింది. మిగతా ఆరుగేట్లను కూడా ప్రస్తుతం బిగిస్తున్నారు. అప్రోచ్‌ పనులు, పైలెట్‌ ఛానల్స్‌ పనుల్లో సింహభాగం పూర్తి చేసి నది నీటిని స్పిల్‌ వే ద్వారా మళ్లించడం; ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయడం, గ్యాప్‌–3 కాంక్రీట్‌ డ్యామ్‌ను పూర్తి చేయడం జరిగింది. అంతేగాక జల విద్యుత్‌ కేంద్రం పనులు వేగిరపరచడంతో పాటు, ఎడమ వైపున గ్యాప్‌–1 డ్యామ్‌కు అడుగున ‘సాయిల్‌ డెన్సిఫికేషన్‌ పనులు వేగంగా చేస్తున్నారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

అయితే నదీ గర్భంలో సుమారు 310 అడుగుల లోతు వరకు చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నదని నిపుణులు గుర్తించారు. పరిస్థితిని క్షుణ్ణంగా బేరీజు వేసి, డీడీఆర్‌పీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తప్ప మెయిన్‌ డ్యామ్‌ (గ్యాప్‌–2) నిర్మాణం మొదలుపెట్టడానికి వీలు లేదు. అందు వల్ల పోలవరం ఈ ఏడాది అంటే 2022లో పూర్తి కావడం కష్ట సాధ్యంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న ఈ జాప్యానికి పూర్తిగా చంద్రబాబే కారణమని ప్రత్యేకించి చెప్ప వలసిన పనిలేదు కదా!


డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస వర్మ 
వ్యాసకర్త జర్నలిస్ట్‌ ‘ మొబైల్‌: 98486 9337

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement