బాబు తప్పులకు బాజాలెందుకు? | Eenadu False Propaganda to cover up Chandrababu mistakes | Sakshi
Sakshi News home page

బాబు తప్పులకు బాజాలెందుకు?

Published Sat, Aug 20 2022 4:37 AM | Last Updated on Sat, Aug 20 2022 7:38 AM

Eenadu False Propaganda to cover up Chandrababu mistakes - Sakshi

వాస్తవాలను వక్రీకరించడంలో తనకు సాటి మరెవరూ రారని ‘ఈనాడు’ రామోజీరావు మరో సారి నిరూపించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలను కప్పిపెట్టడానికి ప్రతిరోజూ పనిగట్టుకుని మరీ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కథనాలు అచ్చేస్తున్న ‘ఈనాడు’... శుక్రవారం మరీ చిత్రమైన కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు చేసింది తప్పా? కాదా? అన్న దానికి సమాధానం చెప్పకుండా.. ప్రభుత్వం ఆది నుంచి తెగేసిచెబుతూ వస్తున్న మాటలను సైతం వక్రీకరించే దుస్సాహసానికి ఒడిగట్టడం ఆ పత్రిక దిగజారుడుతనానికి పరాకాష్ట. పోలవరంపై ఆది నుంచీ చంద్రబాబు వైఫల్యాలను బయటపెడుతూ వస్తున్న రాష్ట్రం... తాము అధికారంలోకి వచ్చిన 15 రోజులకే వరదలొచ్చాయని, దాంతో పనులు చేపట్టడం కుదరలేదని పదేపదే చెబుతోంది.

అంతకు ముందు మూడున్నరేళ్లుగా ఒక్క బస్తా సిమెంటు వేసే పనిని కూడా చంద్రబాబు సర్కారు చేపట్టకపోవటాన్ని ఎండగడుతోంది కూడా. ఇవేవీ ప్రస్తావించని ‘ఈనాడు’... మొన్నటిదాకా చంద్రబాబుపై... ఇపుడు కేంద్ర సంస్థలపై నెపం నెట్టుకొస్తూ పోలవరాన్ని కావాలనే జాప్యం చేస్తున్నట్లుగా వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ‘పోలవరం వైఫల్యంపై పిల్లి మొగ్గలు’ అనే శీర్షికతో తన వంకర పాత్రికేయాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఒక్కటి చెప్పండి రామోజీరావు గారూ? చంద్రబాబు వైఫల్యం వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. దానికి సమాధానం చెప్పండి? బాబు పనులు చేసింది కమీషన్ల కోసం కాదా? కమీషన్లు వచ్చే పనులను ముందుగా చేపట్టడం అబద్ధమా? ఇవేవీ చెప్పకుండా కేంద్రంపై నెపం పెట్టేస్తున్నారంటూ శివాలెత్తడం దేనికి? బాబును వెనకేసుకు రావటం దేనికి? అసలు ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? 

రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోన్న నిజాలను వక్రీకరిస్తూ.. పోలవరంపై రామోజీ పదేపదే విషపూరిత కథనాలను వండి వార్చటానికి అసలు కారణం... తన కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థను కాంట్రాక్టు ఒప్పందం నుంచి తప్పించడమే తప్ప మరొకటి కాదన్నది కాదనలేని వాస్తవం. పైపెచ్చు చంద్రబాబుతో కలిసి సాగిస్తున్న దోచుకో.. పంచుకో.. తినుకో(డీపీటీ) విధానానికి విఘాతం కలిగింది కూడా!. చంద్రబాబు పాల్పడిన తప్పిదాలను కేంద్ర సంస్థలు సూచించిన మార్గదర్శకాల మేరకు సరిదిద్దుతూ.. ప్రణాళికాయుతంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారన్నది కాదనలేని నిజం కాదా రామోజీరావు గారూ? కరోనా కష్టకాలంలో కూడా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, ఫైలట్‌ ఛానల్‌లను రికార్డు సమయంలో పూర్తి చేయడం అబద్ధమా? 35 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 4,886 కుటుంబాలకు పునరావాసం కల్పించి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి.. గతేడాది జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించడం నిజం కాదా? 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని మిగతా 12,138 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ.. కేంద్ర సంస్థలు సూచించిన మేరకు ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలు, దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేపట్టి.. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నించటం మీకెన్నడూ కనిపించదా?  

చంద్రబాబుది తప్పా? కాదా?
ఇక్కడ రామోజీ చెప్పాల్సింది ఒకటే!. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కట్టకుండా..  ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించకుండా.. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించేశారు. ఎందుకంటే దాన్లో అయితేనే ఎక్కువ కమీషన్లు వస్తాయి కాబట్టి. అందుకే పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం మాదిరిగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇలా చేయటం వల్లే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయని, డయఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల బృందం సహా ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టంచేశారు. ఇలా చేయటం వల్లే డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ బీఎస్‌ఎన్‌ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం పలు సందర్భాల్లో అధికారికంగానే ఈ విషయాన్ని బయటపెట్టింది. విచిత్రమేంటంటే ‘ఈనాడు’ ఎప్పుడు పోలవరంపై ఎలాంటి రాతలు రాసినా... చంద్రబాబు తప్పు చేశారని గానీ... అలా కాదు చంద్రబాబు చేసిందంతా కరెక్టేనని గానీ ఎన్నడూ చెప్పదు. అదంతా వదిలేసి చంద్రబాబును విమర్శించటం తప్పనే విచిత్రమైన వాదన చేస్తుండటమే దారుణాతిదారుణం.  

ఐదేళ్లలో చేయలేనిది..15 రోజుల్లో సాధ్యమా? 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019, మే 30న అధికారాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్‌ 15న గోదావరికి వరద ప్రవాహం ప్రారంభమైంది. 2014, జూన్‌ 8 నుంచి 2019, మే 29 వరకూ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేని ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు, 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 17,024 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా? రాజధాని అమరావతిని నిర్మించేసినట్లు గ్రాఫిక్స్‌లో చూపిన చంద్రబాబుకు.. గోబెల్స్‌ తలదన్నేలా అబద్ధపు రాతలు అచ్చేసే ‘ఈనాడు’ రామోజీకి మాత్రమే అది సాధ్యమవుతుందేమో? 

పోలవరంలో విధ్వంసం సృష్టించింది చంద్రబాబే..
కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పాల్పడిన ఇంజనీరింగ్‌ తప్పిదాల వల్ల 2019, ఆగస్టులో గోదావరికి వచ్చిన వరదలకు 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన ప్రవాహం ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీ ప్రదేశం 750 మీటర్లకే కుచించుకుపోయి ప్రవహించింది. అందుకే వరద ఉద్ధృతి అధికమై ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీగా వదిలేసిన ప్రాంతంలోనూ పెద్ద అగాధం ఏర్పడింది. ఇది చంద్రబాబు ఘోర వైఫల్యం కాదా? పోలవరం పనులు ఆలస్యమవుతుండటానికి ప్రధాన కారణం చంద్రబాబు చేసిన తప్పిదాలు కాదా? చంద్రబాబు సృష్టించిన విధ్వంసాన్నే ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల బృందం ఎత్తిచూపింది. దీనిపై నోరుమెదపరెందుకు రామోజీ?

వరదల్లో పనులు చేయడం మీకే సాధ్యమేమో!! 
దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల వరకూ కోతకు గురైన ప్రదేశాన్ని జెట్‌ గ్రౌటింగ్‌ చేస్తూ.. జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధం ఏర్పడిన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుతో జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఏప్రిల్‌ ఆఖరులో పీపీఏ, డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు సూచించాయి. జియో మెంబ్రేన్‌ బ్యాగ్స్‌ వినియోగం చాలా తక్కువ. దాంతో వాటి లభ్యత కూడా అంతంత మాత్రమే. అయినా సరే గుజరాత్, అస్సోంలలో వాటిని ఉత్పత్తి చేసే సంస్థలకు ఆర్డర్‌ ఇచ్చి.. 2.50 లక్షల జియో మెంబ్రేన్‌ బ్యాగ్స్‌ను సేకరించారు.  జెట్‌  గ్రౌటింగ్‌ విఫలమవుతుండటంతో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు కష్టమైన పాలీయురిథేన్‌ (పీయూ) గ్రౌటింగ్‌ చేస్తూ.. జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. గోదావరికి అనుకోకుండా ఈ సారి వరదలు ముందే వచ్చాయి. దీంతో జూలై 10న అర్ధరాత్రి స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదలైన వరద దిగువ కాఫర్‌ డ్యామ్‌ మీదుగా ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలోకి చేరి నిర్మాణ పనులను ముందుకెళ్లకుండా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 31 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయడం ఎలా సాధ్యం రామోజీరావు గారూ? వరదల్లోనూ పనులు చేస్తూ.. పూర్తి చేసినట్లు గ్రాఫిక్స్‌ను సృష్టించి.. అదే నిజమని నమ్మబలికే చంద్రబాబే మీకు సరైన జోడీ. 

వరదల్లో పరీక్షలు చేయడం ఎలా 
ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి 9 రకాల పరీక్షలు చేసి.. జూలై 15 నాటికి ఇస్తే.. వాటిని అధ్యయనం చేసి.. ఆ గోతులు పూడ్చే విధానాన్ని ఖరారు చేస్తామని.. వరదలు తగ్గాక ఆ పనులు చేపట్టవచ్చునని రాష్ట్ర జలవనరుల శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు  వెదిరె శ్రీరాం మే 17న నిర్వహించిన సమావేశంలో సూచించారు. ఆ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలోనే జూలై 10న అర్ధరాత్రి గోదావరి వరద ప్రవాహం ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తింది. పరీక్షలకు ఆటంకం కలిగింది. వరదల్లో పరీక్షలు చేయడం అసాధ్యమని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. అవి కూడా రామోజీకే సాధ్యమని చెప్పాలి మరి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement