కొత్త రూపంలో పాత ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు  | Kovvuri Trinatha Reddy Article On FRDI Bill | Sakshi
Sakshi News home page

కొత్త రూపంలో పాత ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు 

Published Wed, Feb 19 2020 1:46 AM | Last Updated on Wed, Feb 19 2020 1:46 AM

Kovvuri Trinatha Reddy Article On FRDI Bill - Sakshi

కొన్నేళ్లక్రితం సహకార రంగ బ్యాంకులన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ)బిల్లు కొత్త రూపంలో మళ్లీ రాబోతోంది. ఈ నెల మొదట్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాక విలేకరులతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో మార్పులు చేర్పులు చేసి కొత్త రూపంలో దాన్ని తీసుకొస్తామని చెప్పారు. అయితే బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతామన్నది ఆమె చెప్పలేదు. 2017లో ఆ బిల్లును చట్టంగా మార్చాలని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందులో ఉన్న ‘బెయిల్‌ ఇన్‌’ అనే పదంపై అందరికీ తీవ్ర అభ్యంతరాలున్నాయి. బ్యాంకు దివాలా తీసే పరిస్థితుల్లో ఆ బ్యాంకులోవున్న డిపాజిట్లలో కొంత భాగంగానీ, మొత్తంగా గానీ డిపాజిట్‌దారునికి తదనంతర కాలంలో ఇవ్వొచ్చునని ఆ క్లాజు చెబుతోంది.

ప్రస్తుతం రిటైర్డ్‌ ఉద్యోగులు, సాధారణ ప్రజలకు చెందిన 68 శాతం డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. నెలనెలా ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో వారు బతుకీడుస్తున్నారు. కనుకనే ఆ బిల్లుపై అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ రిజల్యూషన్‌(ఎఫ్‌ఎస్‌డీఆర్‌) పేరిట కొత్త బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు స్వల్ప మార్పులు చేసి, బిల్లు పేరు మార్చి, ‘బెయిల్‌ ఇన్‌’ అనే పదం తొలగించి అంతకన్నా ప్రమాదకరమైన అంశాలతో దీన్ని రూపొందించారు. ఇది చట్టమైతే ఫైనాన్స్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌ఎస్‌డీఏ) పేరిట ఒక నియంత్రణ సంస్థ ఏర్పాటవుతుంది. ఒక ఫైనాన్స్‌ సంస్థ నష్టాల బారిన పడితే ఆ సంస్థకున్న డిపాజిట్లను వినియోగించి ఆ నష్టాలను పూడ్చివేయడానికి లేదా అదే డిపాజిట్లతో కొత్త వ్యాపార సంస్థను నెలకొల్పడానికి ఆ నియంత్రణ సంస్థకు అధికారం వుంటుంది. డిపాజిట్ల నుంచి కొంత లేదా పూర్తి మొత్తం తీసుకుని ఎప్పుడైనా తిరిగిచ్చే వీలు వుంటుంది. ఈ బిల్లు చట్టమైతే స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్వీర్యమవుతుంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థల నియంత్రణ ఆర్‌బీఐ పరిధి నుంచి అథారిటీకి వెళ్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైనది.  

ప్రస్తుతం బ్యాంకులకు రావాల్సిన రుణాల్లో కార్పొరేట్‌ సంస్థలు ఎగవేసినవే 86 శాతం వరకూ వున్నాయి. మిగిలిన 14 శాతం వ్యవసాయదారులు, చిన్న పరిశ్రమలవారు తీసుకున్నవే. ఇప్పటికైతే అన్ని బ్యాంకుల నిరర్థక ఆస్తులు(అంటే పారు బాకీలు) 9 శాతం( అంటే రూ. 8 లక్షల కోట్లు) అని చెబుతున్నారు. వచ్చే నెలకు ఈ మొత్తం పది లక్షల కోట్లు ఉండొచ్చునని నిపుణుల అంచనా. బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటివరకూ వున్న రూ. లక్ష గ్యారంటీని రూ. 5 లక్షలకు పెంచామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఇప్పుడు రూపొందిస్తున్న బిల్లులోని అంశాలు అందుకు అనుగుణంగా లేవు. డిపాజిట్‌దారునికి ఇందులో వున్న రక్షణ ఏమిటో అర్థంకాని పరిస్థితివుంది. ఈమధ్య టీఎంసీ బ్యాంకు, మరి కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు దివాలా తీసి డిపాజిట్‌దారులకు శఠగోపం పెట్టిన నేపథ్యంలో అందరిలో ఆందోళన నెలకొంది. 

తాజా బిల్లులో అథారిటీకి విస్తృతమైన అధికారాలున్నాయి. ఈ బిల్లు చట్టమైతే బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీలు వుండవు. వాస్తవానికి అలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఈమధ్య బాగా తగ్గిపోయాయి. నష్టజాతక బ్యాంకులకు రూ. 2 లక్షల 11 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇచ్చింది రూ. 95,000 కోట్లు మాత్రమే. చాలా బ్యాంకులు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. అప్పులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యలు అమలవుతుంటే ఎవరూ బాకీలు ఎగ్గొట్టడానికి సాహసించరు. కానీ మన దేశంలో ఆ పరిస్థితులున్నాయా? లేవు కాబట్టే పారు బాకీలు వసూలు కావడం అసాధ్యం. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటివారు రుణాలు తీసుకుని, చెల్లించే సమయం వచ్చేసరికి చడీచప్పుడూ లేకుండా విదేశాలకు పరారయ్యారు. గత రెండేళ్లలో కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన బాకీలు భారీయెత్తున రద్దయ్యాయి. ఇలాంటి చర్యలు తీసుకోవాల్సివచ్చినప్పుడు ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకుండా వుండటానికే తాజా బిల్లుకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే లాభాలు ఆర్జిస్తున్న ఎల్‌ఐసీ వంటి సంస్థ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇక ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఏ రూపంలో వచ్చినా పరిస్థితి మరింత అధ్వానమవుతుంది. కనుక ఇలాంటి ఆలోచన మానుకోవడం ఉత్తమం.


కొవ్వూరి త్రినాథరెడ్డి 
వ్యాసకర్త ఉమ్మడి ఏపీ నీటి సంఘాల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి 
ఫోన్‌: 9440204323
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement