రాజకీయాలలో రెండు రకాల నాయకులు ఉంటారు. వారిలో అభివృద్ధి కోసం రాజకీయాలు చేసే నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి. రాజకీయం కోసం రాజకీయం చేసేవాడు రెండవ కోవకు చెందినవాడు చంద్రబాబునాయుడు. ప్రపంచ రాజధాని నిర్మాణం కోసం అనిచెప్పి మూడు పంటలు పండే రైతుల భూములను పూలింగ్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బలవంతంగా లాక్కొని రైతుల నోట్లో మట్టికొట్టారు. గత ప్రభుత్వం ఎంతోమంది రైతులపై కేసులుపెట్టి, పంటలను కూడా బుల్‌డోజర్లతో తొక్కించింది. చంద్రబాబు తన అనుయాయులకు ముందే లీకులిచ్చి తుళ్ళూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను కొనిపించడమే కాకుండా, తన సంస్థలకు కూడా భూములు కొన్న సంగతి తెలిసిందే. రాజధాని బిల్డింగులన్నీ తాత్కాలికమే అని చెబుతూనే ఒక చదరపు అడుగుకు 10 వేలకు పైన ఖర్చు చూపించి, వేల కోట్ల ధనాన్ని దుర్విని యోగం చేశారు. రాజధానిని ప్రపంచ స్థాయి రాజ ధానిగా నిర్మించేస్తానని గ్రాఫిక్స్ చూపించి ఆంధ్రప్రజలను పూర్తిగా భ్రమింపచేశారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను కూడా తుంగలో తొక్కి సొంత లాభం కోసం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టారు. కొద్దిపాటి గాలికి, వర్షానికి కూడా సచివాలయంలో నీరు రావడం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఏర్పడుతోంది.
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయంతో యావదాంధ్రకు మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంవల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో త్వరితగతిన ఫలితాలను ఇస్తుంది. బోస్టన్ కన్సల్టెన్సీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థ కావడం, గత ప్రభుత్వంలో రెండుసార్లు చంద్రబాబు ఈ కన్సల్టెన్సీ ద్వారా సేవలు తీసుకొని ఇప్పుడు ఆ కన్సల్టెన్సీని విమర్శించడం, అలాగే జి.యన్.రావు కమిటీని కూడా విమర్శించడం ఆయన కుటిలనీతిని బయటపెడుతుంది. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నట్టు చెప్పుకొనే సీపీఐ, బాబు ఎజెండానే పాటిస్తున్న జనసేన పార్టీ చెప్పే భాష్యాలు ఎవరికి అర్థం కావటం లేదు. ఒకవైపు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, కానీ రెండో వైపు రాజధాని అమరావతిలోనే ఉండి అక్కడే అభివృద్ధి జరగాలంటున్న చంద్రబాబుకి అండగా ఉండటంలో అర్థమేమిటో ఆ పార్టీలకే తెలియాలి. రైతుకు భూమికి ఉన్న అనుబంధం తెలియని మనిషి బాబు. ఆ అనుబంధం తెలిసిన మనిషి వైఎస్ జగన్. గత ప్రభుత్వం నిర్బంధంగా లాక్కున్న భూమిని ఇప్పుడు తిరిగి యిచ్చేస్తాననడంతో రైతులు చాలా ఆనందపడుతున్నారు. రాజధాని రైతులు భూమిని ఇచ్చి ప్రభుత్వానికి త్యాగం చేశారని చంద్రబాబు చెప్తున్నారు. అలాగే నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టినప్పుడు రైతుల త్యాగాలను బాబు మర్చిపోయారా? బాబు సతీ మణికి రాజధాని రైతులపై జాలి కలిగి బంగారు గాజులను ఇచ్చేశారు. మరి రాజధాని కోసం భూములను బలవంతంగా లాక్కున్నప్పుడు ఈ జాలి, దయ ఏమైందో వారికే తెలియాలి.
వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిపుష్ఠి కోసం జి.ఎన్.రావు కమిటీని అపాయింట్ చేయడమే కాకుడా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్‌ని రాష్ట్ర అభివృద్ధి కోసం కన్సల్టెంట్‌గా నియమించడం ఆహ్వానించదగ్గ విషయం. ప్రస్తుతం ప్రపంచంలో 90కి పైగా దేశాలలోని ఆఫీసులతో 18,500 ఆర్థిక నిపుణులు గల ప్రపంచ స్థాయి సంస్థలలో ఒకటిగా ఉన్న బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీలో ఏఏ ప్రాంతాలలో ఏయే వనరులు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ రకమైన అభివృద్ధి చేయాలో వివరణాత్మకంగా రిపోర్టు ఇచ్చింది. రాజధాని అమరావతిలో లక్షా పది వేల కోట్లు పెట్టే కన్నా అన్ని ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమనీ, అన్ని ప్రాంతాలలోనూ ఈ పెట్టుబడి పెట్టడంవల్ల సమన్యాయం జరుగుతుంది. అందుకనే అన్ని ప్రాంతాలవారు మూడు రాజధానులు ఉండటమే శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా బాబు సొంత ప్రయోజనాల కోసం రాజకీయం మానుకొని అభివృద్ధి కోసం రాజకీయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
కొవ్వూరి త్రినాథరెడ్డి
వ్యాసకర్త కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి,
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
మొబైల్ : 94402 04323
Comments
Please login to add a commentAdd a comment