Eenadu Ramoji Rao Fake News On Visakhapatnam Land Scam - Sakshi
Sakshi News home page

రామోజీ టక్కు టమారం.. అసలు విశాఖలో భూ కబ్జాలు చేసిందెవరు? ఏది నిజం?

Published Fri, Oct 28 2022 5:50 AM | Last Updated on Fri, Oct 28 2022 3:09 PM

Eenadu Ramojirao Fake News On Visakhapatnam Land Scam - Sakshi

రామోజీరావుకు విశాఖపట్నమంటే ప్రేమో, ద్వేషమో, మరేదో తెలియని భావసంభోగం ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడే ఆయన 47 ఏళ్ల కిందట అక్షర ఫ్యాక్షనిజానికి అంకురార్పణ చేశారు. లీజు పేరిట స్థలాలు తీసుకుని న్యాయ పోరాటాలతో కాజేయటమనే టక్కు టమారానికీ ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఇతరుల స్థలాలను కబ్జా చేయటానికి ఎన్ని 420 పనులైనా చేయొచ్చునని... ఎన్ని ఫోర్జరీలైనా చేయొచ్చునని ఇక్కడి నుంచే నిరూపించబోయారు. అందుకే ఆయనది విశాఖతో విడదీయలేని బంధం.  

కాకుంటే న్యాయం గెలుపు ఆలస్యం కావచ్చేమో గానీ... గెలవటం మాత్రం పక్కా అనేది రామోజీ సైతం నమ్మక తప్పలేదు. లీజు పోరాటం ఒక్కో న్యాయస్థానాన్నీ దాటుకుంటూ సుప్రీంకోర్టుకు కూడా చేరాక తల వంచారు. లీజు ముగిసిన ఏడేళ్ల తరవాత స్థలాన్ని అప్పగించాల్సి వచ్చింది కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... కొద్దిరోజులుగా ఆయన విశాఖపై ప్రేమ ముసుగులో విద్వేషం కక్కుతున్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మటానికి ప్రతిరోజూ విశాఖలో భూ కబ్జాలంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారు. దానికి సాక్ష్యంగా ఊరూపేరూ లేని వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి... ఉత్తరాంధ్రకు, విశాఖకు, రాష్ట్రానికి పరిరక్షణ సమితుల పేర్లతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై, నాయకులపై పక్కా స్కెచ్‌ ప్రకారం నానా అభాండాలూ వేస్తున్నారు.

ప్రతిరోజూ చెబితే అవి ఎంత పచ్చి అబద్ధాలైనా జనాన్ని నమ్మించవచ్చనేది ‘ఈనాడు’ పుట్టిన దగ్గర్నుంచీ రామోజీరావు అనుసరిస్తున్న వ్యూహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో... ఇపుడదే వ్యూహాన్ని విశాఖ విషయంలో అమలు చేస్తున్నారు. అసలు విశాఖలో భూ కబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జా దారుల నుంచి కాపాడిందెవరు? భూములకు సంబంధించి రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం... 

గ‘లీజు’ పనులకు రామోజీ అంకురార్పణ 
రామోజీరావు తన కబ్జాలు, కుట్రలు మొదలుపెట్టింది ఇక్కడేనని చెప్పాలి. ఎందుకంటే ‘ఈనాడు’ అక్షర వ్యాపారాన్ని ఆరంభించింది విశాఖ సీతమ్మ ధారలోనే!. ఇక్కడి సర్వే నెంబరు 50/4లో 2.78 ఎకరాల భూమిని రామోజీ 1974 మార్చి 30న స్థల యజమాని మంతెన ఆదిత్య వర్మ నుంచి 33 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు. మొదటి 14 ఏళ్లూ నెలకు చెల్లించే అద్దె రూ.2,500. తరవాత నెలకు రూ.3వేలు. లీజు గడువు ముగిశాక భూమిని తిరిగి అప్పగించి వెళ్లిపోవాలి. కానీ వెళ్లిపోతే రామోజీ గొప్పేముంది? లీజు స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధి 1989లోనే పుట్టింది రామోజీకి. అక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి 618 గజాలను ప్రభుత్వం తీసుకుంది.

ప్రతిఫలంగా సీతమ్మధారలోనే సర్వే నెంబర్‌ 52లో 872 గజాల స్థలాన్ని కేటాయించారు. మరి ఆ భూమి ఆదిత్య వర్మది కదా? దాన్ని రామోజీ తీసుకున్నది లీజుకు కదా? ప్రభుత్వానికిచ్చే అధికారం ఎవరిది? ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే భూమిని తీసుకోవాల్సింది ఎవరు? వీటన్నిటికీ మనం చెప్పే జవాబులు తప్పని నిరూపించారు రామోజీ. ఆదిత్య వర్మకు విషయం చెప్పకుండా... ప్రభుత్వానికి భూములిచ్చి, పరిహారంగా ఇచ్చిన భూమిని తన కుమారుడి పేరిట  రిజిస్ట్రేషన్‌ చేయించేసుకున్నారు. అలా... విశాఖలో మోసాలు మొదలెట్టారు!!.

రామోజీ మోసాన్ని ఆలస్యంగా గుర్తించారు ఆదిత్య వర్మ. 2007 సెపె్టంబరు 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రామోజీరావు ‘ఈనాడు’కు చీఫ్‌ ఎడిటర్‌ మరి. పోలీసులను అంత తేలిగ్గా విచారణ చేయనిస్తారా? తన మనుషుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. పోలీసులు ఊరుకున్నారు. దీంతో ఆదిత్య వర్మ న్యాయపోరాటం మొదలెట్టారు. చివరకు న్యాయమూర్తి  స్పందించి... పోలీసులకు అక్షింతలు వేయటంతో విచారణ మొదలైంది. 

కోర్టులో మరో డ్రామా!! 
ఈ 420 కేసు కోర్టులో విచారణకు వచ్చాక రామోజీ మరో కుట్రకు తెరలేపారు. రోడ్డు కోసం తాను ప్రభుత్వానికి స్థలమివ్వటం, ప్రతిగా ప్రభుత్వం స్థలాన్ని తన కుమారుడి పేరిట ఇవ్వటం వంటివేవీ తనకు తెలియవంటూ... తాను స్థలం ఇవ్వకముందే అక్కడ రోడ్డు ఉందని వాదించారు. అలాంటపుడు తాను స్థలమెందుకు ఇస్తానని ఎదురు తిరిగారు. దీనికోసం ఏకంగా విశాఖ జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌నే ఫోర్జరీ చేసేశారన్నది అప్పట్లో పిటిషనర్‌ ఆరోపణ. ఫోర్జరీ మ్యాప్‌లను వారు కోర్టుకు కూడా  సమర్పించారు. దీంతో రామోజీపై ఫోర్జరీ, కుట్ర కేసులు కూడా నమోదయ్యాయి. 

లీజు ముగిసినా ఖాళీ చేయకుండా.. 
నిజానికి లీజు గడువు 2007తో ముగిసింది. కానీ రామోజీ ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదు. అప్పటిదాకా నెలకు ఇస్తున్న రూ.3వేలును రూ.10వేలు చేస్తానని, మరో 33 ఏళ్లు లీజు పొడిగించాలని కోరారు. అప్పటికే అక్కడ స్థలం విలువ దాదాపు రూ.40 కోట్లు ఉండటంతో... కుదరదన్నారు యజమాని వర్మ. కానీ రామోజీ కోర్టుకెళ్లారు. మేజి్రస్టేటు కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా 2014 వరకూ లాగారు. అద్దె కూడా పెంచలేదు. లీజు గడువు ముగిసిన 2007 నుంచీ నెలకు రూ. 3వేల చొప్పున కూడా సక్రమంగా చెల్లించలేదు. దీనిపై స్థల యజమాని రెంట్‌ కంట్రోల్‌ కోర్టుకు వెళ్లటంతో...  రామోజీ స్టే తెచ్చారు.

ఈ స్టేతో చాన్నాళ్లు నెట్టుకొచ్చారు. దీన్ని హైకోర్టులో వర్మ సవాలు చేయగా... రామోజీకి ఎదురుదెబ్బ తగిలింది. దిగువ కోర్టు ఇచ్చిన స్టేను కొనసాగించాలంటే.. తుది తీర్పు వెలువడేదాకా అప్పటి విలువల ప్రకారం నెలకు రూ.17 లక్షల చొప్పున ఈనాడు కార్యాలయానికి అద్దె చెల్లించాలని , అది కూడా ప్రతి నెలా 10వ తేదీలోపు చెల్లించాలని, అప్పటిదాకా బకాయిలుగా ఉన్న అద్దె రూ.2.57 కోట్లను తక్షణం ఇచ్చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రామోజీ సుప్రీంకు వెళ్లారు. అక్కడా చుక్కెదురు కావటంతో అద్దె చెల్లించాల్సి వచ్చింది.

తరవాత చెల్లించటం ఇష్టం లేక స్థలాన్ని ఖాళీ చేశారు. అన్ని వ్యూహాలూ విఫలమవటంతో.. నాలుగేళ్ల తరవాత స్థల యజమానితో రాజీపడి కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులనుంచి బయటపడ్డారు. ఇదీ... ఈ నీతుల కొండ బాగోతం. తెల్లారి లేస్తే పేపర్లో అందరికీ సుద్దులు చెప్పే ఈ అనకొండ బాగోతాల్లో ఇది కేవలం విశాఖ పార్ట్‌ మాత్రమే. హైదరాబాద్‌లో సాగించిన అరాచకాలు గానీ, విజయవాడలో బంధువుల్ని మోసం చేసిన తీరుగానీ, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో జరిపిన అక్రమాలు గానీ రాస్తే.. ఎన్ని పార్ట్‌లైనా సరిపోవేమో!! 

తెలుగుదేశం కబ్జాల అడ్డా... విశాఖ 
విచిత్రమేంటంటే కబ్జాలకు కేరాఫ్‌గా మారిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పనిగట్టుకుని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుండటం. వాటికి బాకా ఊదుతూ... అవన్నీ నిజమనేట్లుగా రామోజీరావు దరువేయటం. అందరూ కలిసి విశాఖ ప్రజలకు ఓ ఎల్లో చిత్రాన్ని చూపిస్తుండటం!!. నిజానికి అందినకాడికల్లా తెలుగుదేశం నేతలు కబ్జాలు చేస్తే... సిట్‌ల పేరిట కాలయాపన చేస్తూ... చర్యలకు మాత్రం దూరంగా ఉంటే... గడిచిన మూడేళ్లలో ఏకంగా 430 ఎకరాల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నది ఈ ప్రభుత్వమేనన్న విషయం ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు.

ఎందుకంటే ఈ కబ్జాదారుల్లో తెలుగుదేశం మాజీ ఎంపీ, చంద్రబాబు బంధువైన ఎంవీవీఎస్‌ మూర్తి సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు, అయ్యన్న, బండారుల పుత్రరత్నాలు... ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్లని వెనకేసుకు రావటమే తమ బాధ్యతగా భావించే చంద్రబాబు మీడియా మిత్రులెవరూ వీటి విలువ దాదాపు రూ.5వేల కోట్లకుపైనే ఉంటుందని గానీ, ఇంతటి విలువైన భూముల్ని ప్రభుత్వం కాపాడిందని గానీ చెప్పరు. ఆఖరికి దసపల్లా భూముల్లో పాగా వేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టేసుకున్న చంద్రబాబునూ మహాత్ముడిగానే చెబుతుంటుంది ‘ఈనాడు’. అదీ కథ. 

లేటరైట్‌ మాఫియా కేరాఫ్‌ అయ్యన్న? 
నోటికొచ్చినట్లు తూలటం, తూగటంలో అయ్యన్నపాత్రుడిని మించిన తెలుగుదేశం నాయకుడు లేడనే చెప్పాలి. విశాఖలో లేటరైట్‌ తవ్వకాలకు సంబంధించి ఆయన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తరవాత అత్యంత విలువైనది లేటరైటే. నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో లేటరైట్‌ నిక్షేపాలున్నాయి. కాకపోతే వీటిని తవ్వే హక్కు గిరిజనులకే ఉండటంతో 2009 జులైలో సింగం భవాని అసనగిరిలో 5 హెక్టార్లకు, సుందరకోటలో 35.5 హెక్టార్లకు తవ్వకం అనుమతులు పొందారు.

బమిడికలొద్దిలో 110 హెక్టార్లకు జర్తా లక్ష్మణ్‌రావు అనుమతి పొందారు. 5 హెక్టార్లు మించితే పర్యావరణ అనుమతులు తప్పనిసరి కావటం... వీటికి అనుమతులు రాకపోవటంతో వారు తవ్వకాలు చేపట్టలేకపోయారు. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అయ్యన్న కుటుంబీకుల కన్ను లేటరైట్‌ గనులపై పడింది. తొలుత అధికారాన్ని ఉపయోగించి సింగం భవానీకి చెందిన 5 హెక్టార్లను చెరబట్టారు. వేరొక ఎంపీ కుమారుడితో కలిపి తవ్వకాలు చేపట్టి ... 11 నెలల వ్యవధిలో రూ.20 కోట్లకుపైగా విలువైన ఖనిజాన్ని స్వాహా చేశారు. ఆ తరవాత 110 హెక్టార్లపై కన్నేశారు.

లక్ష్మణ్‌రావును, అతని దగ్గర సబ్‌లీజుకు తీసుకున్న వారిని తొలుత 80 శాతం వాటా అడిగి... ఇవ్వననటంతో కేసులు పెట్టి వేధింపులకు దిగారు. సహకరించని సర్పంచ్‌ను సైతం చెక్‌పవర్‌ రద్దుచేసి మరీ వేధించారు. చివరకు అక్కడ తవ్వకాలు జరపకుండా కలెక్టర్‌ ద్వారా నిషేధం ఉత్తర్వులు కూడా జారీ చేయించారు. ఆ ప్రాంతం మొత్తానికి నిషేధం ఉత్తర్వులు వర్తించినా.. తన చేతుల్లో ఉన్న 5 హెక్టార్లను మాత్రం ఆయన గారి పుత్రరత్నం అడ్డూఅదుపూ లేకుండా తవ్వేశాడు. 

‘గీత’o దాటి కబ్జాలు 
టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి రుషికొండ ప్రాంతంలో ఏకంగా 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. బీచ్‌ను ఆనుకుని ఉండే అత్యంత విలువైన ఈ స్థలం... గీతం యూనివర్సిటీకి సమీపంలోనే ఉంది. దీన్ని ఆక్రమించుకుని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్‌ వాల్‌ కట్టేశారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా... మనోడే కదా అని టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ఈ కబ్జాలపై దృష్టిపెట్టింది. ప్రహరీని తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాదీనం చేసుకుంది. అప్పట్లో నానా యాగీ చేయబోయిన పచ్చ బ్యాచ్‌... ప్రభుత్వం స్థిరంగా నిలబడటంతో తోక ముడుచుకుంది. 

పల్లా సోదరుడి భూ ఫలహారం.. 
అధికారులు స్వాదీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు. ప్రభుత్వ జోక్యంతో వెనక్కి తగ్గాడు.  

బినామీ పేర్లతో.. లెక్కేలేదు 
ఇవన్నీ ఒకెత్తయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో చేసిన కబ్జాలకు లెక్కేలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా విశాఖ, దాని చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటూ వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాదీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్‌ విలువ రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులూ నమోదు చేస్తున్నారు.  

‘బండార’o బయటపడి... పరాజయం 
► పెందుర్తి మండలం గుర్రమ్మపాలెంలో గతంలో ఏపీఐఐసీ 110 ఎకరాలు సేకరించి...  ఎకరాకు రూ. 23 లక్షల చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించింది. అక్కడే బండారు చక్రం తిప్పాడు. ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాలకు బినామీలను సృష్టించి... ఆ పరిహారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. అక్కడితో ఆగకుండా... భూమికి పరిహారం పొందిన ప్రతి రైతు నుంచీ ఎకరాకు రూ.5 లక్షల చొప్పున తనకు కట్టాల్సిన పరిహారంగా నిర్ణయించి మరీ లాక్కున్నాడని అప్పట్లో రైతులు బహిరంగంగానే వాపోయారు. కాకపోతే ఇలా ఎన్ని కోట్లు మింగేసినా... అధికారంలో ఉన్నది మిత్రపక్ష తెలుగుదేశం కాబట్టి రామోజీకి ఇలాంటివేవీ కనిపించలేదు. 

► ఆ మధ్య దుమారం రేపిన పెందుర్తి మండలం లక్ష్మీపురం భూ వివాదంలోనూ బండారు తనయుడిదే కీలకపాత్ర. అసలు వారసులకు– నకిలీలకు తగవు పెట్టింది అస్మదీయులైతే, ఈ వివాదాన్ని సెటిల్‌ చేసేందుకు ఈయన భారీగా రూ.10 కోట్ల వరకూ డిమాండ్‌ చేశాడని, తాము ఇవ్వనందుకు కేసులతో వేధిస్తున్నారని వారసులు అప్పట్లో వాపోయారు కూడా.  

► ఇక వేపగుంట, పెందుర్తి ప్రాంతంలో బీఆర్‌టీఎస్‌ రహదారిలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్‌ రూపంలో నష్టపరిహారం చెల్లించారు. ఇందులో దాదాపు 300 టీడీఆర్‌లు ఇప్పించినందుకు ఈ పుత్ర రత్నం దాదాపు 5 కోట్లు కొట్టేశారన్నది అప్పట్లో బహిరంగంగానే వినవచ్చింది 

► ఇవన్నీ ఈ పుత్రరత్నం భూములకు సంబంధించిన దందాలు. ఇక ఉద్యోగాలిప్పిస్తామంటూ వసూళ్లు, వ్యక్తిగత సెటిల్‌మెంట్లు వంటివన్నీ లెక్కలోకి తీసుకుంటే ఎన్ని పేజీలైనా చాలవు మరి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement