విశాఖలో పరిపాలన రాజధాని కావాలనే నినాదంతో టెక్కలిలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం ‘మన విశాఖ.. మన రాజధాని’ నినాదం మార్మోగింది. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని విద్యార్థిలోకం గళమెత్తింది. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్, టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్, విద్యార్థి, నిరుద్యోగ పోరాటసమితి నాయకుడు టి.సూర్యం నేతృత్వంలో విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు ఊపిరిపోసే విధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో పరిపాలన రాజధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మన భావితరాల బంగారు భవిష్యత్ కోసం విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో వెనుకడుగు లేదని స్పష్టం చేశారు.
జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్ మాట్లాడుతూ మన భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధానితో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ది చెందుతుందని చెప్పారు. కాగా, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment