
ఇబ్రహీంపట్నం(మైలవరం): రాష్ట్ర విభజన హామీల సాధనకు ఫిబ్రవరిలో ఉమ్మడి పోరుకు శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు తెలిపారు. పశ్చిమ కృష్ణా జిల్లా మహాసభలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏవిధమైన హామీలు పొందారు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాడితే తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. గుంటూరు జిల్లా గొట్టుపాడులో దళితులపై దాడిచేసిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములను అరెస్ట్ చేయకపోతే ‘చలో గుంటూరు’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమాలకు సిద్ధం కండి
పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా రింగ్‌సెంటర్‌లో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఏ కాలనీ గ్రౌండ్ నుంచి స్థానిక రింగ్‌సెంటర్ వరకు కార్యకర్తలు, పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో బాబూరావు మాట్లాడుతూ పాలకులు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రజలపై భారలు మోపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆయిల్ ఉత్పత్తుల ధరలు పెంచడమేనని చెప్పారు. ధరలు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఉద్యమించనున్నుట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, స్వరూపారాణి, జమలయ్య, శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆర్.రఘు, నాగేశ్వరరెడ్డి, పీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.
పశ్చిమ కృష్ణా కార్యదర్శిగా డీవీ కృష్ణ
రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఎం జిల్లా మహాసభలో పశ్చిమకృష్ణా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా డీవీ కృష్ణ, కార్యవర్గదర్శివర్గ సభ్యులుగా దోనేపూడికాశీనా«థ్, ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, శ్రీదేవి, పీవీ ఆంజనేయులు, నాగేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్‌లను ఎన్నికయ్యారు. మరో 24 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.