సీపీఎం నేత సీహెచ్ బాబూ రావు(పాత చిత్రం)
విజయవాడ: సాధారణ వర్షాలకే రాజధాని ప్రాంతాలైన విజయవాడ, అమరావతిలు ముంపుబారిన పడ్డాయని సీపీఎం నేత, సీఆర్‌డీఏ ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..నగరంలో వర్షాలకు 5 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రూ.461 కోట్లతో వర్షపు నీటి కాలువలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది..మరి భారీ వర్షానికి రోడ్లు జలమయం ఎలా అయ్యాయని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులు పొంగుతున్నాయని, సెక్రటేరియట్‌లోని మంత్రుల కార్యాలయాలు కూడా వర్షం ప్రభావానికి గురయ్యాయని వెల్లడించారు. అలాగే రాజధానిలో అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయని, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. 60 మిల్లీమీటర్ల వర్షపాతానికే విజయవాడ నగరం ముంపునకు గురవుతోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన వర్షపు నీటి కాలువలను కుదించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే వర్షపు నీటి కాలువల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై తక్షణం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జింఖానా గ్రౌండ్స్‌లో జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో నగర సమస్యలపై భారీ సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment