సీఎం చంద్రబాబు ట్వీట్
సాక్షి, అమరావతి: మట్టిలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలోని మార్పులవల్లే పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మట్టి రహదారిలో పగుళ్లు ఏర్పడ్డాయని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తుపాన్లు, సముద్రాలు, ఎండలనే జయించిన సీఎం ప్రకృతిని జయించలేకపోయారా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. కీలక ప్రాజెక్టు దగ్గరకి వెళ్లే సిమెంట్‌తో నిర్మించిన రహదారి భారీ ఎత్తున బీటలు వారితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులపై చర్యలు తీసుకోకుండా, తప్పంతా ప్రకృతిదేనని వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే దానిని వెంటనే ప్రతిపక్షాలపైకి నెట్టేసే సీఎం ఈసారి తప్పును ప్రకృతి మీదకి నెట్టేశారని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా కేంద్రం పగుళ్లు సృష్టించిందంటూ ధర్మపోరాట దీక్షలకు దిగరు కదా అంటూ చురకలేశారు.
అది మట్టి రహదారా మహాశయా..
శీతాకాలంలో పగుళ్లకు వేజలైన్ వాడాలంటూ ఒక నెటిజన్ సెటైర్
ఫొటోలు, వీడియోల్లో కిలోమీటరుకుపైగా ఉన్న ఆ రహదారి సిమెంట్‌తో నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అది మట్టితో నిర్మించిన రహదారి అని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ భూమిలో తేమ శాతం ఎంత, నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది సివిల్ ఇంజనీర్ల కనీస ధర్మమని, అలాంటిది తేమ శాతం తగ్గడం వల్ల రహదారి పగిలిపోయిందని సీఎం బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. రేపటిరోజున ఏదైనా జరగరానిది జరిగితే ఎండ వేడి పెరగడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ ప్రకటిస్తారా? అని దుయ్యబట్టారు. సీఎం చెప్పినట్లు వాతావరణ మార్పులవల్ల పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే గోదావరి రెండు జిల్లాలు మునిగిపోయే ప్రమాదముందన్న భయాందోళనలను వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయంలో పెచ్చులూడిపోయి నీరు లోపలికి రావడంతోపాటు గోడలు కూడా కూలిపోయాయని, ఇప్పుడు కీలక ప్రాజెక్టు వద్ద రోడ్డే ఇలా పగిలిపోయిందంటే కాంట్రాక్టర్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గోదావరి నది పక్కన తేమ తగ్గితేనే రహదారి ఇలా పగిలిపోయిందని, ఇప్పుడు కృష్ణా నది పక్కన రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, మెత్తటి నేలల్లో ఇంతటి ఎత్తైన భవనాలు ఎలా తట్టుకుంటాయంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టిలో తేమ శాతం తగ్గడం వల్ల కాదు.. పనుల్లో అవినీతి శాతం పెరగడం వల్ల పగుళ్లు ఏర్పడ్డాయన్నారు.
సెటైర్లే సెటైర్లు...
సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు భారీ ఎత్తున సెటైర్లు విసురుతున్నారు. ఈ రోడ్లను సింగపూర్ టెక్నాలజీతో నిర్మించారా? లేక జపాన్ టెక్నాలజీనా? అని కొందరు ప్రశ్నిస్తే.. వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా ఈ రోడ్డును నిర్మించారంటే ఆ ఇంజనీర్లు తప్పక నారాయణ కాలేజీ నుంచి వచ్చినవాళ్లే అయి ఉంటారంటూ జోకులేస్తున్నారు. వేజలైన్ రాస్తే శీతాకాలంలో పగుళ్లు రావని, ఇకనుంచీ మట్టిలో వేజలైన్ కలిపి రోడ్లు వేయాలంటూ.. దానికి రూ.100 కోట్లు కేటాయించడంటూ ట్వీట్ చేశారు. రెయిన్‌గన్స్ టెక్నాలజీని వినియోగించాలని చురకలేశారు. ప్రకృతినే కంట్రోల్ చేసినవాళ్లకు ఈ పగుళ్లు ఎంతంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో కలవడం ప్రకృతికి కూడా ఇష్టం లేదనుకుంటా అని మరికొంతమంది చమత్కరించారు. సాధారణంగా సీఎం చేసే ట్వీట్‌కు 500లోపు లైకులు, 150 నుంచి 200లోపు ప్రతిస్పందనలు ఉంటాయి. అయితే సీఎం తాజా ట్వీట్‌కు సోమవారం సాయంత్రానికే దాదాపు 3,500 లైకులు, 950కిపైగా రీట్వీట్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment