ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా? | AP High Court Ask to Chandrababu Naidu For Darma Porata Deeksha Funds | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?

Published Fri, Oct 25 2019 3:50 AM | Last Updated on Fri, Oct 25 2019 8:11 AM

 AP High Court Ask to Chandrababu Naidu For Darma Porata Deeksha Funds - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ‘ధర్మపోరాట దీక్ష’కు రూ.10 కోట్ల ప్రజాధనం ఖర్చుచేయడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. అసలు ఏ చట్ట నిబంధన కింద ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిధులను విడుదల చేసిన అధికారులు ఎవరంటూ ఆరా తీసింది. ఇలా ప్రజాధనాన్ని వృథా చేసే హక్కు ఎవ్వరికీ లేదంది.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి ధర్నాలు, దీక్షలకు ప్రజాధనాన్ని వెచ్చించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందో కూడా తెలియచేయాలంది. తదుపరి విచారణను నవంబర్‌  21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

రాజకీయ కార్యక్రమంగా ధర్నా
తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ధర్మపోరాట దీక్షతో ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని, ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీచేయాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో రూ.10కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఢిల్లీలో ఒకరోజు ధర్నా నిర్వహించారని వివరించారు. వెంటనే ధర్మాసనం.. ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా! అంటూ విస్మయం వ్యక్తంచేసింది. ఆ డబ్బంతా కూడా పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఇలా ప్రజాధనాన్ని రాజకీయ కార్యక్రమాల కోసం విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని నిలదీసింది.

ఇది చాలా తీవ్రమైన విషయమంది. అసలు ఏ చట్టం కింద.. ఏ నిబంధనల కింద ఆ రూ.10 కోట్లు విడుదల చేశారని ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. రూ.10 కోట్ల కంటే ఎక్కువే ఉండొచ్చునన్నారు. ఏ అధికారంతో అంత భారీ నిధులను ఓ ధర్నా కోసం ఇచ్చారో వివరిస్తూ పూర్తి వివరాలను కౌంటర్‌ రూపంలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement