సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిర్వహించిన ఒక్కరోజు దీక్షకు కేవలం రూ.2.83 కోట్లే ఖర్చయ్యిందంటూ మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బుకాయిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన హస్తినలో జరిగిన ధర్మపోరాట దీక్ష కోసం ఈ నెల 6వ తేదీన అదనపు బడ్జెట్ రూ.10 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర ఆర్‌టీ నెంబర్ 215 జీవో జారీ చేశారు. ఇంత స్పష్టంగా జీవో ఉన్నప్పటికీ సీఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బుకాయింపులు, అబద్ధాలకు తెరతీశారు. దీక్ష కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రూ.10 కోట్లు వ్యయం చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేబినెట్ భేటీలో చర్చించడంతోపాటు వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపన కార్యక్రమంలోనూ చంద్రబాబు పార్టీ పరంగానే ఖర్చు చేశామని చెప్పారు.
కేబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష కోసం రూ.10 కోట్లు వ్యయం చేయలేదని, కేవలం రూ.2.83 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. రూ.10 కోట్లు విడుదల చేశామంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో గురించి విలేకరులు ప్రశ్నించగా, మంత్రి మౌనం వహించడం గమనార్హం. మరి ఆర్‌టీ జీవో 215ను ఏ ప్రభుత్వం జారీ చేసిందో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పాలి. జీవో జారీ చేసి, అదంతా అవాస్తవం అంటూ ముఖ్యమంత్రి చెపుతుండడం చూసి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ఈనెల 6న రూ. 10 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవో
Comments
Please login to add a commentAdd a comment