ప్రచార దీక్ష ! | Chandrbabu Naidu Dharma Porata Deeksha In Vizianagaram | Sakshi
Sakshi News home page

ప్రచార దీక్ష !

Published Tue, Nov 27 2018 6:57 AM | Last Updated on Tue, Nov 27 2018 6:57 AM

Chandrbabu Naidu Dharma Porata Deeksha In Vizianagaram - Sakshi

మున్సిపాలిటీ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

వారు ఏం చేసినా... పటిష్టమైన ప్రచారం కావాలి. తాము చేసిందే న్యాయం...తాము చెప్పిందే వేదం... అని నమ్మించాలి. చేసిన తప్పిదాలన్నీ... తమ ప్రత్యర్థులవల్లే జరిగాయని తెలియజేయాలి. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నతెలుగుదేశం తీరు. పార్టీ ప్రయోజనాలకూ ప్రభుత్వ నిధులే వెచ్చించేస్తారు.అందుకోసం చాలా ఆర్భాటం చేస్తారు. ఖజానాను సొంత జాగీరులా వాడేస్తారు.నాలుగేళ్లపాటు కేంద్రంలో కీలకపదవులు పొందినప్పుడు హోదాకోసం నోరెత్తలేదుసరికదా... నాడు పార్టీ అధినేత ప్యాకేజీకోసం వెంపర్లాడి... ఇప్పుడేమో కేంద్రంఅన్యాయం చేసిందంటూ... కొత్త పల్లవి అందుకుని మళ్లీ జనాన్ని నమ్మించేందుకుదీక్షల పేరుతో తెగ పాట్లు పడుతున్నారు.

సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రత్యేక హోదా సంజీవనా... స్టేటస్‌ కంటే ప్యాకేయే మిన్న... అంటూ నాలుగేళ్లపాటు కేం ద్రం వద్ద రకరకాలుగా మాట్లాడిన ఆ నాలుకలు తిరిగి మడత పడ్డాయి. హోదా కావాలంటూ ఉన్నట్టుండి కొత్తరాగం ఎత్తుకున్నాయి. జనంలో హోదాకోసం పెరుగుతున్న ఆకాంక్షను ఇప్పుడు తనకు అనుకూలంగా మలచుకోవడానికి కొత్తగా ధర్మపోరాట దీక్షల పేరుతో సర్కారు ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. పనిలోపనిగా తమ పార్టీకి విస్తృత ప్రచారం కల్పించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని అయోధ్య మైదానంలో మంగళవారం ధర్మ పోరాట దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మున్సిపల్, పోలీస్,రెవెన్యూ యంత్రాంగమంతా ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టణంలోని అన్ని రోడ్లును ఎన్నడూ లేని విధంగా గత రెండు రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు. పోలీసులు నాలుగు రోజులుగా బందోబస్తు నిర్వహణలో ఉన్నారు.

1200 బస్సులు వినియోగం
అధికార తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటంతో ధర్మ పోరాట దీక్షకు ప్రజలు వస్తారో రారోనన్న భయం ఆ పార్టీ నాయకుల్ని వెంటాడుతోంది. అంతే... జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులకు జనాల తరలింపు బాధ్యతలు అప్పగించేశారు. ఆర్టీసీ నుండి 1200 బస్సులతో జనాలను తరలించడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయనగరం డివిజన్‌ పరిధిలోని 28 డిపోల్లో ఉన్న 2500 బస్సుల్లో 1200 బస్సులు కావాలని అధికార పార్టీ నాయకులు ఆర్టీసీ అధికారులను సంప్రదించారు. ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ తెంటు లకు‡్ష్మనాయుడు ఆర్టీసీ అధికారులతో సోమవారం సాయంత్రం వరకు సంప్రదింపులు జరిపారు. అయితే నగదు చెల్లించనిదే బస్సులు ఇవ్వలేమని ఆర్టీసీ అధికారులు చివరి వరకూ పట్టుబట్టారు. కానీ అధికారం ముందు నిలబటలేక వారు అడిగినదానికి ఒప్పుకున్నారు.

సభకు వస్తే రూ. 300లు
సీఎం ధర్మ పోరాట దీక్షకు జనాలను తరలించడానికి అధికార పార్టీ నేతలు గ్రామాల్లో ఒక్కొక్కరికి రూ.300లు చొప్పున చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. విజయనగరం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో అధికార పార్టీ నేతలు సోమవారం రాత్రి వరకు జనాలను సభకు రప్పించడానికి బేరసారాలు జరపడం విశేషం. ఉపాధి కూలీలకు టీడీపీ నేతలు బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నారు. సభకు వస్తే దక్కే ప్రయోజనాలతో పాటు పనికి వెళ్లకపోయినా మస్తర్లు వేయించేస్తామంటూ ప్రలోభపెడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు
ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో అన్ని అనుమతులు తీసుకుని ఆ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికార పార్టీ నేతలు అసూయతో ఫ్లెక్సీలు జనజీవనానికి ఆటంకంగా ఉన్నాయని మున్సిపాలిటీ అధికారులతో తొలగించేశారు. చంద్రబాబు రాకతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అయోధ్య మైదానం వరకు భారీగా ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేసినా మున్సిపాలిటీ అధికారులు అడ్డుచెప్పలేదు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ను అడిగితే అనుమతులు అడిగారు డబ్బులు చెల్లించి ఉంటారని చెబుతున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక రూలు, ప్రతిపక్ష నేతలకు మరో రూలా అని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ ఇద్దరి మధ్య చిచ్చు
జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, నియోజకవర్గ ఎమ్మెల్యే మీసాల గీతల మధ్య ధర్మ పోరాట దీక్ష చిచ్చుపెట్టిందని ఆపార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ధర్మ పోరాట దీక్షాస్థలి శంకుస్థాపన విషయంలో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు, దీంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అండగా ఉండటం కొసమెరుపు.

ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
అయోధ్య మైదానంలో నిర్వహించే ధర్మ పోరాట దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు హెలికాఫ్టర్‌లో పోలీసు పరేడ్‌ మైదానానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్‌లో ఆర్‌ఆండ్‌బీ జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, రింగ్‌రోడ్డు, ఐస్‌ ప్యాక్టరీ మీదుగా దీక్షాస్థలికి చేరుకుంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. కాగా సీఎంతో పాటు ముఖ్యనేతలంతా వస్తుండటంతో పోలీసు యంత్రాంగం 1200 మంది సిబ్బందిని భద్రత కోసం వినియోగించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement