సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్‌టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకప్పుడు చక్రం తిప్పింది ఆయనేనా? అనే సందేహం కళా అనుచరులను వెంటాడుతోంది ఇప్పుడు! గ్రామస్థాయి నాయకుడైన నడికుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించి మరీ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి టికెట్‌ను తన్నుకుపోయారు.
అతనికి ఇప్పించేందుకు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడిన రాజకీయ వైకుంఠపాళిలో కళా పావుగా మారిపోయారని ‘సాక్షి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. ఆఖరి నిమిషంలో కళా తేరుకొని హైదరాబాద్, విజయవాడ మధ్య చక్కర్లు కొట్టినా వ్యయప్రయాసలు మాత్రమే మిగిలాయి. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది.
తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ‘కమ్మ’ని వ్యూహం ఫలించింది. టీడీపీలో మరో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే కళావెంకటరావు ముందు కనిపిస్తోంది. కుటుంబ హెచ్చరికలను బేఖాతరు చేసి అక్కడికి వెళ్తారా అనేదీ సందేహమే. ఇక మిగిలిన మరో దారి విజయనగరం లోక్‌సభ టిక్కెట్ మాత్రమే. తీరా అక్కడ ఐవీఆర్‌ఎస్ సర్వేల్లోనూ కళావెంకటరావు వినిపించట్లేదు. దీన్నిబట్టి అక్కడా టికెట్ వచ్చేట్లు కనిపించట్లేదు. పాపం... కళావెంకటరావు! ఆయన పరిస్థితి కరివేపాకు కన్నా అధ్వానంగా అయిపోయిందని ఆయన అనుచరులు చంద్రబాబుపై లోలోనే రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment